భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

సముద్ర అన్వేషణ

Posted On: 06 DEC 2023 12:33PM by PIB Hyderabad

లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, “బయోలాజికల్ ఇవాల్యుయేషన్స్‌, డిస్కవరీ ఆఫ్‌ నావెల్‌ బయోయాక్టివ్ కాంపౌండ్స్‌ & కో-ఆర్డినేషన్‌ ఆఫ్‌ ప్రోగ్రాం - డ్రగ్ ఫ్రమ్ సీ” పేరిట ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎస్‌) ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐ ప్రాజెక్టు 2020లో పూర్తయింది. క్యాన్సర్‌ నిరోధక, నరాల వ్యాధుల నిరోధక, కణితి నిరోధక, బాక్టీరియా వ్యాధుల నిరోధక కార్యకలాపాల కోసం 2,654 సమ్మేళనాలను శాస్త్రవేత్తలు పరీక్షించారు, జీపీసీఆర్‌ సవరణల కోసం క్రోడీకరించారు.

సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐ, ప్రస్తుతం, ఔషధ విభాగం నిధుల మద్దతుతో "సెంటర్ ఫర్ మెరైన్ థెరప్యూటిక్స్"పై ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఎంవోఈఎస్‌ ఆధ్వర్యంలో పని చేసే, చెన్నైలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ' (ఎన్‌ఐవోటీ),  లుటిన్ వంటి ఆరోగ్య నిర్వహణ ఉప పోషకాలను ఉత్పత్తి చేసేందుకు భారతీయ సముద్రాల లోతుల్లో పెరుగుతున్న సముద్ర సూక్ష శైలవాలు, సూక్ష్మజీవులపై పరిశోధనలు నిర్వహించింది. ఇది వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, ఫైకోసైనిన్‌ను అధిక యాంటీ-ఆక్సిడెంట్ చర్యతో నిరోధిస్తుంది, రాడికల్స్‌ను తొలగించే సామర్థ్యం కలిగి ఉంటుంది.

సీఎస్‌ఐఆర్‌-సీడీఆర్‌ఐ పరీక్షించిన సమ్మేళనాలను, ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) ప్రకారం ఐదు వేర్వేరు క్యాన్సర్ రకం కణాలపై (ఎండీఏ-ఎంబీ231, డీఎల్‌డీ-1, ఎఫ్‌ఏడీయూ, హెచ్‌ఈఎల్‌ఏ, ఏ549) పరీక్షించారు, జీఎస్‌/ఐఐసీటీ5/6 పేరిట ఒక శక్తిమంతమైన క్యాన్సర్ నిరోధక అణువును గుర్తించారు. సునిటినిబ్‌తో పోలిస్తే ఈ అణువు మెరుగైన కణితి నిరోధకత చూపించింది. కీమోథెరపీ ఆధారిత పరిధీయ నరాల నొప్పిని తగ్గించగల ఒక కొత్త సమ్మేళనం ఎస్‌బీ/సీడీఆర్‌ఐ4/105ను కనిపెట్టారు. ప్రస్తుతం దీనిపై పరిశోధన ముగింపు దశలో ఉంది. ఎస్‌పీ/ఎన్‌ఐఎస్‌ఈఆర్‌29 అనే శక్తిమంతమైన అణువుకు క్యాన్సర్ నిరోధకత సామర్థ్యం ఉందని కూడా గుర్తించారు. క్యాన్సర్‌ నిరోధకత కలిగిన కొత్త ఉమ్మడి సమ్మేళనం ఎల్-ఆస్పరాగినేస్‌ను ఎన్‌ఐవోటీ కనిపెట్టింది, పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.

సముద్రం నుంచి నిర్జీవ, జీవ వనరుల సేకరణకు సంబంధించిన వివిధ ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడానికి నమ్మకమైన స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం ఎన్‌ఐవోటీ ప్రధాన లక్ష్యం. శక్తి, మంచినీరు, సముద్రగర్భ సాంకేతికత  & సముద్రగర్భ తవ్వకం, తీర రక్షణ, సముద్ర ధ్వనులు, మెరైన్ సెన్సార్లు, ఓషన్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన పరిశోధన, సాంకేతిక అభివృద్ధిని ఈ సంస్థ చేపట్టింది. గత 3 సంవత్సరాల్లో ఎన్‌ఐవోటీ చేపట్టిన పరిశోధన ప్రధాన ఫలితాలు ఇవి:

