పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్‌లో 2024 జనవరి 15న పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికైన ప్రతినిధులు-యంత్రాంగానికి నాయకత్వ/నిర్వహణాభివృద్ధి కార్యక్రమం
పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ చేతులమీదుగా ప్రారంభం;
కార్యక్రమ నిర్వహణ కోసం పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ-అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు;
క్షేత్రస్థాయిలో నాయకత్వం/నిర్వహణ సామర్థ్య వికాసం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహణ
Posted On:
12 JAN 2024 5:41PM by PIB Hyderabad
గుజరాత్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్ (ఐఐఎంఎ) ప్రాంగణంలో పంచాయతీ రాజ్ సంస్థల (పిఆర్ఐ) ఎన్నికైన ప్రతినిధులు, యంత్రాంగం కోసం 2024 జనవరి 15న నాయకత్వ/నిర్వహణాభివృద్ధి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఒపిఆర్) తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా తొలుత కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ‘ఎంఒపిఆర్-ఐఐఎం-ఎ’ మధ్య అవగాహన ఒప్పందాన్ని (ఎంఒయు) మార్పిడి చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో నాయకత్వ/నిర్వహణ సామర్థ్య వికాసం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
గుజరాత్ రాష్ట్ర పంచాయతీరాజ్-గ్రామీణ గృహనిర్మాణ-గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి మోనా ఖాంధర్, ‘ఐఐఎం-ఎ’ డైరెక్టర్ ప్రొఫెసర్ భరత్ భాస్కర్, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వికాస్ ఆనంద్, అదేశాఖ డైరెక్టర్ శ్రీ విపుల్ ఉజ్వల్ సహా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ తొలిసారి చేపట్టిన ఈ కార్యక్రమం 2024 జనవరి 15 నుంచి 19వ తేదీవరకూ ‘ఐఐఎం-ఎ’ ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఇందులో జిల్లా పంచాయతీ రాజ్ సంస్థల చైర్మన్లు/అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు సహా ఎన్నికైన ప్రతినిధులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు. వీరంతా సంస్థాగత, నిర్వహణాత్మక, సుస్థిర ప్రగతి లక్ష్యాల ఇతివృత్త సంబంధిత వివిధ అంశాలపై శిక్షణ పొందుతారు.
దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నాయకత్వ సామర్థ్య వికాసం, పంచాయతీరాజ్ సంస్థల పటిష్టత, సామర్థ్యం పెంపు కార్యకలాపాలకు చేయూత లక్ష్యంగా ‘ఎంఒపిఆర్’ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పు తేవడానికి నాయకత్వం వహిస్తున్న ‘ఎంఒపిఆర్’ వృత్తిపరమైన నాయకత్వ నైపుణ్యాల పెంపు దిశగా పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికైన ప్రజాప్రతినిధులు-యంత్రాంగం కోసం ‘‘స్కీమ్ ఆఫ్ లీడర్‌షిప్/మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’’ను సిద్ధం చేసింది. దీనికింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ ‘పిఆర్‌ఐ’ ప్రతినిధులు, యంత్రాంగానికి శిక్షణ కోసం ‘ఎంఒయు’ను అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తమతమ పరిధులలోగల ‘ఐఐఎమ్/ఐఐటి/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ వంటి సంస్థల సహకారం స్వీకరించాలి. మెరుగైన, అవగాహనతో కూడిన నిర్ణయాత్మకత, పరిపాలన దిశగా పంచాయతీ రాజ్ సంస్థలలో నాయకత్వ నైపుణ్య వికాసం కోసం మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ మేరకు తొలి బృందంగా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జిల్లా పంచాయతీ/ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు, సీనియర్ అధికారులు శిక్షణకు హాజరవుతున్నారు. తదనుగుణంగా భాగస్వామ్య రాష్ట్రాలు కూడా తమతమ పరిధిలోని ప్రసిద్ధ సంస్థల సహకారంతో తమవైపు నుంచి కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తాయని పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ భావిస్తోంది. పంచాయతీ నాయకుల నైపుణ్య, విజ్ఞాన వికాసం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని మూడో అంచె సమర్థంగా పనిచేసేలా శిక్షణనివ్వడం లక్ష్యంగా ఈ ఐదు రోజుల వినూత్న మార్గాదర్శక కార్యక్రమం నిర్వహించబడుతోంది. వనరుల సద్వినియోగం, పంచాయతీ రాజ్ సంస్థల సమర్థ పనితీరుకు తగినట్లు ఇందులో పాల్గొంటున్న వారిని నాయకత్వ, నిర్వాహక నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తారు.
