కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉపాధి గణాంకాలు: 2023 డిసెంబర్‌లో ఈపీఎఫ్‌వోలో చేరిన 15.62 లక్షల మంది నికర సభ్యులు


2023 డిసెంబర్‌లో ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకున్న 8.41 లక్షల మంది కొత్త సభ్యులు

Posted On: 20 FEB 2024 4:10PM by PIB Hyderabad

ఈపీఎఫ్‌వో తాత్కాలిక ఉపాధి గణాంకాల సమాచారం ఈ రోజు విడుదలైంది. 2023 డిసెంబర్‌లో, ఈపీఎఫ్‌వోలో నికరంగా 15.62 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈ సమాచారం వెల్లడిస్తోంది, గత మూడు నెలల్లో ఇది గరిష్టం. 2023 నవంబర్‌తో పోలిస్తే, డిసెంబర్‌లో నికర సభ్యుల జోడింపు 11.97% పెరిగింది.

2022 డిసెంబర్‌తో పోలిస్తే, నికర సభ్యుల చేరికల్లో, ఏడాది కాలంలో 4.62% వృద్ధి నమోదైంది. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ప్రజాబాహుళ్యంలోకి చేరుతున్న ఈపీఎఫ్‌వో కార్యక్రమాల ప్రభావం సహా వివిధ కారణాల వల్ల సభ్యత్వాలు పెరుగుతున్నాయి.

2023 డిసెంబర్‌లో దాదాపు 8.41 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌వోలో పేర్లు నమోదు చేసుకున్నారు, గత మూడు నెలల్లో ఇది గరిష్టం. 2023 నవంబర్‌తో పోలిస్తే, కొత్త సభ్యుల జోడింపులో 14.21% పెరుగుదల ఉంది. గమనించాల్సిన కీలక అంశం ఏంటంటే, డిసెంబర్‌లో నమోదైన మొత్తం కొత్త సభ్యుల్లో 57.18% మంది 18-25 మధ్య వయస్సు గలవాళ్లే, ఈ వర్గానిదే ఆధిపత్యం. వ్యవస్థీకృత శ్రామికశక్తిలోకి ఎక్కువ మంది యువత, ముఖ్యంగా తొలిసారి ఉద్యోగార్థులు వస్తున్న ధోరణిని ఇది ప్రతిబింబిస్తుంది.

దాదాపు 12.02 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌వో నుంచి నిష్క్రమించి, మళ్లీ చేరారని ఉపాధి గణాంకాల సమాచారం వెల్లడిస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా 12.61% పెరిగింది, గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం. తిరిగి చేరిన సభ్యులు ఉద్యోగాలు మారారు & ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే సంస్థల్లో తిరిగి చేరారు. ఈపీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోవడానికి బదులు ఖాతా బదిలీని ఎంచుకున్నారు. దీనివల్ల వారికి దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, సామాజిక భద్రత కొనసాగుతుంది.

డిసెంబర్‌లో చేరిన 8.41 లక్షల మంది కొత్త సభ్యుల్లో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. గత మూడు నెలల్లో ఈ సంఖ్య అత్యధికం, 2023 నవంబర్‌తో పోలిస్తే ఇది 7.57% వృద్ధి. అలాగే, డిసెంబర్‌ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 2.90 లక్షలకు చేరుకుంది. 2023 నవంబర్‌తో పోలిస్తే సుమారు 3.54% పెరిగింది. సమగ్రమైన & విభిన్నమైన శ్రామికశక్తి వైపు కొనసాగుతున్న మార్పును మహిళా సభ్యుల పెరుగుదల సూచిస్తుంది.

రాష్ట్రాల వారీగా ఉపాధి గణాంకాలను విశ్లేషిస్తే, 5 రాష్ట్రాలు/యూటీల నుంచి నికర సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. అవి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హరియాణా. మొత్తం నికర సభ్యుల్లో ఈ 5 రాష్ట్రాలు/యూటీల నుంచే దాదాపు 58.33% లేదా 9.11 లక్షల మంది చేరారు. డిసెంబర్‌ నెలలో 21.63% నికర సభ్యులతో మహారాష్ట్ర ముందంజలో ఉంది.

పరిశ్రమల వారీగా ఉపాధి గణాంకాలను విశ్లేషిస్తే, ఇనుము & ఉక్కు, భవనాలు & నిర్మాణాలు, సాధారణ బీమా వంటి పరిశ్రమల సిబ్బందిలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. మొత్తం నికర సభ్యత్వాల్లో దాదాపు 40.66% మంది సేవా రంగ నిపుణులు (మానవ వనరుల సరఫరాదార్లు, సాధారణ గుత్తేదార్లు, భద్రత సేవలు, ఇతర కార్యకలాపాలు వంటివి) ఉన్నారు.

ఉపాధి గణాంకాల నవీకరణ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి, దీనిని తాత్కాలిక సమాచారంగా పరిగణించాలి. ఈ సమాచారం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. 2017 సెప్టెంబర్‌ నుంచి ఉన్న సమాచారాన్ని 2018 ఏప్రిల్‌ నుంచి ఈపీఎఫ్‌వో విడుదల చేస్తోంది. ఈపీఎఫ్‌వోలో తొలిసారి చేరిన సభ్యులను, ఈపీఎఫ్‌వో నుంచి నిష్క్రమించి & మళ్లీ చేరిన సభ్యులను నికర నెలవారీ ఉపాధి గణాంకాల్లోకి ఈపీఎఫ్‌వో తీసుకుంటుంది.

***


(Release ID: 2007539)