  1. ఎన్‌ఐవోటీ రూపొందించిన లో టెంపరేచర్‌ థర్మల్ డీశాలినేషన్ (ఎల్‌టీటీడీ) సాంకేతికతను లక్షద్వీప్‌లోని కల్పేని, కడమట్, అమిని దీవుల్లో రోజుకు 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో పని చేసే నిర్లవణీకరణ కేంద్రాల స్థాపనకు ఉపయోగించారు. కవరత్తి ద్వీపం వద్ద ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ (ఓటీఈసీ) ద్వారా రోజుకు లక్ష లీటర్ల ఎల్‌టీటీడీ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక పూర్తయింది. ట్యుటికోరిన్ బొగ్గు విద్యుత్‌ కేంద్రంలో రోజుకు 2 లక్షల లీటర్ల ఎల్‌టీటీడీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక పూర్తయింది.
  2. మధ్య హిందూ మహాసముద్రంలో 5,270 మీటర్ల లోతులో సముద్రగర్భ తవ్వకం కోసం ఎన్‌ఐవోటీ అభివృద్ధి చేసిన యంత్ర సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. మొదటి భారతీయ మానవ సహిత మహాసముద్ర అన్వేషణ కార్యక్రమం "సముద్రయాన్" 2021 అక్టోబర్ 30న ప్రారంభమైంది. 500 మీటర్ల లోతుకు వెళ్లే మానవ సహిత సబ్‌మెర్సిబుల్స్‌ను ధృవీకరణ పూర్తయింది. 6,000 మీటర్ల లోతుకు వెళ్లే స్వయంచాలిత సముద్రగర్భ వాహనాన్ని (ఏయూవీ) కొనుగోలు చేశారు. దానిని సీఐవోబీ వద్ద సముద్రగర్భ అన్వేషణ కోసం ఉపయోగించారు.
  3. కేరళలోని పూంతుర తీరంలో తీర ప్రాంత రక్షణ కోసం ఇంజినీరింగ్ ఆకృతులపై అధ్యయనాలు జరిగాయి.
  4. పశ్చిమ బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లోని తక్కువ లోతు (0-30 మీటర్ల నీటి లోతు) ప్రాంతాల్లో నీటి లోతు కనుగొనే సర్వేను విజయవంతంగా చేపట్టారు.
  5. ధృవ ప్రాంతాల్లో పరిశోధనల కోసం నిష్క్రియాత్మక ధ్వని పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది, ఆర్కిటిక్ మహాసముద్రంలో పరీక్షించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో పరిశోధనల కోసం 'అటానమస్ డీప్ వాటర్ నాయిస్ మెజర్మెంట్ సిస్టమ్ట (డీఏఎన్‌ఎంఎస్‌) అభివృద్ధి చేసి, పరీక్షించింది. 'డీప్ సీ అటానమస్ అండర్ వాటర్ ప్రొఫైలింగ్ డ్రిఫ్టర్' (డి-ఏయూపీడీ), 500 మీటర్ల లోతు వరకు పనిచేసే సి-ప్రొఫైలర్లను కూడా రూపొందించి, పరీక్షించింది.
  6. వాతావరణం, సముద్రానికి సంబంధించి వాస్తవ-సమయ పరిశీలనలను అందించడం ద్వారా ఐఎండీకి మద్దతు ఇవ్వడానికి, అరేబియా సముద్రం & బంగాళాఖాతంలో నీటిపై తేలే లంగరు తరహా వ్యవస్థను ఏర్పాటు చేసింది. భారత తీరం వెంబడి 10 హెచ్‌ఎఫ్‌ రాడార్లను ఏర్పాటు చేసింది.
  7. 4 పరిశోధన నౌకలను (సాగర్ నిధి, సాగర్ మంజూష, సాగర్ తార, సాగర్ అన్వేషిక) ఎన్‌ఓఐటీ నిర్వహించింది. సముద్ర తీర జలాల్లో సాంకేతిక ప్రదర్శన, సర్వే, క్షేత్ర స్థాయి కార్యకలాపాల కోసం ఈ నౌకలను ఉపయోగించారు.
  8. సముద్ర పర్యావరణ పరిరక్షణ కోసం 'ల్యాబ్ స్కేల్ బ్యాలస్ట్ వాటర్ టెస్ట్' సదుపాయాన్ని తీసుకొచ్చింది. సముద్రపు నీటిలో రసాయన అవశేషాలను పరీక్షించడానికి ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపును ఇది పొందింది. దృఢమైన గోళాకార బోనులను ఉపయోగించి స్వయంచాలిత చేపల ఆహార వ్యవస్థను అభివృద్ధి చేసింది. అండమాన్ దీవుల్లో దీనిని పరీక్షించింది. 

ఎన్‌ఐవోటీ పరిశోధనల ఆధారంగా అనేక పేటెంట్లు, ముద్రణలు, దేశీయంగా అభివృద్ధి చేసిన కొన్ని ఉత్పత్తుల సాంకేతిక బదిలీలు జరిగాయి.

కేంద్ర భూ శాస్త్ర శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1983166) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Hindi , Tamil