సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
న్యూదిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ప్రధాన వస్త్ర దుకాణంలో ‘ఖాదీ సనాతన్ వస్త్ర’ అమ్మకాలు ప్రారంభించిన కేవీఐసీ
'రామోత్సవ్' సందర్భంగా, జనవరి 17-22 తేదీల్లో 'సనాతన్ వస్త్ర'పై 20% వరకు ప్రత్యేక తగ్గింపు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జనవరి 17-25 తేదీల్లో ఖాదీ ఉత్పత్తులపై 10% నుంచి 60% వరకు ప్రత్యేక తగ్గింపు
Posted On:
17 JAN 2024 8:48PM by PIB Hyderabad
'సనాతన్ ఖాదీ వస్త్ర'లో కొత్త ఉత్పత్తులను 'ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్' (కేవీఐసీ) బుధవారం ఆవిష్కరించింది, 20% తగ్గింపుతో ఈ వస్త్రాలను విక్రయిస్తోంది. దిల్లీ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రధాన దుకాణం ఖాదీ భవన్‌లో, ఖాదీతో నేసిన 'సనాతన్ వస్త్ర'ను కేవీఐసీ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ఆవిష్కరించారు. నిఫ్ట్‌లోని 'ఖాదీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో (సీవోఈకే) సనాతన్ దుస్తులకు రూపకల్పన చేశారు. కొత్త ఉత్పత్తుల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన కేవీఐసీ చైర్మన్ శ్రీ కుమార్, ఖాదీ తయారీలో ఎలాంటి యాంత్రిక లేదా రసాయన ప్రక్రియలు ఉండవని, భారతీయ సంప్రదాయం ప్రకారం తయారు చేసిన సనాతన్ వస్త్రాలు చాలా ప్రత్యేకమైనవని చెప్పారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు సనాతన్ వస్త్రాలపై 20% వరకు తగ్గింపును, ఖాదీ & గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులపై 10% నుంచి 60% వరకు ప్రత్యేక తగ్గింపును న్యూదిల్లీలోని ఖాదీ భవన్ అందిస్తుందని ప్రకటించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త & రూపాంతరం చెందిన ఖాదీని దేశ ప్రజలు చూస్తున్నారని శ్రీ కుమార్ చెప్పారు. ఖాదీని 'ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్, ఖాదీ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్' అని ప్రధాని నిర్వచించారని అన్నారు. ఆ మాటల ఆధారంగా, ఆధునిక కాల అవసరాలకు తగ్గట్లుగా ఖాదీ వస్త్రాలు తయారు చేశామని, గత వైభవ చరిత్ర నుంచి వర్తమానానికి అందిన బహుమతి ఇది అని వివరించారు. సనాతన్ వస్త్ర శ్రేణితో యువతను స్వదేశీ నినాదంతో అనుసంధానించడం ద్వారా, గ్రామీణ భారతదేశంలోని లక్షలాది మంది ఖాదీ కళాకారుల జీవితాలను మెరుగుపరచాలని కేవీఐసీ కోరుకుంటోందని శ్రీ కుమార్ చెప్పారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక ఘట్టమైన స్వదేశీ ఉద్యమంలో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత శక్తిమంతమైన పోరాట ఆయుధంగా ఖాదీని మహాత్మాగాంధీ తయారు చేశారని శ్రీ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు, ఖాదీకి గత వైభవాన్ని పునరుద్ధరించే బాధ్యతను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్నారని చెప్పారు. గత 9 ఏళ్లలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల వ్యాపారం రూ.1.34 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. ఖాదీ వస్త్రాల ఉత్పత్తి విలువ రూ.880 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు, ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు రూ.1170 కోట్ల నుంచి రూ.6000 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఖాదీ మహోత్సవ్ సందర్భంగా, దిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని ప్రధాన ఖాదీ భాండార్‌లో ఒక్క రోజులో రూ.1.5 కోట్ల విక్రయాలు జరిగాయని, నెల రోజుల్లో రూ.25 కోట్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. దిల్లీలోని ఐఐటీఎఫ్‌లో 14 రోజుల్లో రూ.15 కోట్ల విలువైన ఖాదీ ఉత్పత్తులు అమ్ముడయ్యాయని, ఇది ఒక రికార్డ్ అని శ్రీ కుమార్ వెల్లడించారు.
***
(Release ID: 1997160)
Visitor Counter : 105