కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొచ్చి-ల‌క్ష‌ద్వీప్ దీవుల స‌బ్‌మెరైన్ ఆప్టిక‌ల్ ఫైబర్ క‌నెక్ష‌న్‌ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


“ఈ ప్రాజెక్ట్ లక్షద్వీప్ ప్రజలకు 100 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్‌ని అందిస్తుంది”: పిఎం

ఈ కనెక్షన్ లక్షద్వీప్ దీవులలో కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక నమూనా మార్పును నిర్ధారిస్తుంది.

ఇది వేగవంతమైన మరియు మరింత విశ్వసనీయమైన ఇంటర్నెట్ సేవలు, టెలిమెడిసిన్, ఇ-గవర్నెన్స్, విద్యా కార్యక్రమాలు, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ వినియోగం, డిజిటల్ అక్షరాస్యత మొదలైన వాటిని అందిస్తుంది.

ప్రాజెక్ట్‌కి యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్‌ఓఎఫ్‌), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ద్వారా నిధులు సమకూరుతాయి

Posted On: 03 JAN 2024 4:21PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు లక్షద్వీప్‌లోని కవరత్తిలో  కొచ్చి-లక్షద్వీప్ దీవుల సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (కెఎల్‌ఐ-ఎస్‌ఓఎఫ్‌సి) ప్రాజెక్ట్‌తో పాటు సాంకేతికత, ఇంధనం, నీరు, వనరులు, ఆరోగ్యం మరియు విద్య సహా అనేక రంగాలకు సంబంధించిన విస్తృత శ్రేణిని కవర్ చేస్తూ రూ. 1,150 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

కెఎల్‌ఐ-ఎస్‌ఓఎఫ్‌సి ప్రాజెక్ట్ కొత్త అవకాశాలను అందించే ఇంటర్నెట్ వేగం పెరుగుదలకు దారి తీస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా సబ్‌మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా లక్షద్వీప్‌కు అనుసంధానం కానుంది. ప్రత్యేకమైన సబ్‌మెరైన్‌ ఓఎఫ్‌సి లక్షద్వీప్ దీవులలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలలో ఒక నమూనా మార్పును నిర్ధారిస్తుంది. దీని ద్వారా వేగవంతమైన మరియు మరింత విశ్వసనీయ ఇంటర్నెట్ సేవలు, టెలిమెడిసిన్, ఇ-గవర్నెన్స్, విద్యా కార్యక్రమాలు, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ వినియోగం, డిజిటల్ అక్షరాస్యత మొదలైనవి అందుబాటులోకి వస్తాయి.

ఈ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ 2020లో 1,000 రోజుల‌లోపు వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తామంటూ తాను ఇచ్చిన హామీని గుర్తు చేసుకున్నారు. "కొచ్చి-లక్షద్వీప్ దీవుల సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (కెఎల్‌ఐ-ఎస్‌ఓఎఫ్‌సి) ప్రాజెక్ట్ ఈ రోజు ప్రజలకు అంకితం చేయబడింది మరియు లక్షద్వీప్ ప్రజలకు 100 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్‌ని నిర్ధారిస్తుంది" అని చెప్పారు. ఇది ప్రభుత్వ సేవలు, వైద్య చికిత్స, విద్య మరియు డిజిటల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. లక్షద్వీప్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసే సామర్థ్యం దీని నుండి బలపడుతుంది అని తెలిపారు.

ప్రజల జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం మరియు వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటుందని లక్షద్వీప్ ప్రజలకు ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. “విక్షిత్‌ భారత్‌ నిర్మాణంలో లక్షద్వీప్‌ బలమైన పాత్ర పోషిస్తుంది” అని ప్రధాన మంత్రి హైలైట్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో లక్షద్వీప్ యుటి అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

కొచ్చి-లక్షద్వీప్ సబ్‌మెరైన్ ఓఎఫ్‌సి (కెఎల్‌ఐ) ప్రాజెక్ట్ నేపథ్యం:

 

