ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2024 వ సంవత్సరం జనవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క 109 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 28 JAN 2024 11:46AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. 2024 సంవత్సరం లో ఇది మొదటి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం. అమృత కాలం లో ఒక క్రొత్త ఉత్సాహం తొణికిసలాడుతున్నది, ఒక క్రొత్త తరంగం ఎగస్తున్నది. రెండు రోజుల క్రితం మన దేశవాసులం అందరం 75వ గణతంత్ర దినా చాలా ఘనం గా జరుపుకొన్నాం. ఈ సంవత్సరం లో మన రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్నాయి. మరి సర్వోన్నత న్యాయస్థానాని కి కూడాను 75 సంవత్సరాలు అవుతున్నాయి. మన ప్రజాస్వామ్యం లోని ఈ పండుగ లు ప్రజాస్వామ్యాని కి జనని గా భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి. భారతదేశం రాజ్యాంగాన్ని చాలా తీవ్రమైన మేధామథనం అనంతరం రూపొందించడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగాన్ని సజీవ పత్రంఅని పిలుస్తారు. ఈ రాజ్యాంగం మూల ప్రతి లోని మూడో అధ్యాయం భారతదేశం పౌరుల ప్రాథమిక హక్కుల ను గురించి వివరిస్తుంది. మన రాజ్యాంగ శిల్పులు మూడో అధ్యాయం ప్రారంభం లో భగవాన్ శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణ స్వాముల చిత్రాల కు చోటు ను ఇవ్వడం చాలా ఆసక్తికరం గా ఉంది. రాముడి పాలన మన రాజ్యాంగ నిర్మాతల కు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండింది. అందుకే జనవరి 22వ తేదీ న అయోధ్య లో 'దైవం నుండి దేశం వరకుఅనే అంశాన్ని గురించి, 'రాముడి నుండి దేశం వరకుఅనే అంశాన్ని గురించి మాట్లాడాను.

 

 

సహచరులారా, అయోధ్య లో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్ల కొద్దీ దేశ ప్రజల ను కట్టిపడేసింది అనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయం లో దేశం లోని చాలా మంది ప్రజలు రామ భజనల ను పాడి, శ్రీరాముని చరణాల కు సమర్పించుకున్నారు. జనవరి 22వ తేదీ నాడు సాయంత్రం యావద్దేశం రామజ్యోతుల ను వెలిగించి, దీపావళి ని జరుపుకొంది. ఈ సమయం లో దేశం సామూహిక శక్తి ని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పాల కు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛత ప్రచారాన్ని నిర్వహించాలి అని దేశ ప్రజల కు నేను విజ్ఞ‌ప్తి చేశాను. లక్షల కొద్దీ ప్రజలు వారి ప్రాంతాల లో ధార్మిక స్థలాల ను భక్తి పూర్వకం గా శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాల ను, వీడియోల ను ఎంతో మంది నాకు పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకుపోతుంది.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ సారి జనవరి 26న జరిగిన కవాతు చాలా అద్భుతం గా సాగింది. అయితే కవాతు లో మహిళా శక్తి పాలుపంచుకోవడం ఎక్కువ గా చర్చనీయాంశం అయింది. కేంద్ర భద్రత బలగాల కు, ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన మహిళా సమూహాలు కర్తవ్య పథ్ లో కవాతు చేయడాన్ని ప్రారంభించినప్పుడు అందరూ గర్వం తో ఉప్పొంగిపోయారు. మహిళా బ్యాండ్ బృందం కవాతు ను చూసి, వారి అద్బుత సమన్వయాన్ని చూసి దేశ విదేశాల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈసారి కవాతు లో పాల్గొన్న 20 బృందాల లో 11 బృందాలు మహిళలవే. ఇందులో పాల్గొన్న శకటాలలో భాగస్వాములైన వారు కూడా మహిళా కళాకారులే. ఈ సందర్భం లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల లో సుమారు ఒకటిన్నర వేల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. చాలా మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరం, నాగ్ దా ల వంటి భారతీయ సంగీత వాయిద్యాల ను ఉపయోగించారు. డిఆర్ డిఒ ప్రదర్శించిన శకటం కూడా అందరి దృష్టి ని ఆకర్షించింది. నీరు, భూమి, ఆకాశం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్షం - ఇలా ప్రతి రంగం లో దేశాన్ని మహిళా శక్తి ఎలా రక్షిస్తుందో ఇందులో చూపించారు. మహిళల నేతృత్వం లో అభివృద్ధి మంత్రం తో 21వ శతాబ్దపు భారతదేశం ముందుకు సాగుతోంది.

