మంత్రిమండలి

అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంలో సవరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం సాకారం అయ్యేలా చూసేందుకు (ఎఫ్‌డిఐ) విధానంలో సవరణ

గుర్తించిన ఉప రంగాలు/ కార్యక్రమాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి

నూతన ఎఫ్‌డిఐ విధానం వల్ల దేశంలో సులభతర వ్యాపార నిర్వహణ సాధ్యమవుతుంది. విదేశీ పెట్టుబడులు, ఆదాయం పెరిగి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Posted On: 21 FEB 2024 10:23PM by PIB Hyderabad

అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంలో సవరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన  కేంద్ర  మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఉపగ్రహాల ఉప రంగాన్ని మూడు వేర్వేరు కార్యకలాపాలుగా విభజించి ప్రతి రంగంలో నిర్దిష్ట పరిమితితో  విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తారు. 

మెరుగైన ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా అంతరిక్ష రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని మరింత ఎక్కువ చేయడానికి దోహద పడే విధంగా  భారత అంతరిక్ష విధానం 2023 ను ప్రభుత్వం రూపొందించింది.     విస్తృతమైన, సమ్మిళిత విధానంగా  భారత అంతరిక్ష విధానం 2023 ను.అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.  అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించడమే ఈ విధానం లక్ష్యం. అంతరిక్షంలో అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కోణాన్ని  అభివృద్ధి చేయడం; సాంకేతిక అభివృద్ధి , అనుబంధ రంగాల ద్వారా అదనపు  ప్రయోజనాలను పొందడానికి అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సంబంధాలు, భాగస్వాముల మధ్య అంతరిక్ష అనువర్తనాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన  పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం లక్ష్యంగా భారత అంతరిక్ష విధానం 2023 రూపొందింది. 

ప్రస్తుత  ఎఫ్‌డిఐ   విధానం ప్రకారం ప్రభుత్వం అనుమతించిన మార్గాల ద్వారా  ఉపగ్రహాల స్థాపన, నిర్వహణలో  మాత్రమే విదేశీ పెట్టుబడులకు  అనుమతిస్తారు.  భారత అంతరిక్ష విధానం 2023 లో పొందుపరిచిన  దార్శనికత , వ్యూహానికి అనుగుణంగా కేంద్ర మంత్రివర్గం వివిధ ఉప రంగాలు / కార్యకలాపాలకు సరళీకృత  ఎఫ్‌డిఐ   పరిమితులను అనుమతించడం  ద్వారా అంతరిక్ష రంగంలో   ఎఫ్‌డిఐ  విధానాన్ని సులభతరం చేసింది.

 అంతరిక్ష రంగంలో   ఎఫ్‌డిఐ  విధానాన్ని రూపొందించడానికి ఇన్-స్పాస్, ఇస్రో, ఎన్ఎస్ఐఎల్ వంటి అంతర్గత భాగస్వాములతో పాటు పలువురు పారిశ్రామిక భాగస్వాములతో అంతరిక్ష శాఖ సంప్రదింపులు జరిపింది. ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల రంగాల్లో ఎన్జీఈలు సామర్థ్యాలను, నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాయి. పెరిగిన పెట్టుబడులతో  ఆధునిక ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉత్పత్తి  చేసి అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వాటాను ఎక్కువ చేయడానికి అవకాశం కలుగుతుంది. 

ప్రతిపాదిత సంస్కరణలు సరళీకృత ప్రవేశ మార్గాన్ని నిర్దేశించడం ద్వారా అంతరిక్ష రంగంలో  ఎఫ్‌డిఐ   విధాన నిబంధనలను సరళీకృతం చేస్తాయి. ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్, అనుబంధ వ్యవస్థలు లేదా ఉప వ్యవస్థలు, వ్యోమనౌకల ప్రయోగం,వ్యోమనౌకల నిర్మాణం  , అంతరిక్ష సంబంధిత విభాగాలు,వ్యవస్థల తయారీ రంగాలలో అనుమతించే  ఎఫ్‌డిఐ పరిమితిపై   స్పష్టతను అందిస్తాయి,

లాభాలు:
సవరించిన  ఎఫ్‌డిఐ    విధానం ప్రకారం అంతరిక్ష రంగంలో 100 శాతం  ఎఫ్‌డిఐ   లకు అనుమతి ఉంటుంది.  సవరించిన విధానం కింద సరళీకృత ప్రవేశ మార్గాలు అంతరిక్షంలో భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి సంభావ్య పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉన్నాయి.
సవరించిన విధానం కింద వివిధ కార్యకలాపాలకు ప్రవేశ మార్గం ఈ క్రింది విధంగా ఉంటుంది. 

ఎ. ఆటోమేటిక్ రూట్ కింద 74% వరకు: ఉపగ్రహాలు-తయారీ, ఆపరేషన్, శాటిలైట్ డేటా ఉత్పత్తులు  గ్రౌండ్ సెగ్మెంట్ , యూజర్ విభాగంలో ఆటోమేటిక్ రూట్ కింద 74% వరకు ఎఫ్‌డిఐ అనుమతిస్తారు.  74% కి మించి సాగే కార్యకలాపాలు  ప్రభుత్వ మార్గంలో జరుగుతాయి. 

బి. ఆటోమేటిక్ రూట్ కింద 49% వరకు: లాంచ్ వెహికల్ , దాని అనుబంధ వ్యవస్థలు   లేదా ఉప వ్యవస్థలు, వ్యోమ నౌకల ప్రయోగం , స్వీకరించడం కోసం అవసరమయ్యే విడి భాగాల అభివృద్ధిలో ఆటోమేటిక్ రూట్ కింద 49% వరకు ఎఫ్‌డిఐ అనుమతిస్తారు.49%  కి మించి సాగే కార్యకలాపాలు  ప్రభుత్వ మార్గంలో జరుగుతాయి 

 సి. ఆటోమేటిక్ రూట్ కింద 100% వరకు: ఉపగ్రహాలు, గ్రౌండ్ సెగ్మెంట్, యూజర్ సెగ్మెంట్ కొరకు భాగాలు, వ్యవస్థలు, ఉప వ్యవస్థల రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద 100% ఎఫ్‌డిఐ అనుమతిస్తారు. 

 పెరిగిన ప్రైవేటు రంగ భాగస్వామ్యం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల , ఈ రంగాన్ని స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  'మేకిన్ ఇండియా(ఎంఐఐ),'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాల కింద  కంపెనీలు తమ ఉత్పత్తి  కేంద్రాలను దేశంలో నెలకొల్పడానికి అవకాశం కలుగుతుంది. 

***



(Release ID: 2007917) Visitor Counter : 144