వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాన్ ఫ్రాన్సిస్కో పర్యటనలో భాగంగా ఫెర్మాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించి, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న శ్రీ పీయూష్ గోయల్

Posted On: 14 NOV 2023 11:08AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం , పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో పర్యటిస్తున్నారు. అధికార పర్యటన కోసం శ్రో గోయల్ 2023 నవంబర్ 13న శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. పర్యటన మొదటి రోజున కేంద్ర మంత్రి ఫ్రీమాంట్‌లోని  టెస్లా ఫ్యాక్టరీని సందర్శించి  టెస్లా గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం అయ్యారు. 

అనంతరం మంత్రి వివిధ దేశాల మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి  కేథరీన్ తాయ్, కొరియా వాణిజ్య శాఖ మంత్రి డుక్గెన్ అహ్న్, సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యోంగ్ తో శ్రీ గోయల్ సమావేశం అయ్యారు. 

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్)లో భాగంగా దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం మరింత పెంపొందించడానికి గల అవకాశాలను మంత్రి ఆయా దేశాల మంత్రులతో చర్చించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ కు సంబంధించిన అంశాలు, వివిధ అంశాల్లో దేశాల మధ్య  సహకారం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. సింగపూర్, కొరియా దేశాల మంత్రులతో జరిపిన చర్చల్లో ఏఐటీఐజీఏ. సిఈపిఏ లను సమీక్షించి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని శ్రీ గోయల్ కోరారు.  

పర్యటనలో భాగంగా యూఎస్ఐఎస్పీఎఫ్, ఇండియా స్పోరా ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రౌండ్ టేబుల్‌ సమావేశంలో ఇంధనం, ఉత్పత్తి, రవాణా, సాంకేతిక రంగాలకు చెందిన పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులతో విడిగా సమావేశం అయిన శ్రీ గోయల్ భారతదేశంలో పరిశ్రమ, వాణిజ్య రంగాల అభివృద్ధికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. 

పర్యటనలో భాగంగా ఐపిఈఎఫ్, ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం  సమావేశంలో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అమెరికాకు చెందిన అధికారులు, వ్యాపారవేత్తలు,, పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరుపుతారు.  

 

***


(Release ID: 1976895) Visitor Counter : 77