 

 

సహచరులారా, మీరు కొన్ని రోజుల క్రితం అర్జున పురస్కారాల వేడుక ను తప్పక చూసి ఉంటారు. ఈ కార్యక్రమం లో దేశాని కి చెందిన పలువురు క్రీడాకారుల ను, క్రీడాకారిణులను రాష్ట్రపతి భవన్‌ లో సన్మానించడమైంది. ఇక్కడ కూడా అందరి దృష్టి ని ఆకర్షించింది అర్జున పురస్కారాలను స్వీకరించిన అమ్మాయిలు, వారి జీవిత ప్రయాణాలు. ఈ సారి 13 మంది మహిళా ఎథ్ లీట్ లను అర్జున పురస్కారం తో సత్కరించారు. ఈ మహిళా ఎథ్ లీట్ లు అనేక పెద్ద టోర్నమెంటుల లో పాల్గొని భారతదేశం యొక్క పతాకాన్ని ఎగురవేశారు. శారీరిక సవాళ్లు, ఆర్థిక సవాళ్లు ఈ సాహసోపేతమైన, ప్రతిభావంతులైన క్రీడాకారుల ముందు నిలబడలేకపోయాయి. పరివర్తన చెందుతున్న భారతదేశం లో మన అమ్మాయిలు, మహిళలు ప్రతి రంగం లో అద్భుతాల ను ఆవిష్కరిస్తున్నారు. మహిళ లు వారిదైనటువంటి ముద్ర ను వేసిన మరో రంగం స్వయం సహాయ సమూహాలు. ఇప్పుడు దేశం లో మహిళా స్వయం సహాయ సమూహాల సంఖ్య కూడా పెరిగింది. వాటి పని పరిధి కూడా చాలా విస్తరించింది. ప్రతి గ్రామం లోని పొలాల్లో డ్రోన్ ల ద్వారా వ్యవసాయం చేయడం లో సహాయం చేసే నమో డ్రోన్ సోదరీమణుల ను చూసే రోజు ఎంతో దూరం లో లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో బహ్ రాయిచ్‌ లో స్థానిక వస్తువుల ను ఉపయోగించి బయో ఫర్టిలైజర్ మరియు బయో పెస్టిసైడ్ లను మహిళ లు తయారు చేస్తున్నట్లు నాకు తెలిసింది. నిబియా బేగం పుర్ గ్రామం లో స్వయం సహాయ సమూహాల తో అనుబంధం కలిగి ఉన్న మహిళలు ఆవు పేడ, వేప ఆకులు, అనేక రకాల ఔషధ మొక్కలను కలపడం ద్వారా బయో ఫర్టిలైజర్ ను తయారు చేస్తారు. అదేవిధంగా ఈ మహిళలు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరపకాయలను పేస్ట్ చేసి, సేంద్రియ పురుగుమందు ను కూడా తయారు చేస్తారు. ఈ మహిళలంతా కలసి ఉన్నతి బయోలాజికల్ యూనిట్పేరు తో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. బయో ఉత్పత్తులను తయారు చేయడం లో మహిళల కు ఈ సంస్థ సహాయం చేస్తుంది. వారు తయారు చేసిన బయో ఫర్టిలైజర్ లు, బయో పెస్టిసైడ్ ల కు గిరాకీ కూడా నిరంతరం పెరుగుతోంది. అక్కడి కి సమీప గ్రామాలకు చెందిన ఆరు వేల మందికి పైగా రైతులు వారి వద్ద నుండి బయో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల స్వయం సహాయ సమూహాల తో అనుబంధం కలిగివున్న ఈ మహిళల కు ఆదాయం పెరిగింది. వారి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడింది.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, సమాజాన్ని, దేశాన్ని బలోపేతం చేయడానికి నిస్వార్థం గా పనిచేస్తున్న దేశవాసుల ప్రయత్నాలకు మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల లో మూడు రోజుల క్రితం దేశం ‘పద్మ’ అవార్డులను ప్రకటించినప్పుడు మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఇటువంటి వారి పై చర్చ జరగడం సహజం. ఈసారి కూడా అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజం లో పెనుమార్పులను తీసుకు రావడానికి కృషి చేసిన ఎంతో మంది దేశ వాసులకు పద్మ పురస్కారాలు లభించాయి. ఈ స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవన ప్రయాణాన్ని గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తం గా చాలా ఆసక్తి ఏర్పడింది. ప్రసార మాధ్యాల పతాక శీర్షికల కు దూరంగా, వార్తాపత్రికల మొదటి పేజీల కు దూరంగా, ఎటువంటి ప్రాముఖ్యం లేకుండా ఈ వ్యక్తులు సమాజానికి సేవ చేయడం లో తలమునుకలు గా ఉన్నారు. ఇంతకు ముందు ఇటువంటి వ్యక్తుల ను గురించి మనం చూడలేదు, వినలేదు. కానీ ఇప్పుడు పద్మ పురస్కారాల ప్రకటన తరువాత ఇటువంటి వారి ని గురించి న చర్చ ప్రతి చోటా జరగడం, వారి గురించి మరింత ఎక్కువ గా తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. ఈ పద్మ పురస్కారాలను అందుకొనే వారు చాలా మంది వారి వారి రంగాల లో చాలా ప్రత్యేకమైనటువంటి కృషి ని చేస్తున్నారు. ఉదాహరణ కు ఒకరు ఏంబ్యులన్స్ సేవ ను అందిస్తున్నారు. ఒకరు నిరుపేదల కు తల దాచుకొనేందుకు నీడ ను సమ కూర్చుతున్నారు. కొందరు కొన్ని వేల చెట్ల ను నాటుతూ ప్రకృతి పరిరక్షణ లో నిమగ్నం అయి ఉన్నారు. 650 కంటే ఎక్కువ రకాలైన వరి పరిరక్షణ కు కృషి చేసిన వారు కూడా ఉన్నారు. మాదకద్రవ్యాల వినియోగం మరియు మద్యపానం ల నివారణ కై సమాజం లో అవగాహన ను కల్పిస్తున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది వ్యక్తులు స్వయం సహాయ సమూహాల తో, ముఖ్యంగా నారీ శక్తి ప్రచారం తో ప్రజల ను అనుసంధానించడం లో నిమగ్నమై ఉన్నారు. ఈ సమ్మానాన్ని పొందిన వారిలో 30 మంది మహిళ లు ఉండడం పట్ల కూడా దేశ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళలు అట్టడుగు స్థాయి లో వారి కృషి ద్వారా సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకు పోతున్నారు.

