అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

భారత అంతరిక్ష రంగంలో డిజిటల్ వేదికలో నమోదైన అంకుర సంస్థల సంఖ్య 189 - కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్

Posted On: 08 FEB 2024 2:33PM by PIB Hyderabad

రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక రూపంలో సమాధానం ఇచ్చిన కేంద్ర శాస్త్ర & సాంకేతికత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్, భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకున్నట్లు తెలిపారు:

  1. 'భారత అంతరిక్ష విధానం 2023'ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. భారతీయ అంతరిక్ష వ్యవస్థకు సహకరించే అందరు వాటాదార్ల పాత్రలు, బాధ్యతలను ఆ విధానంలో నిర్వచించారు.
  2. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, మద్దతు అందించడానికి వివిధ పథకాలను కూడా ఇన్-స్పేస్ ప్రకటించింది, అమలు చేస్తోంది. అవి మూలధన మద్దతు పథకం, ధరల మద్దతు విధానం, మార్గదర్శన మద్దతు, ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌ఆర్‌ఈలు) కోసం ప్రత్యేక ప్రయోగశాల, అంతరిక్ష రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఇస్రో ప్రయోగశాలల అందుబాటు, ఎన్‌ఆర్‌ఈలకు సాంకేతికత బదిలీ, వ్యాపార అవకాశాల కోసం జాతీయ & అంతర్జాతీయ పరిశ్రమలతో తరచూ సమావేశాలు.
  3. అంతరిక్ష రంగంలో అవసరమైన మద్దతు అందించడానికి ప్రభుత్వేతర సంస్థలతో ఇన్‌-స్పేస్‌ దాదాపు 51 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాల తయారీలో పరిశ్రమ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందాలు పెంచుతాయని భావిస్తున్నారు.
  4. డిజిటల్ వేదికలో నమోదైన మొత్తం అంకుర సంస్థల సంఖ్య 189.

ప్రస్తుతానికి, సుదూర అంతరిక్ష పరిశోధనలపై ఇస్రో ఎలాంటి ప్రణాళిక పెట్టుకోలేదు. అయితే, మానవ సహిత అంతరిక్షయాన కార్యక్రమం, చంద్రుడిపైకి, భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌కు తదుపరి మిషన్‌లు చేపట్టడం వంటి అధునాతన అంతరిక్ష అన్వేషణ మిషన్ల కోసం అధ్యయనాలు జరుగుతున్నాయి.

అంతరిక్ష రంగంలో దేశీయ తయారీ, ఆవిష్కరణ, స్వావలంబనను పెంచడానికి "భారత్‌లో తయారీ" చొరవ ఒక వ్యూహాత్మక విధానంగా ఉంది.

దేశీయ పరిశ్రమల గణనీయమైన సహకారం వల్ల, భారతీయ అంతరిక్ష కార్యక్రమం గత ఐదేళ్లలో అనేక కొత్త శిఖరాలను తాకింది. అన్ని విభాగాల అంతరిక్ష కార్యకలాపాల్లో స్వదేశీ సామర్థ్యాలను ప్రదర్శించింది. ఎల్‌వీఎం3 & పీఎస్‌ఎల్‌వీ వాణిజ్య ప్రయోగాలు, ఎస్‌ఎస్‌ఎల్‌వీ అభివృద్ధి, భూ పరిశీలన ఉపగ్రహాలు, నావిగేషన్ ఉపగ్రహం, చంద్రునిపై సాఫీగా దిగడం & తిరగడం, సూర్యుడిని అధ్యయనం చేసే మిషన్ (ఆదిత్య-ఎల్‌1), మానవ సహిత అంతరిక్ష విమాన ప్రదర్శనలో ప్రధాన పురోగతి వంటి కీలక విజయాలు సాధ్యమయ్యాయి.

భారత్‌లో తయారీ చొరవ వల్ల సాధ్యమైన కొన్ని ప్రధాన ముఖ్యాంశాలు ఇవి:

  1. అంతరిక్ష హార్డ్‌వేర్ దేశీయంగా తయారీ: క్లిష్టమైన సాంకేతికతలు, పారిశ్రామిక వ్యవస్థలను ఇస్త్రోలో, ఇన్‌-స్పేస్‌ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.
  2. అంతరిక్ష వ్యవస్థ, ఉపగ్రహాల తయారీ కేంద్రాలను భారతీయ ఎన్‌ఆర్‌ఈలు స్థాపిస్తున్నాయి.
  3. ప్రయోగ వాహనాల వ్యవస్థల రియలైజేషన్ కేంద్రాలను ఎన్‌ఆర్‌ఈలు ఏర్పాటు చేస్తున్నాయి.

<><><>


(Release ID: 2004295) Visitor Counter : 298


Read this release in: Hindi , English , Urdu , Tamil