పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

బాధ్యతాయుత, స్థిర అభివృద్ధి ఎలా సాధించాలి అన్న అంశానికి భారతదేశం ఒక ఉదాహరణగా నిలుస్తుంది : కార్యదర్శి శ్రీమతి లీనా నందన్


భారతీయ వాతావరణ పరిస్థితులకు అత్యంత అనుకూలమైన శీతలకరణి అంశాలపై పరిశోధనలు జరగాలి : శ్రీమతి నందన్

ఉత్పత్తి, వినియోగంలో హెచ్సిఎఫ్సి దశలవారీగా 35% నిర్మూలించాలి అన్న లక్ష్య సాధనలో భారతదేశం 44% లక్ష్యం సాధించింది: శ్రీమతి నందన్

సుస్థిర శీతలకరణ అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న శ్రీమతి నందన్

Posted On: 03 DEC 2023 4:06PM by PIB Hyderabad

పర్యావరణ లక్ష్యాలు సాధించడానికి భారతదేశం నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి లీనా నందన్ తెలిపారు. దుబాయ్‌లో యూఎన్ఎఫ్సీసీసీ కాప్ 28 సదస్సులో భాగంగా ఇండియా పెవిలియన్‌లో “స్థిరమైన శీతలీకరణ వైపు భారతదేశం ప్రయాణం” అనే అంశంపై ఈ  రోజు జరిగిన సమావేశంలో  శ్రీమతి లీనా నందన్ పాల్గొని ప్రసంగించారు  లక్ష్య సాధన కోసం భారతదేశం చేస్తున్న కృషికి పర్యావరణ అంశంలో జాతీయ స్థాయిలో సాధించిన ప్రగతి నిదర్శనంగా ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం చేస్తున్న కృషిని వివరించిన  శ్రీమతి లీనా నందన్ “ 2015లో భారతదేశం ఎన్డీసీ లక్ష్యాలు ప్రకటించింది.  2030 నాటికి కర్బన ఉద్గార తీవ్రతను 33-35%  వరకు తగ్గించాలని భారతదేశం నిర్ణయించింది. అయితే, భారతదేశం చేసిన కృషి వల్ల ముందుగానే లక్ష్యాలు నెరవేరాయి. అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారతదేశం కర్బన వుడిగారాలు తగ్గించింది.   ఆర్థిక వృద్ధి నుండి ఉద్గారాలను క్రమంగా విడదీసి అభివృద్ధి సాధిస్తున్నాం.  2019 నాటికి జీడీపీ లో  ఉద్గార తీవ్రత 33% తగ్గింది. " అని వివరించారు. ఇంధన అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇస్తూ భారతదేశం లక్ష్యాలను సాధించిందని ఆమె అన్నారు.  

సాధించిన విజయాలతో  భారతదేశం సరిపెట్టుకోదని  శ్రీమతి నందన్ స్పష్టం చేశారు.  " పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు సాధించాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో  గత సంవత్సరం నవీకరించబడిన  వాతావరణ మార్పుల లక్ష్యాలను భారతదేశం సాధించింది. ప్రపంచ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు మరింత కృషి జరగాలి అని భారతదేశం భావిస్తోంది." అని  ఆమె అన్నారు. 

"సమస్యకు  భారతదేశం కారణం  కాదు. కానీ వాతావరణ మార్పుల పర్యవసానాలను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. సమస్య పరిష్కారంలో ప్రధాన పాత్ర పోషించాలి అన్న విధానంతో భారతదేశం పని చేస్తుంది.  ఆర్థిక వ్యవస్థ , జీవావరణ శాస్త్రం, అభివృద్ధి , పర్యావరణం మధ్య సమతుల్యత సాధించి అభివృద్ధి సాధించాలి అన్నది భారతదేశం విధానం" అని ఆమె వివరించారు. 

“ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేక  దేశాలకు నమూనాగా  మారింది. మార్పులకు అనుగుణంగా పని చేయడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరం.   భారతీయ వాతావరణ పరిస్థితులకు అత్యంత సముచితంగా ఉండే శీతలకరణ అంశాలపై  పరిశోధనలు జరగాలి. పరిశ్రమ వర్గాలతో సమన్వయం  సాధించి సాధ్యమైనంత త్వరగా  పరిశోధన ఫలితాలు అమలు జరగాల్సిన అవసరం ఉంది" అని  శ్రీమతి లీనా నందన్ తెలిపారు.

బాధ్యతాయుత, స్థిర అభివృద్ధి  ఎలా సాధించాలి అన్న అంశానికి భారతదేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని  శ్రీమతి లీనా నందన్ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శీతలీకరణ రంగంలో  భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలని ఆమె పరిశ్రమ, సంబంధిత వర్గాలకు ఆమె సూచించారు. 

