గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2020-21 నుంచి 2022-23 వరకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, నిర్వహణ కోసం నెస్ట్స్‌కు దాదాపు రూ.4300 కోట్లు విడుదల

Posted On: 20 DEC 2023 5:02PM by PIB Hyderabad

గిరిజన విద్యార్థులకు వారి సహజ వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించడానికి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్‌ఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది. నవోదయ విద్యాలయాలతో సమానంగా క్రీడలు, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించడానికి ప్రత్యేక సౌకర్యాలతో ఈఎంఆర్‌ఎస్‌లను స్థాపిస్తున్నారు. ఈఎంఆర్‌ఎస్‌ పథకం కింద, పాఠశాల ప్రాంగణం నమూనా నుంచి నిర్మాణం వరకు నిబంధనలను ప్రామాణీకరించారు. దీనివల్ల, ఆయా పాఠశాలల్లో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచారు.

2021-22 కాలంలో, ఈఎంఆర్‌ఎస్‌ల నిర్మాణ వ్యయం మైదాన ప్రాంతాల్లో రూ.20 కోట్ల నుంచి రూ.37.80 కోట్లకు; కొండ ప్రాంతాలు, ఈశాన్య, ఎల్‌డబ్ల్యూఈ ప్రాంతాల్లో రూ.24 కోట్ల నుంచి రూ.48 కోట్లకు పెంచడం జరిగింది. నిర్మాణం, క్రీడలు/అభ్యాసాల కోసం అదనపు సౌకర్యాలు, బాలికలు & బాలలకు హాస్టల్ వసతి, ప్రిన్సిపల్ నివాసాలు, బోధన & బోధనేతర సిబ్బంది నివాసాలు, అతిథి గృహాలు, ఇతర కార్యకలాపాలు సహా పాఠశాలకు సంబంధించిన అన్ని అంశాల కోసం వ్యయాన్ని పెంచడం జరిగింది. తద్వారా, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈఎంఆర్‌ఎస్‌లను కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరిగింది.

ఈఎంఆర్‌ఎస్‌ పథకాన్ని నిర్వహించడానికి, అమలు చేయడానికి "నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్‌)" అనే స్వతంత్ర ప్రతిపత్త సంస్థను స్థాపించడం జరిగింది. నెస్ట్స్‌ నివేదిక ప్రకారం, ఈ రోజు వరకు, దేశంలోని వివిధ రాష్ట్రాలు/యూటీల్లో 694 ఈఎంఆర్‌ఎస్‌లు మంజూరయ్యాయి. వాటిలో 401 పని చేస్తున్నాయి, 271 ఈఎంఆర్‌ఎస్‌ల నిర్మాణం పూర్తయింది. ఈఎంఆర్‌ఎస్‌ల నిర్మాణం, పాఠశాలల నిర్వహణ కోసం రాష్ట్రాలు/యూటీలు/పీఎస్‌యూలు/నిర్మాణ సంస్థలు/రాష్ట్ర సొసైటీలకు మరిన్ని నిధులు విడుదల చేయడానికి నెస్ట్స్‌, నెస్ట్స్‌కు మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తోంది.

గత మూడు సంవత్సరాల్లో, ఈఎంఆర్‌ఎస్‌ పథకం కింద నెస్ట్స్‌కు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిధుల వివరాలు:

 

ఆర్థిక సంవత్సరం

నెస్ట్స్‌కు విడుదల చేసిన నిధులు

2020-21

1199.98 కోట్లు

2021-22

1057.74 కోట్లు

2022-23

1999.90 కోట్లు

 

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1989021) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Hindi