బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని 'సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్'కు చెందిన మొదటి మైలు అనుసంధాన ప్రాజెక్టులను రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 23 FEB 2024 11:36AM by PIB Hyderabad

ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వృద్ధి కొనసాగించడంలో భారత ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు కీలక ప్రాజెక్టులను రేపు ప్రారంభించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని 'సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్'కు (ఎస్‌ఈసీఎల్‌) చెందిన మూడు ప్రధాన 'మొదటి మైలు అనుసంధాన ప్రాజెక్టు'లను వర్చువల్‌ పద్ధతిలో శ్రీ మోదీ ప్రారంభిస్తారు. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థగా ఎస్‌ఈసీఎల్‌ పని చేస్తుంది. మొత్తం రూ.600 కోట్ల విలువైన ఈ మూడు ప్రాజెక్టులు బొగ్గును వేగంగా, పర్యావరణ అనుకూలంగా, సమర్థవంతంగా తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

ఎస్‌ఈసీఎల్‌ దీప్క ప్రాంతంలో ఉన్న దీప్క ఓసీపీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటును రూ.211 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. దీని వార్షిక బొగ్గు నిర్వహణ సామర్థ్యం 25 మిలియన్‌ టన్నులు. ఈ ప్రాజెక్టులో 20,000 టన్నుల బొగ్గును నిల్వ చేయవచ్చు. 2.1 కి.మీ. పొడవైన కన్వేయర్ బెల్ట్‌ కూడా ఉంది. దీని ద్వారా గంటకు 4,500-8,500 టన్నుల బొగ్గును వేగంగా లోడ్ చేయవచ్చు. తద్వారా, పిట్ నుంచి రైల్‌ స్టేషన్‌ వరకు రహదారి మార్గంలో బొగ్గు తరలింపు ఆగిపోతుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఇది పర్యావరణానికి ప్రయోజనమే గాక, రేక్ లోడింగ్ సమయాన్ని గంటకు పైగా తగ్గిస్తుంది, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఎస్‌ఈసీఎల్‌ రాయ్‌గఢ్ ప్రాంతంలోని ఛల్ ఓసీపీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటును రూ.173 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. ఏటా 6 మిలియన్‌ టన్నుల బొగ్గును ఇది నిర్వహించగలదు. బొగ్గు నిల్వ ప్రాంతం, 1.7. కి.మీ. పొడవైన కన్వేయర్ బెల్ట్, 3,000 టన్నుల సామర్థ్యమున్న సిలో ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.

ఎస్‌ఈసీఎల్‌ రాయ్‌గఢ్ ప్రాంతంలోని బరౌడ్ ఓసీపీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటును రూ.216 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గును ఇక్కడ నిర్వహించవచ్చు. 20,000 టన్నుల నిల్వ ప్రాంతం ఉంది. 1.7 కి.మీ. కన్వేయర్ బెల్ట్‌ను అమర్చారు. ఈ ప్రాజెక్టులోని  వేగవంతమైన లోడింగ్ వ్యవస్థ గంటకు 5000-7500 టన్నుల బొగ్గును లోడ్ చేయగలదు.

పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు బహుళ విధ రవాణాను అందిస్తాయి, దేశవ్యాప్తంగా బొగ్గు మౌలిక సదుపాయాలు నిర్మించే నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడం, బొగ్గు సరఫరాలో సమర్థత ద్వారా ఈ ప్రాజెక్టులు సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి.

పర్యావరణ సుస్థిరతకు అనుగుణంగా ఉండే ఈ మొదటి మైలు అనుసంధాన (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టు‌లు, రహదారి మార్గంలో బొగ్గు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. తద్వారా వాహన రద్దీ, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తగ్గుతాయి.

***


(Release ID: 2008425) Visitor Counter : 113