  • అధిక సామర్థ్యం గల సబ్‌మెరైన్ కేబుల్ లింక్ ద్వారా లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో డిజిటల్‌గా అనుసంధానించాలని కొంతకాలంగా భావిస్తున్నారు. గతంలో ద్వీపాలతో కమ్యూనికేషన్‌కు ఏకైక మార్గం శాటిలైట్ మాధ్యమం. ఇది పరిమిత బ్యాండ్‌విడ్త్ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు పెరుగుతున్న బ్యాండ్‌విడ్త్ డిమాండ్‌ను తీర్చలేకపోయింది.
  • దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డిఓటి)  చర్యలు చేపట్టింది. కొచ్చి-లక్షద్వీప్ సబ్‌మెరైన్ ఓఎఫ్‌సి ప్రాజెక్ట్ (కెఎల్‌ఐ ప్రాజెక్ట్)ను రూపొందించింది.కెఎల్‌ఐ ప్రాజెక్ట్ నిర్ణీత గడువులోపు పూర్తి చేయబడింది.
  • కొచ్చి-లక్షద్వీప్ దీవులలో సబ్‌మెరైన్ కేబుల్ (కెఎల్‌ఐ) ప్రాజెక్ట్ సబ్‌మెరైన్ కేబుల్ కనెక్టివిటీని మెయిన్‌ల్యాండ్ (కొచ్చి) నుండి పదకొండు లక్షద్వీప్ దీవులకు అంటే, కవరత్తి, అగట్టి, అమిని, కద్మత్, చెట్లెట్, కల్పేని, మినికాయ్, ఆండ్రోత్, కిల్తాన్, గోల్డ్‌ మరియు బిత్రాకు విస్తరించారు.
  • ఈ ప్రాజెక్ట్‌కి యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్‌), టెలికమ్యూనికేషన్ శాఖ నిధులు సమకూర్చింది.
  • భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్‌) ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉంది. గ్లోబల్ ఓపెన్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఎం/ఎస్‌ ఎన్‌ఈసీ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు పని అప్పగించబడింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన కార్యకలాపాలలో మెరైన్ రూట్ సర్వే, సబ్‌మెరైన్ కేబుల్ లేయింగ్, సిఎల్‌ఎస్‌ స్టేషన్‌ల సివిల్ నిర్మాణం, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ మరియు ఎండ్ టెర్మినల్స్ (ఎల్‌ఎల్‌టిఈ) కమీషనింగ్ ఉన్నాయి.

image.png


కెఎల్‌ఐ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:
 

  • మొత్తం లింక్ దూరం: 1,868 కి.మీ.
  • ప్రాజెక్ట్ మొత్తం వ్యయం : రూ. 1072 కోట్లు మరియు పన్నులు.


కెఎల్‌ఐ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు:
 

  • ఈ ప్రాజెక్ట్ 'డిజిటల్ ఇండియా' మరియు 'నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్' లక్ష్యాన్ని సాధించడంలో మరియు లక్షద్వీప్ దీవులలో భారత ప్రభుత్వం యొక్క వివిధ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  • ఇ-గవర్నెన్స్, టూరిజం, విద్య, ఆరోగ్యం, వాణిజ్యం మరియు పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది ద్వీపంలోని ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ఈ ప్రాంతాలలో మొత్తం సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
  • లక్షద్వీప్ దీవుల జనాభాకు హై స్పీడ్ వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించబడుతుంది.
  • ఎఫ్‌టిటిహెచ్‌  మరియు 5జీ/4జీ మొబైల్ నెట్‌వర్క్ ద్వారా హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందించబడుతుంది.
  • ఈ ప్రాజెక్ట్ కింద రూపొందించబడిన బ్యాండ్‌విడ్త్ లక్షద్వీప్ దీవులలో టెలికాం సేవలను బలోపేతం చేయడానికి అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు (టిఎస్‌పిలు) అందుబాటులో ఉంటుంది.

***


(Release ID: 1992928) Visitor Counter : 287