 

 

సహచరులారా, పద్మ పురస్కార గ్రహీతల లో ప్రతి ఒక్కరి అంకిత భావం దేశ ప్రజల కు స్ఫూర్తిదాయకం. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, రంగస్థలం, భజన ల ప్రపంచం లో దేశాని కి కీర్తిప్రతిష్టల ను తీసుకొస్తున్న వారికి ఈసారి పెద్ద సంఖ్యలో ఈ గౌరవానికి పాత్రులు అయ్యారు. ప్రాకృతం, మాళవీ, లంబాడీ భాషల లో చాలా అద్భుతమైన కృషి ని చేసిన వారి కి కూడా ఈ గౌరవాన్ని ప్రకటించడమైంది. భారతీయ సంస్కృతి ని, వారసత్వాన్ని కొత్త శిఖరాల కు చేర్చిన పలువురు విదేశీ వాసులు సైతం పద్మ పురస్కారాల తో గౌరవించడమైంది. వీరిలో ఫ్రాన్స్, తైవాన్, మెక్సికో, బాంగ్లాదేశ్ ల కు చెందిన పౌరులు కూడా ఉన్నారు.

 

సహచరులారా, గత దశాబ్ద కాలం లో పద్మ పురస్కారాల విధానం పూర్తి గా మారిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అది ‘పీపుల్స్ పద్మ’ గా మారింది. పద్మ పురస్కారాల ను బహూకరించే విధానం లో కూడాను చాలా మార్పులే వచ్చాయి. ఇప్పుడు ప్రజలు వారిని వారు నామినేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. 2014వ సంవత్సరం తో పోలిస్తే ఈసారి 28 రెట్లు ఎక్కువ నామినేశన్ లు రావడానికి ఇదే కారణం. ‘పద్మ’ పురస్కారాల ప్రతిష్ఠ, విశ్వసనీయత, గౌరవం ప్రతి ఏటా పెరుగుతున్నాయి అని ఇది తెలియజేస్తున్నది. ‘పద్మ’ పురస్కారాల గౌరవానికి అర్హులైన వారందరికీ మరోసారి నా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ప్రతి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసమే జన్మించారు. ఇందుకోసం ప్రజలు వారి యొక్క విధుల ను పూర్తి భక్తి తో నిర్వహిస్తారు. కొంత మంది సమాజ సేవ ద్వారా, మరికొందరు సైన్యం లో చేరి, మరికొందరు తరువాతి తరానికి చదువు చెబుతూ వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుండడాన్ని మనం చూస్తున్నాం. అయితే సహచరులారా, జీవితం ముగిసిన తరువాత కూడా సామాజిక జీవనం పట్ల వారి యొక్క బాధ్యతల ను నిర్వర్తించే వారు మన మధ్య ఉన్నారు. దీనికి వారు ఎంచుకొన్న మాధ్యం అవయవ దానం. ఇటీవలి సంవత్సరాల్లో, మరణానంతరం అవయవాల ను దానం చేసిన వారు దేశం లో ఒక వేయి మంది కి పైగా ఉన్నారు. ఈ నిర్ణయం అంత సులభం కాదు. కానీ ఈ నిర్ణయం చాలా మంది ప్రాణాల ను కాపాడుతుంది. తమ ప్రియమైన వారి చివరి కోరికల ను గౌరవించిన కుటుంబాల ను కూడా నేను అభినందిస్తాను. దేశం లోని అనేక సంస్థలు కూడా ఈ దిశగా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయత్నాల ను చేస్తున్నాయి. కొన్ని సంస్థ లు అవయవ దానాన్ని గురించి ప్రజల కు అవగాహన ను కల్పిస్తున్నాయి. అవయవాల ను దానం చేయడానికి ఇష్టపడే వ్యక్తుల వివరాల ను నమోదు చేయడం లో కొన్ని సంస్థ లు సహాయం చేస్తున్నాయి. ఈ తరహా ప్రయాస ల వల్ల దేశం లో అవయవ దానం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఈ అవయవ దానం అనేది ప్రజల ప్రాణాల ను కాపాడుతోంది.