కేంద్ర మంత్రివర్గ సచివాలయం

బంగాళాఖాతంలో ‘మిచాంగ్’ తుఫాను నిర్వహణ సంసిద్ధతపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశంలో సమీక్ష

Posted On: 01 DEC 2023 6:13PM by PIB Hyderabad

   బంగాళాఖాతంలో ‘మిచాంగ్’ తుపాను నేపథ్యంలో విపత్తు నిర్వహణపై రాష్ట్ర/కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) ఇవాళ సమావేశమైంది.

   ఈ సందర్భంగా తుపాను ప్రస్తుత స్థితి గురించి భారత వాతావరణ విభాగం (ఐఎండి) డైరెక్టర్ జనరల్ కమిటీకి వివరించారు. ఆగ్నేయ-సమీప నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గడచిన 6 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలింది. అనంతరం ఇప్పుడు భారత కాలమానం ప్రకారం 11:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో 9.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.0 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య ఉంది. ఈ మేరకు పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 730 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 740 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 860 కిలోమీటర్లు, బాపట్లకు ఆగ్నేయంగా 930 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

   ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శనివారం (2వ తేదీ) నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అలాగే డిసెంబరు 3 నాటికి నైరుతి బంగాళాఖాతం మీదుగా తీవ్ర తుఫానుగా మారుతుందని అంచనా. అటుపైన వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, సమీపంలోని ఉత్తర తమిళనాడు తీరాలకు చేరవవుతుంది. ఆ తర్వాత దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు సమాంతరంగా ఉత్తరం దిశగా కదులుతూ, మరింత తీవ్రమై డిసెంబరు 5వ తేదీ ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణాంధ్ర తీరం దాటుతుంది. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి.

   ఈ నేపథ్యంలో తుఫాను పయనించే మార్గంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు పుదుచ్చేరి ఆర్థికశాఖ తమతమ పరిధులలో సంసిద్ధతపై ప్రజల ప్రాణ-ఆస్తి నష్టం నివారణకు తామే కాకుండా స్థానిక సంస్థల సహకారంతో చేపట్టిన సన్నాహక చర్యల గురించి కమిటీకి వివరించారు. ఈ చర్యల్లో భాగంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులను హెచ్చరించినట్లు తెలిపారు. తగిన షెల్టర్లు, విద్యుత్ సరఫరా, మందులు మరియు అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కల్పన కోసం భవనాలు సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే విద్యుత్ సరఫరా, మందుల లభ్యతసహా అత్యవసర సేవల సిబ్బందిని సన్నద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

   తుఫాను నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పరిస్థితుల నిర్వహణ కోసం 18 బృందాలను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉంచింది. అవసరాన్ని బట్టి రంగంలో దిగడం కోసం అదనంగా మరో 10 బృందాలను కూడా సంసిద్ధం చేసింది. తీర రక్షక దళం, సైన్యం, నావికాదళం తదితరాలకు చెందిన రక్షణ-సహాయ బృందాలు, ఓడలు, విమానాలను కూడా సిద్ధంగా ఉంచారు.

   సమావేశంలో భాగంగా కేంద్ర సంస్థలతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పుదుచ్చేరి ప్రభుత్వాల సంసిద్ధత చర్యలను సమీక్షించిన అనంతరం అవసరమైన అన్ని నివారణ-ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఆయా రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు. ఈ చర్యలన్నీ ప్రాణ-ఆస్తి నష్టంతోపాటు మౌలిక సదుపాయాల నష్ట నివారణ లక్ష్యంగా ఉండాలన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో కలిగే అవాంతరాలను త్వరితగతిన సరిదిద్ది, సాధ్యమైనంత తక్కువ సమయంలో సేవలను పునరుద్ధరించాలని కోరారు.

   ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా తీరానికి తీసుకొచ్చేలా చూడాలని చెప్పారు. అలాగే చమురు అన్వేషణ రిగ్గులు, నౌకలు తదితరాల్లో నియమితులైన సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలని సూచించారు. తదనుగుణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పుదుచ్చేరి ప్రభుత్వాలు అప్రమత్తమైన నేపథ్యంలో వాటికి ఎలాంటి సహాయం అవసరమైనా అందించేందుకు కేంద్ర సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నట్లు మంత్రిమండలి కార్యదర్శి ప్రకటించారు.

   ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, పుదుచ్చేరి ఆర్థికశాఖ కార్యదర్శిసహా కేంద్ర హోం, మత్స్య, విద్యుత్ శాఖల కార్యదర్శులు; ఓడరేవులు-షిప్పింగ్-జల మార్గాలు/పెట్రోలియం-రసాయనాలు-సహజవాయువు/టెలికాం మంత్రిత్వ శాఖల అదనపు కార్యదర్శులతోపాటు ఎన్డీఎంఎ సభ్య కార్యదర్శి, ఐఎండి డైరెక్టర్ జనరల్, తీర రక్షక దళం డైరెక్టర్ జనరల్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్ పెక్టర్ జనరల్, హోం శాఖ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

****



(Release ID: 1981710) Visitor Counter : 133