పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌ను కలిసిన పిఎన్జీఆర్బీ చైర్‌పర్సన్
దేశ ఇంధన వినియోగంలో సహజవాయువు వాటాను 15%కి పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను గవర్నర్ కు వివరించిన పిఎన్జీఆర్బీ చైర్‌పర్సన్
Posted On:
21 JAN 2024 11:02AM by PIB Hyderabad
కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ ,పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వరీలాల్ పురోహిత్‌ను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (పిఎన్జీఆర్బీ) చైర్‌పర్సన్ డాక్టర్ అనిల్ కుమార్ జైన్ 2024 జనవరి 19న చండీగఢ్‌లో కలిశారు.
చండీగఢ్‌లో చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాల పురోగతి , భారతదేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 15%కి పెంచాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకు రావడానికి పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి చేపడుతున్న పనుల గురించి చైర్‌పర్సన్ గవర్నర్‌కు వివరించారు. పంజాబ్‌లో సహజవాయువు వినియోగాన్ని ప్రోత్సహించడంలో సాధించిన పురోగతిని కూడా ఆయన గవర్నర్‌కు వివరించారు. సహజవాయువు వినియోగం వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు, వంట కోసం పైపుల ద్వారా సరఫరా అవుతున్న సహజ వాయువు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు రవాణా రంగంలో సిఎన్జీ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.
పారిశ్రామిక ,వాణిజ్య యూనిట్లలో కాలుష్యం కలిగించే ఘన, ద్రవ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సహజ వాయువు వినియోగం, భూమి పునరుద్ధరణ , సిఎన్జీ పై వ్యాట్ మొదలైన ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. కేంద్రపాలిత ప్రాంతం పరిపాలనా యంత్రాంగం సహకారంతో "హర్‌ఘర్ పిఎన్జీ "ని అమలు చేయడానికి 2025 మార్చి నాటికి అవసరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ అనిల్ జైన్ తెలిపారు. దీనివల్ల చండీగఢ్ పరిశుభ్ర, హరిత నగరంగా గుర్తింపు పొందుతుంది.
పిఎన్జీఆర్బీ అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ చండీగఢ్ లో సహజ వాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాధ్యమైన అన్ని సహాయానికి హామీ ఇచ్చారు.
సమావేశంలో తర్వాత హోం శాఖ కార్యదర్శి , అడ్మినిస్ట్రేటర్ సలహాదారు, చండీగఢ్ కమిషనర్ శ్రీ నితిన్ కుమార్ యాదవ్‌ను డాక్టర్ అనిల్ కుమార్ జైన్ కలిశారు. ఈ సమావేశంలో సహజవాయువు వినియోగాన్ని ప్రోత్సహించడం,గృహ, రవాణా, పారిశ్రామిక వాణిజ్య యూనిట్లలో సహజవాయువు వినియోగం పెరగడం వంటి అంశాలపై చర్చించారు. లక్ష్య సాధనకు పూర్తి సహకారం అందిస్తామని డాక్టర్ అనిల్ కుమార్ జైన్ కు శ్రీ నితిన్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఉన్నత స్థాయి చర్చల వల్ల చండీగఢ్ లో సహజ వాయువు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
సహజవాయువు వినియోగం కోసం సిజిడి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300 ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలలో దేశ జనాభాలో 98% ,భౌగోళిక ప్రాంతంలో 88% ప్రాంతం ఉంది. 2032 నాటికి దేశంలో 12.5 కోట్ల పీఎన్జీ కనెక్షన్లను అందించాలని, 17,751సిఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసి 5,42,224 అంగుళాల-కిమీ పైప్‌లైన్ వేయాలని పిఎన్జీఆర్బీ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నవంబర్ 30 నాటికి, దేశవ్యాప్తంగా 1.2 కోట్ల పీఎన్జీ అందించారు. 6,159 సిఎన్జీ స్టేషన్లు పనిచేస్తున్నాయి.
***
(Release ID: 1998442)
Visitor Counter : 140