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, రోగుల జీవితాన్ని సులభతరం చేసి, వారి సమస్యల ను తగ్గించే విషయం లో భారతదేశం సాధించిన విజయాన్ని ఇప్పుడు నేను మీ దృష్టి కి తీసుకు వస్తున్నాను. చికిత్స కోసం ఆయుర్వేదం, సిద్ధ లేదా యునాని వైద్య విధానాల నుండి సహాయాన్ని పొందే అనేక మంది వ్యక్తులు మీలో ఉంటారు. కానీ ఇటువంటి రోగులు అదే వైద్య విధానాన్ని అవలంబించే మరో వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు సమస్యల ను ఎదుర్కొంటారు. ఈ వైద్య విధానాల లో వ్యాధులు, వైద్యచికిత్స లు, మందుల పేరుల కు ఒకే భాష ను ఉపయోగించరు. ప్రతి వైద్యుడు తనదైన మార్గం లో వ్యాధి పేరు ను, వైద్య చికిత్స పద్ధతుల ను వ్రాస్తారు. దీనిని కొన్నిసార్లు ఇతర వైద్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. దశాబ్దాలు గా కొనసాగుతున్న ఈ సమస్య కు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయం తో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్య విధానాల కు సంబంధించినటువంటి డేటా ను, పదజాలాన్ని వర్గీకరించింది అసే సంగతి ని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రెండు విధాలైన కృషి వల్ల ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్య విధానాల లో వ్యాధి, వైద్యచికిత్స కు సంబంధించిన పదజాలాన్ని కోడింగ్ చేశారు. ఈ కోడింగ్ సహాయం తో ఇప్పుడు వైద్యులు అందరు వారిమందుల చీటీల ను లేదా స్లిప్పులపై ఒకే భాష ను వ్రాస్తారు. ఇందులో ఉన్న ఒక ప్రయోజనం ఏమిటి అంటే అది మీరు ఆ చీటీ తో మరొక వైద్యుడి వద్దకు వెళితే, ఆ చీటీ నుండే వైద్యుని కి దానిని గురించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఆ చీటీ మీ అనారోగ్యం, మీరు తీసుకున్న వైద్య చికిత్స, మీరు ఏయే మందుల ను వేసుకొంటున్నారు, వైద్యచికిత్స ఎంతకాలంగా కొనసాగుతోంది, ఏ యే పదార్థాలు మీ ఒంటి కి సరిపడవు అలెర్జీ మొదలైన విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. దీనివల్ల పరిశోధకులకు కూడా మరో ప్రయోజనం కలుగుతుంది. ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా వ్యాధి, మందులు , వాటి ప్రభావాల ను గురించిన పూర్తి సమాచారాన్ని పొందుతారు. పరిశోధన లు పెరిగి అనేక మంది శాస్త్రవేత్త లు ఒకచోటు లో చేరితే, ఈ వైద్య విధానాలు మెరుగైన ఫలితాల ను ఇస్తాయి. వాటి పట్ల ప్రజల మొగ్గు పెరుగుతుంది. ఈ ఆయుష్ విధానాల తో అనుబంధం ఉన్న మన వైద్యులు వీలైనంత త్వరగా ఈ కోడింగు ను స్వీకరిస్తారన్న విశ్వాసం నాలో ఉంది.

