ఆయుష్

గువాహటి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో పంచకర్మ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను, ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనొవాల్

Posted On: 24 FEB 2024 6:51PM by PIB Hyderabad

గువాహటి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో   పంచకర్మ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను, ఆసుపత్రిని  ఈరోజు కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనొవాల్ ప్రారంభించారు. క్యాంపస్ పరిధిలో పునరుద్ధరించిన స్టేట్ ఫార్మసీ కేంద్రాన్నికూడా ఆయుష్ మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన  శ్రీ సర్బానంద సోనొవాల్  ఆయుర్వేద రంగానికి గువాహటి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అందిస్తున్న సేవలను ప్రశంసించారు.ఆయుర్వేద  విద్యను అందిస్తున్న కళాశాల ఈ రంగంలో అనేక మంది  నిపుణులను దేశానికి అందించిందన్నారు.  రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగంలో  కళాశాల కీలకంగా ఉందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన . పంచకర్మ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్,  మరియు పునరుద్ధరించిన స్టేట్ ఫార్మసీ కేంద్రం సహకారంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న ఆయుష్ రంగంలో కళాశాల మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తుందని శ్రీ  సోనొవాల్ పేర్కొన్నారు. 

' ప్రపంచవ్యాప్తంగా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రజలు  యోగాని పాటిస్తున్నారు; ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాలు ఆరోగ్య సంరక్షణ రంగంలో కీలకంగా మారాయి. ఆధునిక యుగంలో సాంప్రదాయ  పంచకర్మ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఒత్తిడిని పంచకర్మ తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గడం వల్ల  శరీరం , మనస్సుపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.  సానుకూల ప్రభావాన్ని చూపుతుంది' అని మంత్రి అన్నారు. కొత్తగా ప్రారంభించిన  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో విద్యార్థులు, నిపుణులకు  పంచకర్మ విధానాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. పంచకర్మ ప్రయోజనాలు ప్రజలకు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  చేసిన ప్రయత్నాల వల్ల  యోగాకు  విశ్వవ్యాప్త ప్రజాదరణ లభించిందని మంత్రి తెలిపారు.  ఆయుష్ వ్యవస్థలు కూడా ప్రజలలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయన్నారు. అస్సాం రాష్ట్రంలో కొత్త ఆయుర్వేద కళాశాలలు, ఆయుర్వేద ఆసుపత్రులు, దిబ్రూగఢ్ లో 100 పడకల యోగా, నేచురోపతి ఆసుపత్రి తో పాటు 500 ఆయుష్ వెల్ నెస్ కేంద్రాలను  ఏర్పాటు చేశామని శ్రీ సోనొవాల్ వివరించారు. పసిఘాట్, షిల్లాంగ్ లోని ఆయుష్ సంస్థల సామర్థ్యాన్ని దీనివల్ల ఈ ప్రాంతంలో ఆయుష్ రంగాన్ని మరింత బలోపేతం అవుతుందన్నారు. 

కార్యక్రమంలో  అస్సాం ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కేశవ్ మహంత, పశ్చిమ గౌహతి ఎమ్మెల్యే రామేంద్ర నారాయణ్ కలితా, దిస్పూర్ ఎమ్మెల్యే అతుల్ బోరా. గౌహతి ఈస్ట్ ఎమ్మెల్యే సిద్ధార్థ భట్టాచార్యతో పాటు ఆయుష్ నిపుణులు, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

***



(Release ID: 2008944) Visitor Counter : 57