మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
2024 జనవరి 7 నుండి 9 వరకు ఒడిశాలో జరిగే సాగర్ పరిక్రమ ఫేజ్-11 కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా
Posted On:
06 JAN 2024 1:35PM by PIB Hyderabad
ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో 2024 జనవరి 7 నుండి 9 వరకు నిర్వహించబడుతున్న సాగర్ పరిక్రమ ఫేజ్-11 కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా మరియు ఎంఓఎస్ డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులైన ప్రగతిశీల మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) అందజేస్తారు. తీరప్రాంత మత్స్యకారులు మరియు చేపల రైతులు, యువ మత్స్య పారిశ్రామికవేత్తలు మొదలైన వారిని సత్కరిస్తారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) పథకం, కెసిసి మరియు ఇతర పథకాల ద్వారా తీసుకున్న ఉత్తమ పద్ధతులు మరియు కార్యక్రమాలు మత్స్యకారులకు విస్తృతంగా ప్రచారం చేయబడతాయి.
సాగర్ పరిక్రమ ఫేజ్-11 ఒడిశాలోని కోస్తా జిల్లాలైన గంజాం, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపరా, భద్రక్, బాలాసోర్ జిల్లాలను కవర్ చేస్తుంది. ఫిషరీస్ శాఖ, భారత ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, మత్స్యకారుల సంఘం మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సాగర్ పరిక్రమ యాత్రలో మత్స్యకారులు, చేపల పెంపకందారులు మరియు ఇతర సంబంధిత వాటాదారులతో సమీక్ష సమావేశాలు మరియు పరస్పర చర్చలు ఉంటాయి. ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో కెసిసి మరియు ఇతర కార్యకలాపాలపై ప్రచారాలు నిర్వహించబడతాయి. రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు ప్రతినిధులు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, మత్స్యకారుల సహకార సంఘం నాయకులు, నిపుణులు, శాస్త్రవేత్తలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వాటాదారులు కూడా ఈ కార్యక్రమాలతో పాటు పాల్గొంటారు.
ఒడిశా రాష్ట్రం 480 కిమీల తీరప్రాంతం, 24,000 చదరపు కిమీ ఖండాంతర షెల్ఫ్ ప్రాంతం, 0.017 మిలియన్ స్కేర్ కిలోమీటర్ల ప్రత్యేక ఎకనామిక్ జోన్, 33 సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 57 ఐస్ ప్లాంట్లు మరియు 3 ఫిష్ & రొయ్యల మేత మిల్లులతో పాటు విభిన్నమైన నీటి వనరులను కలిగి ఉంది. ఒడిషాలోని జల జీవవైవిధ్యం మరియు చేపల సంపద 16 లక్షల మందికి పైగా మత్స్యకారులను ఆదుకుంటుంది మరియు వాణిజ్య చేపలు పట్టడం, ఆక్వాకల్చర్ మొదలైన అనేక అదనపు కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది.
"సాగర్ పరిక్రమ" మొదటి దశ ప్రయాణం 5 మార్చి 2022న గుజరాత్‌లోని మాండ్వి నుండి ప్రారంభమైంది మరియు ఇప్పటివరకు సాగర్ పరిక్రమ యొక్క మొత్తం పది దశలు గుజరాత్, డామన్ & డయ్యూ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అండమాన్ & నికోబార్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరిల్లోని తీరప్రాంతాలు కవర్ చేయబడ్డాయి.
లబ్దిదారుల ఇబ్బందులను గుర్తించడం ద్వారా వారి జీవన నాణ్యతను మరియు ఆర్థిక శ్రేయస్సును సాగర్ పరిక్రమ యాత్ర మెరుగుపరుస్తుంది. మత్స్యకారులు వారి ఇంటి వద్ద ప్రభుత్వ అధికారులను కలవడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) మరియు భారత ప్రభుత్వం అమలు చేసే ఇతర కార్యక్రమాల ద్వారా మత్స్యకారులు, చేపల పెంపకందారుల సమస్యలను పరిష్కరించడంలో మరియు వారి ఆర్థిక అభ్యున్నతికి సాగర్ పరిక్రమ నిరంతరం మద్దతు ఇస్తుంది.
మత్స్య రంగం సూర్యోదయ రంగంగా పరిగణించబడుతుంది మరియు సమాజంలోని బలహీన వర్గానికి ఆర్థిక సాధికారత ద్వారా సమానమైన మరియు సమ్మిళిత వృద్ధిని తీసుకురావడానికి అపారమైన సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారతదేశం 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు, 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు, అతిపెద్ద రొయ్యల ఉత్పత్తిదారు మరియు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సముద్ర ఆహార ఎగుమతిదారుగా ఉంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్యకార సంబంధిత పథకాలు మరియు కార్యక్రమాలపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మరియు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి మత్స్యకారులు, తీరప్రాంత వర్గాలు మరియు వాటాదారులతో పరస్పర చర్యను సులభతరం చేయడం సాగర్ పరిక్రమ లక్ష్యం.
***
(Release ID: 1993961)
Visitor Counter : 125