 

 

నా సహచరులారా, నేను ఆయుష్ వైద్య విధానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యానుంగ్ జామోహ్ లేగో గారి యొక్క చిత్రం నా కళ్ల ముందు కదలాడుతోంది. యానుంగ్ గారు అరుణాచల్ ప్రదేశ్ నివాసి. మూలికా ఔషధ నిపుణురాలు ఆమె. ఆదివాసుల సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆమె ఎంతగానో పాటుపడ్డారు. ఈ కృషి కి గాను ఈసారి ఆమె కు ‘పద్మ’ అవార్డు సమ్మానాన్ని కూడా ఇవ్వడమైంది. అదేవిధంగా ఈసారి ఛత్తీస్‌ గఢ్‌ కు చెందిన శ్రీ హేమ్‌చంద్ మాంఝీ కూడా ‘పద్మ’ పురస్కారాన్ని పొందారు. వైద్యరాజ్ శ్రీ హేమ్‌చంద్ మాంఝీ ఆయుష్ వైద్య విధానం సహాయం తో ప్రజలకు వైద్యచికిత్స లు చేస్తారు. ఛత్తీస్‌ గఢ్‌ లోని నారాయణ్ పుర్‌ లో పేద రోగుల కు సేవల ను 5 దశాబ్దాలకు పైగా అందిస్తూ వస్తున్నారు. మన దేశం లో నిక్షిప్తమైన ఆయుర్వేదం, మూలికా ఔషధాల నిధి ని కాపాడడం లో యానుంగ్ మరియు హేమ్‌చంద్ గారు ల వంటి వారి ది ప్రధానమైన పాత్ర.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా మన మధ్య ఉన్న సంబంధానికి దశాబ్ద కాలం పూర్తి అయింది. సామాజిక మాధ్యాలు, ఇంటర్ నెట్ యుగం లోనూ దేశాన్ని అనుసంధానించేందుకు శక్తివంతమైన మాధ్యం గా రేడియో ఉంది. రేడియో శక్తి ఎంత టి పరివర్తన ను తీసుకు వస్తుందో చెప్పడానికి ఒక ప్రత్యేక ఉదాహరణ ఛత్తీస్‌ గఢ్‌ లో కనిపిస్తుంది. జనాదరణ పొందిన ఒక కార్యక్రమం గత 7 సంవత్సరాలు గా ఇక్కడ రేడియో లో ప్రసారమవుతోంది. దాని పేరు ‘హమర్ హాథీ - హమర్ గోఠ్’. ఈ పేరు వినగానే రేడియో కు, ఏనుగు కు మధ్య సంబంధం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది రేడియో ప్రత్యేకత. ఈ కార్యక్రమం ఛత్తీస్‌ గఢ్‌ లోని నాలుగు ఆకాశవాణి కేంద్రాలు- అంబికాపుర్, రాయ్‌ పుర్, బిలాస్‌ పుర్, రాయ్‌ గఢ్ ల నుండి ప్రతి రోజు సాయంత్రం పూట ప్రసారం అవుతుంది. ఛత్తీస్‌ గఢ్, దాని చుట్టుపక్కల అడవుల లో నివసించే ప్రజలు ఈ కార్యక్రమాన్ని చాలా ఆసక్తి గా వింటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏనుగుల గుంపు అడవి లోని ఏ ప్రాంతం గుండా వెళుతుందో హమర్ హాథీ - హమర్ గోఠ్కార్యక్రమం లో చెబుతారు. ఈ సమాచారం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏనుగుల గుంపు వచ్చినట్లు రేడియో ద్వారా సమాచారం అందిన వెంటనే ప్రజలు అప్రమత్తం అవుతారు. ఏనుగులు సంచరించే మార్గం లోకి వెళ్లే ప్రమాదం ఇలా తప్పుతోంది. ఒక వైపు ఇది ఏనుగుల గుంపుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మరోవైపు ఇది ఏనుగుల గురించి డేటా ను సేకరించడం లో సహాయపడుతుంది. ఈ డేటా వినియోగం భవిష్యత్తు లో ఏనుగుల సంరక్షణ కు కూడా సహాయ పడుతుంది. ఇక్కడ ఏనుగుల కు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యాల ద్వారా కూడా ప్రజల కు చేరవేస్తున్నారు. అటవీ పరిసరాల లో నివసించే ప్రజలకు ఏనుగుల బెడద ను తట్టుకోవడం దీనితో సులువు గా మారిపోయింది. ఛత్తీస్‌ గఢ్ చేపట్టిన ఈ అసాధారణమైన చొరవ ను మరియు ఈ అనుభవాల తాలూకు ప్రయోజనాల ను దేశంలోని ఇతర అటవీ ప్రాంతాల లో నివసించే ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ జనవరి 25వ తేదీ న మనమందరం వోటరుల జాతీయ దినాన్ని జరుపుకొన్నాం. మన ఉజ్వల ప్రజాస్వామ్య సంప్రదాయాల కు ఇది ముఖ్యమైన రోజు. ప్రస్తుతం దేశం లో దాదాపు గా 96 కోట్ల మంది వోటర్ లు ఉన్నారు. ఈ సంఖ్య ఎంత పెద్దదో మీకు తెలుసా? ఇది అమెరికా యొక్క మొత్తం జనాభా కంటే కూడా సుమారు గా మూడు రెట్లు ఉంది. ఇది మొత్తం ఐరోపా జనాభా కంటే ఒకటిన్నర రెట్లు. ప్రస్తుతం దేశంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య దాదాపు పదిన్నర లక్షల కు చేరింది. భారతదేశం లోని ప్రతి పౌరుడు ప్రజాస్వామిక హక్కు ను వినియోగించుకునేలా చేయడానికి, మన ఎన్నికల సంఘం ఒక్క వోటరు ఉన్న ప్రదేశాల లో కూడాను పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేస్తోంది. దేశం లో ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఎన్నికల సంఘాన్ని నేను అభినందిస్తున్నాను.

 

 

