ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కోసం భాగస్వామ్యానికి అవకాశమున్న ప్రాంతాలను అన్వేషించడానికి అవసరమైన మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళిక గురించి భాగస్వాములతో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి
న్యూఢిల్లీలో 2024 సెప్టెంబర్ లో నిర్వహించనున్న - వరల్డ్ ఫుడ్ ఇండియా 2024
Posted On:
23 FEB 2024 5:17PM by PIB Hyderabad
న్యూఢిల్లీ లోని ఇన్వెస్ట్ ఇండియా వద్ద నిన్న పరిశ్రమ వర్గాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎఫ్.పి.ఐ) కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్ అధ్యక్షత వహించారు. 2024 సెప్టెంబర్, 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 తదుపరి ఎడిషన్ గురించి పరిశ్రమ వర్గాలకు వివరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 లో పరిశ్రమ వర్గాల సహకారం, అంచనాలపై ఈ సమావేశంలో చర్చించారు. అదేవిధంగా, వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కోసం భాగస్వామ్యానికి అవకాశమున్న ప్రాంతాలను అన్వేషించడానికి అవసరమైన మంత్రిత్వ శాఖ కార్యాచరణ ప్రణాళిక గురించి పరిశ్రమ వర్గాలతో వరుస చర్చలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా కీలక వ్యవసాయ-ఆహార సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చురుకుగా పాల్గొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న వృద్ధి, విస్తారమైన అవకాశాల గురించి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎఫ్.పి.ఐ) కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్ తమ కీలకోపన్యాసంలో ప్రస్తావించారు. మంత్రిత్వ శాఖ ఎంతో ఉత్సాహంగా వరల్డ్ ఫుడ్ ఇండియా 3వ ఎడిషన్ను నిర్వహిస్తోందని, మునుపటి 2023 ఎడిషన్ తో పోలిస్తే ఈ సారి మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టినట్లు ఆమె తెలియజేశారు. న్యూఢిల్లీలో 2024 సెప్టెంబర్, 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే ఈ మెగా ఫుడ్ ఈవెంట్ లో ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అన్ని కంపెనీలను హృదయ పూర్వకంగా ఆహ్వానించారు.
ప్రతిస్పందనగా, ఈ సమావేశంలో పాల్గొన్న కంపెనీలన్నీ వరల్డ్ ఫుడ్ ఇండియా-2024 లో భాగస్వాములు కావడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ, తమకు కేటాయించిన స్టాల్ ప్రదేశాలలో తమ ఉత్పత్తులను, సాంకేతికతలను ప్రదర్శించడానికి సంసిద్ధతను తెలియజేశాయి. అదేవిధంగా, ప్రణాళికాబద్ధమైన ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సహకరించడానికి ఈ కంపెనీలు తమ బలమైన ఆసక్తిని కూడా వ్యక్తం చేశాయి. గమనించదగ్గ సూచనలు, స్పందనలను స్వీకరించి ఈ సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి భాగస్వాములందరూ కలిసి వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎఫ్.పి.ఐ) కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్ తమ ప్రసంగాన్ని ముగించారు. విభిన్న శ్రేణి వాటాదారుల బలమైన భాగస్వామ్యాన్నీ, ఒప్పందాలను పెంపొందించడం కోసం వ్యక్తిగత బలాలను వినియోగించడంతో పాటు, అనుబంధ మద్దతును అందించడం యొక్క ప్రాముఖ్యతను ఆమె ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
దీనితో పాటు, భాగస్వామ్య వివరాలను పటిష్టం చేయడానికి కంపెనీలతో సన్నిహితంగా ఉండాలని ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ (ఇన్వెస్ట్ ఇండియా) ను కోరడం జరిగింది.
****
(Release ID: 2008741)
Visitor Counter : 119