వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వాణిజ్య చర్చల విషయంలో భారత్‌ తొందరపడదు, జాగ్రత్తగా వ్యవహరిస్తుంది & క్రమపద్ధతిని అనుసరిస్తుంది: శ్రీ పీయూష్ గోయల్


డబ్ల్యూటీవో మార్గదర్శక సూత్రాల ప్రకారమే డబ్ల్యూటీవో ఎంసీ13 జరిగేలా భారత్‌ ప్రయత్నిస్తుంది: శ్రీ గోయల్

న్యాయమైన, దృఢమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు డబ్ల్యూటీవో కీలకం: శ్రీ గోయల్

'కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం'పై భారత్ దృష్టి పెడుతుంది, ఈయూతోనూ చర్చలు కొనసాగిస్తుంది: గోయల్

Posted On: 23 FEB 2024 4:15PM by PIB Hyderabad

వాణిజ్య చర్చల విషయంలో భారత ప్రభుత్వం తొందరపడదని కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. ఎందుకంటే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) అనేక సంవత్సరాలు దేశాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. చర్చల విషయంలో భారత్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, క్రమపద్ధతిని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. 'రైసినా డైలాగ్ 2024'లో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎఫ్‌టీఏలు న్యాయంగా, అందరికీ సమానంగా, సమతౌల్యంగా ఉండేలా చూసేందుకు ఎఫ్‌టీఏ చర్చల సమయంలో వాటాదార్లతో విస్తృత చర్చలు, అంతర్-మంత్రిత్వ సమావేశాలు వంటివి ఉంటాయన్నారు.

అబుదాబిలో వచ్చే వారం జరగనున్న డబ్ల్యూటీవో మంత్రుల సదస్సు-13 (ఎంసీ13) గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి, ప్రపంచ వాణిజ్యంలో భాగం కాని అంశాలను డబ్ల్యూటీవోలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, డబ్ల్యూటీవో మార్గదర్శక సూత్రాలు అమలయ్యేలా చూసేందుకు భారత్ ప్రయత్నిస్తుందని చెప్పారు. డబ్ల్యూటీవో ఎంసీల్లో గతంలో భారత్‌ పోషించిన పాత్రను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఉదహరించారు. అవసరమైన సంస్కరణలతో సంస్థను బలోపేతం చేయడానికి బలమైన మద్దతు అందిస్తామని చెప్పారు. న్యాయమైన, దృఢమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు డబ్ల్యూటీవో కీలకమని శ్రీ గోయల్ అన్నారు.

'కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం' (సీబీఏఎం) అంశంపై మాట్లాడిన శ్రీ గోయల్‌, యూరోపియన్ యూనియన్ (ఈయూ) పన్ను విధింపుపై భారతదేశం ఆందోళన చెందుతోందన్నారు. డబ్ల్యుటీలో నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరిస్తామని, ఈయూతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి చూస్తామని చెప్పారు. ప్రస్తుత సమస్యల గురించి భారత ప్రభుత్వానికి అవగాహన ఉందన్న వాణిజ్య మంత్రి, ఆ సవాళ్లను అవకాశంగా మార్చుకునేందుకు కృషి చేస్తామని వాటాదార్లకు హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ విలువ గొలుసులను ఆలంబనగా చేసుకుని స్వావలంబనగా మారడం ద్వారా భారత్‌ ప్రపంచంతో కలిసి ప్రయాణించడానికి, పోటీ పడడానికి సిద్ధంగా ఉందని శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. విశాలమైన మార్కెట్‌తో పాటు ఆవిష్కరణల సామర్థ్యం కలిసి భారత్‌ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారుస్తాయన్నారు. చివరి మైలులో ఉన్న లబ్ధిదార్లకు కూడా సంక్షేమ ఫలాలను చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ గోయల్ వివరించారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆహార భద్రత, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సంక్షేమాల కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని శ్రీ గోయల్‌ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం వంటి కార్యక్రమాల గురించి ప్రస్తావించిన కేంద్ర మంత్రి, అవి భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాయన్నారు.  మౌలిక సదుపాయాలు & తయారీ రంగంలో ప్రభుత్వ - ప్రైవేట్ పెట్టుబడులను ఈ కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నాయని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించడానికి ఇది సాయపడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

***



(Release ID: 2008739) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Hindi , Tamil