సహచరులారా, ప్రస్తుతం ప్రపంచం లోని అనేక దేశాలలో వోటింగ్ శాతం తగ్గుతుండగా, భారతదేశం లో వోటింగ్ శాతం పెరగడం దేశాని కి ఉత్సాహాన్ని కలిగించేటటువంటి విషయం. 1951-52 లో దేశం లో తొలిసారి గా ఎన్నికలు జరిగినప్పుడు 45 శాతం మంది వోటర్ లు మాత్రమే వోటు హక్కు ను వినియోగించుకొన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశం లో వోటర్ ల సంఖ్య పెరగడమే కాకుండా వోటింగ్ శాతం కూడా పెరిగింది. మన యువ వోటర్ ల నమోదు కు మరిన్ని అవకాశాలు లభించేలా చట్టం లో మార్పుల ను ప్రభుత్వం చేసింది. వోటర్ లలో అవగాహన ను పెంచడం కోసం సమాజం స్థాయి లో అనేక ప్రయత్నాలు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వోటు వేయవలసిందంటూ కొన్ని ప్రాంతాల లో ఇల్లిల్లూ తిరుగుతూ వోటర్ లకు చెప్పడం జరుగుతోంది. కొన్నిచోట్ల పెయింటింగ్స్‌ ను వేస్తూ, మరికొన్ని చోట్ల వీధినాటకాల ద్వారా యువత ను ఆకర్షించడం జరుగుతున్నది. ఇటువంటి ప్రతి ప్రయత్నం మన ప్రజాస్వామ్య వేడుకల కు రక రకాలైనటువంటి వర్ణాల ను అందిస్తోంది. మొదటి సారి వోటర్ లుగా నమోదు అయ్యే అర్హత ను పొందిన యువతీయువకులు వోటర్ జాబితా లో వారి పేరుల ను తప్పకుండా చేర్చుకోవాలి అని మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం మాధ్యం ద్వారా సూచిస్తున్నాను. నేశనల్ వోటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా, వోటర్ హెల్ప్‌ లైన్ ఏప్ ద్వారా ఆన్‌లైన్‌ లో ఈ ప్రక్రియ ను సులభం గా పూర్తి చేయవచ్చును. మీరు వేసే వోటు దేశ సౌభాగ్యాన్ని మార్చగలదని, దేశ భవితవ్యాన్ని రూపొందించగలదని మీరు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, వివిధ కాలాల్లో దేశభక్తి కి ఉదాహరణగా నిలచిన భారతదేశాని కి చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి ఈ రోజు. పంజాబ్ కేసరి లాలా లాజ్ పతి రాయ్ జీ కి నేడు దేశం శ్రద్ధాంజలి ని ఘటిస్తోంది. లాలా జీ స్వాతంత్ర్య పోరాట యోధుడు. పరాయి పాలన నుండి మనలను విముక్తి చేయడానికి ఆయన తన జీవనాన్ని త్యాగం చేశారు. లాలా జీ ఒక్క స్వాతంత్ర్య పోరాటాని కే పరిమితం కాదు. ఆయన చాలా దూరదృష్టి గల వారు. పంజాబ్ నేశనల్ బ్యాంకు, ఇంకా అనేక ఇతర సంస్థల ఏర్పాటు లో ఆయన ముఖ్యమైన పాత్ర ను పోషించారు. విదేశీయుల ను దేశం నుండి బహిష్కరించడం ఒక్టే ఆయన లక్ష్యం కాదు. దేశాని కి ఆర్థిక దృఢత్వాన్ని అందించాలనే దృష్టికోణం కూడా ఆయన ఆలోచనల లో భాగం. ఆయన ఆలోచన లు, త్యాగం భగత్ సింహ్ ను బాగా ప్రభావితం చేశాయి. ఈరోజు న ఫీల్డ్ మార్శల్ కె.