శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సాంకేతికత-ప్రాధాన్యత రుణాల ద్వారా ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించడానికి 'సాంకేతికత అభివృద్ధి బోర్డు'- 'స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
Posted On:
17 NOV 2023 3:06PM by PIB Hyderabad
మన దేశంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగాన్ని బలోపేతం చేసేందుకు మరో కీలక అడుగు పడింది. సాంకేతిక అభివృద్ధి బోర్డు (టీడీబీ), స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. స్వదేశీ లేదా దిగుమతి చేసుకున్న సాంకేతికత అభివృద్ధి, వాణిజ్యీకరణలో కార్యకలాపాల్లో ఉన్న సంస్థలకు సులభంగా రుణాలు అందించడం ఈ ఒప్పందం లక్ష్యం.
గతంలో ఒకరికొకరు నిధులు సమకూర్చుకున్న సంస్థలకు ఈ ఒప్పందంలో భాగంగా అదనపు నిధులను టీడీబీ, సిడ్బీ సమకూరుస్తాయి. ఇబ్బందులు లేని సమాచార మార్పిడి కోసం ఈ రెండు సంస్థలు సమన్వయాన్ని క్రమబద్ధీకరిస్తాయి. సంబంధిత విధాన మార్గదర్శకాల ప్రకారం, అర్హత కలిగిన ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం అందిస్తాయి.
సహకారాన్ని పెంచుకోవడానికి, లక్ష్యిత వర్గాలను చేరుకోవడానికి ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా ప్రచారం/మార్కెటింగ్ కార్యకలాపాలు చేపడతాయి. ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రచారం/మార్కెటింగ్ కార్యకలాపాల పరిధి ఉంటుంది.
ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా నిలిచే భాగస్వామ్య నిబద్ధతను టీడీబీ, సిడ్బీ మధ్య భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. సమాజాభివృద్ధి కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసి, అమల్లోకి తీసుకురావాలనే ఈ సంస్థల ప్రయత్నాల్లో ఇది ఒక భాగం. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఆవిష్కరణల వృద్ధి, ఉద్యోగాల సృష్టి, ఆర్థికాభివృద్ధికి ఈ సహకారం తోడ్పడుతుందని భావిస్తున్నారు.
"సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించే మా ప్రయత్నంలో, సిడ్బీతో సహకారం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. మా బలాలను కలపడం ద్వారా, ఎంఎస్‌ఎంఈలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, వ్యవస్థాపకతను & ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ చెప్పారు.
<><><>
(Release ID: 1977778)
Visitor Counter : 110