రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స‌కాలంలో నాణ్య‌త క‌లిగిన ఉప‌క‌ర‌ణాలు అన్న ఇతివృత్తంపై ప‌శ్చిమ జోన్ ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ స‌మావేశాన్ని నిర్వ‌హించిన డిజిక్యూఎ

Posted On: 14 DEC 2023 2:25PM by PIB Hyderabad

 స‌కాలంలో నాణ్య‌త క‌లిగిన ఉప‌క‌ర‌ణాలు అన్న ఇతివృత్తంపై ప‌శ్చిమ జోన్ ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ స‌మావేశాన్ని ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి విభాగం ఆధ్వ‌ర్యంలో డైరెక్టొరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ క్వాలిటీ ఎస్యూరెన్స్ 14 డిసెంబ‌ర్ 2023న వ‌డోద‌ర‌లో నిర్వ‌హించింది. ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారం సుల‌భ‌త‌రం చేయ‌డం) అన్న భార‌త ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ర‌క్ష‌ణ ఉత్ప‌త్తిని, నాణ్య‌త హామీ ప్ర‌క్రియ‌ల‌ను క్ర‌మ‌బ‌ద్ధం చేసేందుకు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ చేప‌ట్టిన నూత‌న చొర‌వ‌ల‌ను వివిధ భాగ‌స్వాముల‌కు వివ‌రించ‌డం జ‌రిగింది. అద‌న‌పు కార్య‌ద‌ర్శి (ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి) శ్రీ టి. న‌ట‌రాజ‌న్ ఈ ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌గా, డిజిక్యూఎ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ లెఫ్ట‌నెంట్ జ‌న‌ర‌ల్ ఆర్ ఎస్ రీన్ అధ్య‌క్ష‌త వ‌హించారు. గ్రీన్ ఛానెల్ (ప‌ర్యావ‌ర‌ణ అనుకూల మార్గం), స్వీయ స‌ర్టిఫికేష‌న్ ప‌థ‌కాలు ర‌క్ష‌ణ ప‌రిక‌రాల త‌యారీదారుల‌కు మ‌రింత స్వ‌యంప్ర‌తిప‌త్తిని అందించాయ‌ని త‌న ప్ర‌సంగంలో శ్రీ టి. న‌ట‌రాజ‌న్ తెలిపారు. అద‌నంగా, రీమోట్ క్యూఎ ఇన‌స్పెక్ష‌న్ (దూరం నుంచి నాణ్య‌త హామీ త‌నిఖీ), ర‌క్ష‌ణ ప‌రిక‌రాల ఎగుమ‌తి ప్రోత్సాహ‌క ప‌థ‌కం, ర‌క్ష‌ణ ప‌రిక‌రాల ప‌రీక్ష‌, మౌలిక స‌దుపాయాల ప‌థ‌కం అన్న‌వి దేశీయ ఉత్ప‌త్తికి ఉత్ప్రేర‌కంగా ప‌ని చేస్తాయ‌న్నారు. ఈ ప‌థ‌కాలు, భార‌తీయ ర‌క్ష‌ణ త‌యారీదారులు కీల‌క ర‌క్ష‌ణ ఉప‌క‌రణాల‌ను వేగ‌వంతంగా స‌ర‌ఫ‌రా చేసేందుకు తోడ్ప‌డ‌తాయ‌ని ఆయ‌న వివ‌రించారు. 
ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఛానెల్ స‌ర్టిఫికేష‌న్‌ను ఎల్‌&టి ముంబైకు ప్ర‌దానం చేశారు. ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు, నావికాద‌ళ క్యూఎ సంస్థ‌, వ‌డోద‌ర‌లో భార‌తీయ సైన్యం సీనియ‌ర్ అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్నారు. 
ఈ స‌మావేశం సంద‌ర్భంగా క్యూఎకి సంబంధించిన సాంకేతిక ప‌త్రాల సంక‌లనాన్ని కూడా విడుద‌ల చేశారు. 

 

***
 



(Release ID: 1986505) Visitor Counter : 48