ఎం. కరియప్ప గారికి భక్తి తో శ్రద్దాంజలి ని సమర్పించే రోజు కూడా. చరిత్ర లో ముఖ్యమైన కాలంలో మన సైన్యాన్ని నడిపించడం ద్వారా ధైర్య సాహసాల కు ఉదాహరణ గా ఫీల్డ్ మార్శల్ కె.ఎం. కరియప్ప నిలచారు. మన సైన్యాన్ని పటిష్టం చేయడం లో ఆయన ది కీలక భూమిక.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, నేడు భారతదేశం క్రీడా ప్రపంచం లో ప్రతి రోజు కొత్త శిఖరాల ను అందుకొంటోంది. క్రీడా జగతి లో పురోగమించేందుకు క్రీడాకారులు వీలైనన్ని ఎక్కువ అవకాశాల ను పొందడం, దేశం లో ఉత్తమస్థాయి క్రీడా పోటీల నిర్వహణ జరగడం చాలా ముఖ్యం. ఈ ఆలోచన తో నేడు భారతదేశం లో క్రొత్త గా టోర్నమెంట్ లను నిర్వహించడం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం చెన్నై లో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు మొదలయ్యాయి. దేశం లోని 5 వేల మందికి పైగా క్రీడాకారులు ఈ క్రీడోత్సవాల లో పాల్గొంటున్నారు. భారతదేశం లో ఇటువంటి కొత్త వేదిక లు నిరంతరం ఏర్పాటవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వీటిలో క్రీడాకారులు వారి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని పొందుతున్నారు. అటువంటి ఒక వేదికే బీచ్ గేమ్స్ కు సంబంధించింది. వీటి ని దీవ్ లో నిర్వహించడమైంది. సోమనాథ్‌ కు సమీపంలో ఉండే దీవ్ కేంద్రపాలిత ప్రాంతమని మీకు తెలుసు. రోడ్డు సమీపం లో ఉంది. ఈ ఏడాది ప్రారంభం లోనే దీవ్ లో ఈ బీచ్ గేమ్స్ ను నిర్వహించారు. ఇవి భారతదేశంలో మొట్టమొదటి మల్టీ-స్పోర్ట్స్ బీచ్ క్రీడలు. వీటిలో టగ్ ఆఫ్ వార్, సీ స్విమ్మింగ్, పెన్కాక్సిలత్, మల్ల ఖంబ్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సాకర్ , బీచ్ బాక్సింగ్ వంటి పోటీలు ఉన్నాయి. ఇందులో ప్రతి క్రీడాకారుడు ప్రతిభ ను ప్రదర్శించడానికి అవకాశాన్ని పొందారు. ఈ టోర్నమెంటు లో చాలా మంది క్రీడాకారులు సముద్రం తో సంబంధం లేని రాష్ట్రాల నుండి వచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ టోర్నమెంటు లో సముద్ర తీరం లేని మధ్య ప్రదేశ్ అత్యధిక పతకాల ను సాధించింది. క్రీడల పట్ల ఉన్న ఈ ఉత్సాహమే ఏ దేశాన్నైనా క్రీడా ప్రపంచం లో రారాజు గా నిలుపుతుంది.

