ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబరు 9న ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0లో ప్రసంగించనున్న ప్రధానమంత్రి


ఇన్ఫినిటీ ఫోరమ్ అంటే- సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదిక;

సమావేశ ఇతివృత్తం.. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’;

Posted On: 07 DEC 2023 3:05PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 9న ఉదయం 10:30 గంటలకు సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదికైన ఇన్ఫినిటీ ఫోరమ్ రెండో సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా పాల్గొంటారు. అలాగే ఇందులో పాల్గొంటున్న వారినుద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు.

   ఈ కార్యక్రమాన్ని ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్’ సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త ప్రగతిశీల ఆలోచనలు, తీవ్ర మస్యలు, వినూత్న సాంకేతికతల అన్వేషణ, చర్చలు, పరిష్కారాలు, అవకాశాల రూపకల్పనకు ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0  ఒక వేదికగా ఉపయోగపడుతుంది.

   ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 సమావేశానికి ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ అన్నది ఇతివృత్తంగా ఉంటుంది. ఇది కింది మూడు విభాగాల సమాహారంగా ఉంటుంది:-

  • ప్లీనరీ ట్రాక్: నవతరం అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం రూపకల్పన
  • గ్రీన్ ట్రాక్: హరిత సముచ్ఛయానికి సహేతుకత
  • సిల్వర్ ట్రాక్: ‘గిఫ్ట్- ఐఎఫ్ఎస్‌సి’లో దీర్ఘకాలిక ఆర్థిక కూడలి

ప్రతి ట్రాక్‌లో ఒక సీనియర్ పారిశ్రామిక అగ్రగామి ప్రతినిధి ఇన్ఫినిటీ ప్రసంగంతోపాటు భారత్ సహా ప్రపంచవ్యాప్త ఆర్థికరంగ పరిశ్రమ నిపుణులు-వృత్తిదారులతో బృంద చర్చ కూడా నిర్వహించబడుతుంది. ఇది ఆచరణాత్మక ఆలోచనలను, అనుసరణీయ పరిష్కారాలను సూచిస్తుంది.

   ఇన్ఫినిటీ వేదికపై భారతదేశంతోపాటు అమెరికా, యుకె, సింగపూర్, దక్షిణాఫ్రికా, యుఎఇ, ఆస్ట్రేలియా, జర్మనీ సహా 20కిపైగా ప్రపంచ దేశాల నుంచి 300 మందికిపైగా ‘సిఎక్స్ఒ’ ప్రతినిధులతో కూడిన బలమైన ఆన్‌లైన్  ప్రేక్షక భాగస్వామ్యం కనిపించనుంది. ఈ కార్యక్రమానికి విదేశీ విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు, విదేశీ రాయబార కార్యాలయాల ప్రతినిధులు కూడా హాజరవుతారు.

****


(Release ID: 1984056) Visitor Counter : 89