  మాంట్రియల్ ప్రోటోకాల్ కింద భారతదేశం సాధించిన లక్ష్యాలు , పర్యావరణ స్థిరత్వానికి అవసరమైన స్థిరమైన శీతలీకరణ, థర్మల్  పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం భారతదేశం చేస్తున్న కృషిని వివరిస్తూ పెవిలియన్ వద్ద కార్యాచరణ ప్రణాళిక ప్రదర్శించారు. 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి రాజశ్రీ రే భారతదేశంలో స్థిరమైన శీతలీకరణ, ఉష్ణ సౌలభ్యాన్ని సాధించేందుకు సమీకృత విధానం  ప్రాముఖ్యతను వివరించారు. 

కార్యక్రమంలో భాగంగా "స్థిరమైన శీతలీకరణ దిశగా భారతదేశం  ప్రయాణం"పై ఒక నివేదికకు విడుదల చేశారు. అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలు, ప్రమాణాల సాధన కోసం భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలు, చర్యలను దీనిలో పొందుపరిచారు.  

నివాస, వాణిజ్య భవనాలు, కోల్డ్-చైన్, శీతలీకరణ, రవాణా, పరిశ్రమలు వంటి వివిధ రంగాలలో శీతలీకరణ కీలకంగా ఉంటుంది.  దేశ ఆర్థిక వృద్ధితో పాటు  శీతలీకరణ డిమాండ్ పెరుగుతుంది. విడి విడిగా కాకుండా సమీకృత చర్యలు అధిక ప్రభావాన్ని చూపుతాయని గుర్తించిన ప్రభుత్వం  శీతలీకరణ పట్ల సమగ్ర దీర్ఘకాలిక దృష్టి సారించి  ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ (ICAP)కు రూపకల్పన చేసింది. ప్రణాళిక అమలులో  బహుళ వినియోగ వర్గాలు భాగస్వాములుగా ఉంటాయి. సమీకృత, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ప్రణాళిక అమలు జరుగుతుంది. వివిధ రంగాలలో శీతలీకరణ డిమాండ్, శీతలీకరణ అవసరాలు, స్థిరమైన శీతలీకరణ ప్రాప్యతను అందించే మార్గాలు, సమస్య పరిష్కారానికి  మార్గాలు సూచించడం తదితర కార్యక్రమాలు ప్రణాళికలో భాగంగా అమలు జరుగుతాయి. 

 ఓజోన్పై ప్రభావం చూపని  పదార్థాలు, భూతాపం తగ్గించే   సాంకేతికతలను ఉపయోగించాలని మాంట్రియల్ ప్రోటోకాల్ లో ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంపై భారతదేశంతో సహా పలు దేశాలు సంతకం చేశాయి. లక్ష్య సాధనలో  కొన్ని సందర్భాల్లో అగ్రగామిగా ఉన్న భారతదేశం . మాంట్రియల్ ప్రోటోకాల్ లో అంగీకరించిన విధంగా1.1.2020 నాటికి ముందే  దృఢమైన పాలియురేతేన్ ఫోమ్ ఉత్పత్తిలో బ్లోయింగ్ ఏజెంట్‌గా ఉపయోగించే HCFC 141bని దశలవారీగా తొలగించి లక్ష్యాన్ని సాధించింది.  అదేవిధంగా, కొత్త పరికరాల తయారీలో HCFCల వినియోగాన్ని   31.12.2024 నాటికి దశలవారీగా నిలిపి వేయాలని భారతదేశం నిర్ణయించింది. మాంట్రియల్ ఒప్పందంలో నిర్ణయించిన లక్ష్యం కంటే  ముందుగానే భారతదేశం ఈ లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది. 1.1.2020 నాటికి HCFCల ఉత్పత్తి, వినియోగాన్ని 35% తగ్గించాలని నిర్ణయించారు.     HCFC వినియోగాన్ని దశలవారీగా నిర్మూలించడానికి భారతదేశం 44% లక్ష్యాలను  సాధించింది. 

సదస్సులో  బ్లూ స్టార్ లిమిటెడ్, ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, సుబ్రోస్ టెక్నికల్ సెంటర్ ప్రతినిధులు ప్రసంగించారు. స్థిరమైన శీతలీకరణ కోసం పరిశ్రమలు అమలు చేస్తున్న కార్యక్రమాలను వారు వివరించారు.మాంట్రియల్ ఒప్పందం అమలు కోసం కృషి చేస్తున్న యుఎన్డీపి, యుఎన్ఈపీ  తదితర సంస్థలు లక్ష్య సాధన కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించాయి. 

 

***



(Release ID: 1982193) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi , Tamil