రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంజాబ్‌లో రూ.4,000 కోట్ల విలువైన 29 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 10 JAN 2024 6:02PM by PIB Hyderabad

కొత్త జాతీయ రహదారుల ద్వారా పంజాబ్‌ మరింత అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, రూ.4,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఈ రోజు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రారంభించారు. కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సునీల్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ రోజు ప్రారంభించిన & శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తాయి. దీనివల్ల, ఆ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి, ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. వాహన రద్దీ చిక్కులు లేకుండా వాహనాలు సాఫీగా సాగిపోతాయి. సరకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఫగ్వారా-హోషియార్‌పూర్ బైపాస్‌ సహా 4 వరుసల రహదారి నిర్మాణంతో ఫగ్వారా-హోషియార్‌పూర్ మధ్య గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణం చేయవచ్చు, ప్రయాణ సమయం 1 గంట నుంచి 30 నిమిషాలకు తగ్గుతుంది. ఫగ్వారా-హోషియార్‌పూర్ బైపాస్ పట్టణ ప్రాంతంలో రద్దీని ఇది తగ్గిస్తుంది, 44వ నంబర్‌ జాతీయ రహదారి (జీటీ రోడ్) ద్వారా హోషియార్‌పూర్‌ను నేరుగా అనుసంధానిస్తుంది. లూథియానాలోని జీటీ రోడ్, 5వ నంబర్‌ జాతీయ రహదారిని కలుపుతూ నిర్మించిన 4 వరుసల లడోవాల్ బైపాస్‌ వల్ల, లుధియానా-ఫిరోజ్‌పూర్ జాతీయ రహదారి నుంచి దిల్లీ-జలంధర్ జాతీయ రహదారిలోకి (44వ నంబర్‌ జాతీయ రహదారి) నేరుగా ప్రవేశించవచ్చు.

తల్వాండీ భాయ్ నుంచి ఫిరోజ్‌పూర్ సెక్షన్, ఫిరోజ్‌పూర్ బైపాస్ వరకు నిర్మించిన 4 వరుసల రహదారి ఆ ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రహదార్ల నిర్మాణం వల్ల జాతీయ రహదార్లపై భద్రత, వేగం పెరుగుతుంది. ఆయా
ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు రాకపోకలు పెరుగుతాయి.

ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో, శ్రీ గడ్కరీ కొత్త రహదారి ప్రాజెక్టులను ప్రకటించారు. వాటిలో, జలంధర్-పఠాన్‌కోట్ మార్గంలో ముకేరియన్, దాసుయా, భోగ్‌పూర్‌ వద్ద రూ.1600 కోట్ల వ్యయంతో 45 కి.మీ. మేర 4 వరుసల బైపాస్ నిర్మాణం; తండా నుంచి హోషియార్‌పూర్ వరకు  రూ.800 కోట్ల వ్యయంతో 30 కి.మీ. మేర 4 వరుసల బైపాస్‌ ఉన్నాయి.

***


(Release ID: 1995128) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Punjabi