 

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈసారి మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం విశేషాలు ఇంతే. ఫిబ్రవరి లో మళ్ళీ మీతో మాట్లాడుతాను. దేశం లోని ప్రజల సామూహిక, వ్యక్తిగత ప్రయాస ల ద్వారా దేశం ఎలా పురోగమిస్తుంది అనే దానిపై దృష్టి ఉంటుంది. సహచరులారా, రేపు 29వ తేదీ ఉదయం 11 గంటల కు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది పరీక్ష పే చర్చ’ 7వ ఎడిశన్ అవుతుంది. నేను ఎప్పుడూ ఎదురుచూసే కార్యక్రమం ఇది. విద్యార్థులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ కార్యక్రమం. వారిలో పరీక్షల సంబంధి ఒత్తిడి ని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తాను. చదువు, పరీక్షలకు సంబంధించిన వివిధ సమస్యలపై సంభాషించడానికి ఒక వేదిక గా ‘పరీక్ష పే చర్చ’ గత 7 సంవత్సరాలుగా రూపుదిద్దుకొంది. ఈసారి రెండు కోట్ల ఇరవైఅయిదు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకోవడంతో పాటు తమ ఇన్‌పుట్‌లను కూడా అందించడం సంతోషంగా ఉంది. మొదట 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఈ సంఖ్య 22,000 మాత్రమే. విద్యార్థులను ప్రేరేపించడానికి, పరీక్ష ఒత్తిడి గురించి అవగాహన కల్పించడానికి అనేక వినూత్న ప్రయత్నాలు కూడా జరిగాయి. మీ అందరూ, ముఖ్యంగా యువత, విద్యార్థులు రేపటి కార్యక్రమం లో రికార్డు సంఖ్య లో కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని నేను కోరుతున్నాను. మీతో మాట్లాడడం నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాటల తో మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాజా భాగం లో మీ వద్ద నుండి నేను సెలవు తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ కలుద్దాం. మీకు ధన్యవాదాలు.

 

 

***


(Release ID: 2000298) Visitor Counter : 166