జల శక్తి మంత్రిత్వ శాఖ
పండగ వాతావరణం లో ఉత్సాహంగా జరిగిన ఏడవ గంగా ఉత్సవ్ వేడుకలు
Posted On:
04 NOV 2023 6:53PM by PIB Hyderabad
గంగా ఉత్సవ్ 7 వ ఎడిషన్ ను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించింది. జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని జలవనరులు, నదుల అభివృద్ధి ,గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ, ఎన్ ఎమ్ సిజి ప్రత్యేక కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ శ్రీ జి అశోక్ కుమార్ సమక్షంలో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నమామి గంగే మ్యాగజైన్ 33వ ఎడిషన్ ను, న్యూ చాచా చౌదరి సిరీస్ ను, గంగా పుస్తక్ పరిక్రమ ఆధారిత వాయేజ్ ఆఫ్ గంగా బుక్ లెట్ ను ఎన్ బి టి సహకారంతో ఆవిష్కరించారు. గంగా పుస్తక్ పరిక్రమ 2వ ఎడిషన్ ను శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ, శ్రీ జి.అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. గంగా పుస్తక్ పరిక్రమ తన 3 నెలల సుదీర్ఘ ప్రయాణాన్ని 7 నవంబర్ 2023 న గంగోత్రి నుండి ప్రారంభిస్తుంది. 2024 జనవరి 11 న గంగా సాగర్ వద్ద యాత్ర ముగిసే లోగా మధ్యలో గంగా నది ఒడ్డున ఉన్న అన్ని నగరాలు , పట్టణాల - ఉత్తరకాశీ, రిషికేష్, హరిద్వార్, బిజ్నోర్, మీరట్, అలీగఢ్, ఫరూఖాబాద్, కాన్పూర్, ప్రయాగ్రాజ్, మీర్జాపూర్, వారణాసి, చాప్రా, పాట్నా, బెగుసరాయ్, సుల్తాన్ గంజ్, భాగల్పూర్, సాహిబ్ గంజ్, బహరాంపూర్, కోల్ కతా, , హల్దియా- మీదుగా సాగుతుంది.

ఈ సందర్భంగా శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ ప్రసంగిస్తూ, గంగానది కేవలం ఒక నది మాత్రమే కాదని, ఇది మనందరిలో ప్రతిధ్వనించే లోతైన భావోద్వేగమని అన్నారు. గంగా ప్రక్షాళన ప్రయత్నాల్లో, ముఖ్యంగా కొత్త తరం సహకారంతో గణనీయమైన పురోగతిని చూడటం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గాలిబ్ , యమునా నదుల మధ్య అందమైన సంబంధాన్ని ఆమె దృష్టికి తెచ్చారు, మన నదుల లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నదుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె ఉద్ఘాటించారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ 'నీరు ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశం ‘ అని నొక్కి చెబుతారని, మన దేశ సుస్థిర అభివృద్ధిలో నీటి కీలక పాత్రను నొక్కి చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా మన జలవనరులను కలుషితం చేస్తున్న ఘన వ్యర్థాల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు. నీటి వనరుల్లోకి మురుగునీటి ప్రవాహాన్ని పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు , ఘన వ్యర్థాల నిర్వహణను పెంచాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

నదుల పునరుజ్జీవనంలో నీటి సంరక్షణ కీలక పాత్రను ఆమె తన ప్రసంగంలో మరో కేంద్ర బిందువుగా పేర్కొన్నారు. జలసంరక్షణ, నదుల పునరుజ్జీవనం మనమందరం పంచుకునే ప్రాథమిక బాధ్యతలని పేర్కొంటూ, సమిష్టి కార్యాచరణ, సహకారం అవసరమని ఆమె పిలుపునిచ్చారు. నదుల పునరుజ్జీవన ఉదాత్త లక్ష్యంలో జన్ ఆందోళన్ (ప్రజా ఉద్యమం) కీలక పాత్రను ఆమె నొక్కి చెప్పారు.
ఎన్ఎంసిజి ప్రత్యేక కార్యదర్శి , డైరెక్టర్ జనరల్ ఆహూతులకు సాదర స్వాగతం పలికారు. భారతదేశంలో గంగానది కి గల అత్యంత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. గంగా నదిని 2008లో భారత జాతీయ నదిగా ప్రకటించారని, ఇది జాతీయ గంగా దినోత్సవం ఏర్పాటుకు దారితీసిందని శ్రీ కుమార్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం, ఈ పవిత్రమైన రోజు పిల్లలతో సహా వివిధ వర్గాలను ఆనందకరమైన వేడుకలు కార్యకలాపాలలో ఎలా ఏకం చేస్తుందో ఆయన వివరించారు. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రాముఖ్యతను శ్రీ కుమార్ వివరించారు. ఇక్కడ గౌరవ ప్రధాన మంత్రి చేతుల మీదుగా "క్యాచ్ ది రెయిన్" క్యాంపెయిన్ ప్రారంభమైందని, ