వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పీఎం కిసాన్ ద్వారా రైతులకు బదిలీ చేయబడిన మొత్తం రూ. 3 లక్షల కోట్లు దాటింది
వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ప్రచారంలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరారు
Posted On:
29 FEB 2024 4:46PM by PIB Hyderabad
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ కొత్త మైలురాయిని అధిగమించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని యవత్మాల్ నుండి 16వ విడతను విడుదల చేయడంతో ఈ పథకం 11 కోట్లకు పైగా అర్హులైన రైతు కుటుంబాలకు లబ్ది చేకూర్చింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 3 లక్షల కోట్లు పంపిణీ చేయబడ్డాయి. ఇందులో రూ. 1.75 లక్షల కోట్లు కేవలం కోవిడ్ కాలంలోనే అర్హులైన రైతులకు నేరుగా నగదు ప్రయోజనాలు అవసరమైనప్పుడు బదిలీ చేయబడ్డాయి.
దేశంలోని రైతు కుటుంబాలకు సానుకూల అనుబంధ ఆదాయ మద్దతు అవసరం అలాగే ఉత్పాదక, పోటీ, వైవిధ్యభరితమైన, సమ్మిళిత మరియు స్థిరమైన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఫిబ్రవరి 2, 2019న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతల్లో సంవత్సరానికి రూ. 6000/ అందించడం జరుగుతుంది. ప్రతి నాలుగు నెలలకు రూ.2000/- చొప్పున మూడు సమాన వాయిదాలలో ఈ మొత్తం ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ మోడ్ ద్వారా ప్రయోజనం నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు
ప్రభుత్వ సంక్షేమ పథకాల సంతృప్తిని నిర్ధారించడానికి ఇటీవల 2.60 లక్షలకు పైగా గ్రామ పంచాయితీలలో వికసిత భారత్ సంకల్ప్ యాత్రను ప్రభుత్వం నిర్వహించింది. దీంతో 90 లక్షల మంది అర్హులైన రైతులు పిఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదయ్యారు.
గత ఐదేళ్లలో ఈ పథకం అనేక మైలురాళ్లను దాటింది మరియు ఈ పథకం పరిపూర్ణ దృష్టి, స్థాయి మరియు అర్హులైన రైతుల ఖాతాలకు నేరుగా నిధుల బదిలీ అవుతుండడంతో ప్రపంచ బ్యాంక్‌తో సహా వివిధ సంస్థల నుండి ప్రశంసలు అందుకుంది.
ఉత్తరప్రదేశ్ రైతులపై ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) నిర్వహించిన ఒక అధ్యయనంలో పిఎం-కిసాన్ ప్రయోజనాలు మెజారిటీ రైతులకు చేరాయని మరియు వారు ఎలాంటి లీకేజీలు లేకుండా పూర్తి మొత్తాన్ని అందుకున్నారని వెల్లడయింది. ఆ అధ్యయనం ప్రకారం పిఎం-కిసాన్ కింద నగదు బదిలీని పొందుతున్న రైతులు వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల కొనుగోలుకు ఆ మొత్తాన్ని వాడుతున్నట్టు వెల్లడయింది.
పారదర్శకత కోసం సాంకేతికత
పథకాన్ని మరింత సమర్ధవంతంగా ప్రభావవంతంగా మరియు పారదర్శకంగా మార్చే లక్ష్యంతో రైతు కేంద్రీకృత డిజిటల్ మౌలిక సదుపాయాలలో నిరంతర మెరుగుదలలు, మధ్యవర్తి ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ పథకం యొక్క ప్రయోజనాలు చేరేలా చేయడం జరిగింది. పిఎం-కిసాన్ పోర్టల్ యుఐడిఏఐ, పిఎఫ్‌ఎంఎస్,ఎన్‌పిసిఐ మరియు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లతో ఏకీకృతం చేయబడింది. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు ఇతర వాటాదారులు రైతులకు త్వరిత సేవలను అందించడానికి పిఎం-కిసాన్ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్నారు.
రైతులు పిఎం-కిసాన్ పోర్టల్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు మరియు సమర్థవంతమైన మరియు సమయానుకూల పరిష్కారం కోసం 24x7 కాల్ సదుపాయం సహాయం తీసుకోవచ్చు. భారత ప్రభుత్వం 'కిసాన్ ఇ-మిత్ర' (వాయిస్ ఆధారిత ఏఐ చాట్‌బాట్)ని కూడా అభివృద్ధి చేసింది. రైతులు ప్రశ్నలను లేవనెత్తడానికి మరియు వాటిని నిజ సమయంలో వారి స్వంత భాషలో పరిష్కరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కిసాన్-ఇమిత్ర ఇప్పుడు 10 భాషల్లో అంటే, ఇంగ్లీష్, హిందీ, ఒడియా, తమిళం, బంగ్లా, మలయాళం, గుజరాతీ, పంజాబీ, తెలుగు మరియు మరాఠీలలో అందుబాటులో ఉంది.
ఈ పథకం సహకార ఫెడరలిజానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. ఎందుకంటే రాష్ట్రాలు రైతుల అర్హతను నమోదు చేసి, ధృవీకరిస్తాయి. ఈ పథకానికి భారత ప్రభుత్వం 100% నిధులను అందిస్తుంది. స్కీమ్ యొక్క సమ్మిళిత స్వభావాన్ని ప్రతి నలుగురిలో కనీసం ఒక మహిళా రైతు, చిన్న మరియు సన్నకారు రైతులలో 85% కంటే ఎక్కువ మంది ఈ పథకం కింద లబ్ధిదారులు కావడం ద్వారా ప్రతిబింబిస్తుంది.
****
(Release ID: 2010495)
Visitor Counter : 275