ఈ వినూత్న నాయకత్వ/నిర్వహణాభివృద్ధి కార్యక్రమంలో- నాయకత్వం, సమష్టి కృషి, ఆర్థిక నిర్వహణ, పంచాయతీ ఫైనాన్స్, సమర్థ సమాచార ప్రదానం, ప్రాజెక్టుల నిర్వహణ-పర్యవేక్షణ, డిజిటల్ పరివర్తనాత్మకత, ‘ఐసిటి’ వగైరాలన్నిటికీ సంబంధించి వివిధ మాడ్యూళ్ల కింద శిక్షణ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా... అత్యున్నత సంస్థల సహకారంతో పంచాయితీ రాజ్ సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సారూప్య కార్యక్రమాల శ్రేణి ప్రారంభం కావడాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది.
పంచాయతీ ప్రతినిధుల శిక్షణ, చేయూత, సన్నద్ధతకు ప్రాధాన్యం ద్వారా క్షేత్రస్థాయి సుపరిపాలనలో కొత్త శకానికి పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నాంది పలికింది. స్థానిక పాలనలో ఈ నాయకులు, అధికారులు పోషించే కీలక పాత్రను గుర్తిస్తూ, ప్రజా సేవా ప్రదానంలో అత్యున్నత ప్రమాణాలతో పోటీపడేలా వారి సామర్థ్యాలను పెంచాలన్నది ‘ఎంఒపిఆర్’ లక్ష్యం. పంచాయతీలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి... పౌరులకు-ప్రభుత్వానికి మధ్య అవి ప్రాథమిక వారధులుగా పనిచేస్తాయి. అట్టడుగు స్థాయిలో గణనీయ పరివర్తనాత్మక మార్పు తేవడంలో పంచాయతీల ప్రతినిధులు, యంత్రాంగం సదాశయాలు కలిగి ఉండాలి. అంతేగాక స్థానిక స్వపరిపాలనలోని బహుముఖ సవాళ్ల పరిష్కారానికి తగిన విజ్ఞానం, నైపుణ్యాలు కలిగి ఉండటం కూడా అత్యవసరం. సమగ్ర శిక్షణా కార్యక్రమాల శ్రేణి ద్వారా పాలనలోని వివిధ అంశాలలో పంచాయతీ నాయకులు, యంత్రాంగం సామర్థ్యం పెంచేందుకు పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. సమర్థ నాయకత్వం, ఆర్థిక నిర్వహణ, సామాజిక సంబంధాలు, డిజిటల్ అక్షరాస్యత, సుస్థిర ప్రగతి సహా అనేక అంశాలతో శిక్షణా మాడ్యూళ్లు రూపొందించబడ్డాయి. స్థానికీకృత సుస్థిర ప్రగతి లక్ష్యాలను (ఎల్ఎస్‌డిజి) సాధించేలా సామాజిక ప్రేరణ ఇవ్వడంతోపాటు మార్గనిర్దేశం చేసేలా నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కూడా కార్యక్రమ లక్ష్యాలుగా ఉన్నాయి.
పంచాయితీ ప్రతినిధులు, యంత్రాంగం అభివృద్ధికి కృషి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని సమాజాలనూ సానుకూల రీతిలో ప్రభావితం చేసే తరంగ ప్రభావాన్ని మంత్రిత్వశాఖ ఆశిస్తోంది. ప్రజా సేవలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడమేగాక క్షేత్రస్థాయిలో సానుకూల మార్పు దిశగా నడిపించే నాయకుల శ్రేణిని సృష్టించడం దీని అంతిమ లక్ష్యం.
నేపథ్యం
ఇప్పటివరకు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంచాయతీ రాజ్ శాఖల సహకారంతో వివిధ సామర్థ్య వికాస పథకాలు/కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు నవీకరించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ఎన్నికైన ప్రతినిధులు, యంత్రాంగం పాలన సామర్థ్యం పెంచేందుకు శిక్షణను అందిస్తోంది. ఈ దిశగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ-పంచాయతీ రాజ్ శాఖ, ఆయా రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి సంస్థలు-పంచాయతీ రాజ్ శాఖలద్వారా పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి పాలన సామర్థ్యంతోపాటు వివిధ అంశాల్లో నిర్వహణ నైపుణ్యం పెంచడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్ వంటి ప్రసిద్ధ సంస్థలను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తోంది.
***
(Release ID: 1995741)
Visitor Counter : 227