వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రైతులు, ప్రజల విశ్వాసాన్ని భారత ఆహార సంస్థ చూరగొనాలి..కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
బియ్యం, గోధుమల ధరల నియంత్రణకు బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం సహకరించింది.. శ్రీ గోయల్
భారత ఆహార సంస్థ 60 వ వ్యవస్థాపక దినోత్సవం లో పాల్గొన్న శ్రీ పీయూష్ గోయల్
Posted On:
14 JAN 2024 2:51PM by PIB Hyderabad
రైతులు, ప్రజల విశ్వాసాన్ని భారత ఆహార సంస్థ చూరగొనాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈరోజు జరిగిన భారత ఆహార సంస్థ 60 వ వ్యవస్థాపక దినోత్సవం లో శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) వంటి ప్రతిష్టాత్మక పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న భారత ఆహార సంస్థ దేశంలో ప్రతి మూలలో ఉన్న లబ్ధిదారులకు రేషన్ అందించడానికి కృషి చేస్తోందని శ్రీ గోయల్ అన్నారు. అయితే రేషన్ పంపిణీ చేయడమే కాకుండా పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం తీసుకురావడం ద్వారా రైతులు, లబ్ధిదారుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
భారతదేశాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపిన శ్రీ గోయల్ వికసిత భారత్ ద్వారా ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, యువకులు, భారత ఆహార సంస్థ సిబ్బంది పారదర్శకంగా పని చేసి మార్గదర్శకులుగా ఉండాలని పిలుపునిచ్చారు.
డిజిటలైజేషన్, సాంకేతికతను అమలు చేసి నాణ్యతకు భారత ఆహార సంస్థ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని సి గోయల్ సూచించారు. తనిఖీ, సేకరణ, రవాణా, పంపిణీ, నిల్వ వంటి రంగాల్లో నాణ్యత సాధించవచ్చని చెప్పారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించుకోవడం, , యాంత్రిక లోడింగ్/అన్లోడింగ్, నిల్వ సామర్థ్యం పెంపొందించుకోవడం ద్వారా నిర్వహణ వ్యయాలు తగ్గించు కోవడానికి చర్యలు అమలు చేయాలని మంత్రి సూచించారు.
ఎఫ్ సీఐ అమలు చేస్తున్న ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) వల్ల గోధుమలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం కలిగిందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఉల్లి, టమోటా ధరల నియంత్రణ, భారత్ అట్టా, భారత్ దాల్ వంటి చర్యలు ధరలు అదుపు చేయడానికి అవకాశం కల్పించాయని శ్రీ గోయల్ తెలిపారు.
రైతుల ఉత్పత్తులకు న్యాయమైన విలువ అందించడానికి భారత ఆహార సంస్థ అమలు చేస్తున్న చర్యల వల్ల ఏ రైతు కూడా తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవడం లేదని శ్రీ గోయల్ చెప్పారు. రైతులతో సంబంధాల బలోపేతానికి కార్పొరేషన్ సమష్టిగా కృషి చేయాలన్నారు. డిజిటలైజేషన్ ను అవలంబించడం, సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అత్యాధునిక ప్రయోగశాలలు, పరికరాలు ఏర్పాటు చేయడం, ఆహార ధాన్యాల సేకరణ క్రమబద్ధీకరించడం, మెరుగైన నిల్వ కోసం స్టీల్ ప్లాంట్ల నిర్మాణం, మెరుగైన పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను భారత ఆహార సంస్థ ప్రణాళిక రూపొందించిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రులు శ్రీ సాధ్వి నిరంజన్ జ్యోతి, శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా, భారత ఆహార సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశోక్ కెకె మీనా, ఇతర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
***
(Release ID: 1996112)
Visitor Counter : 239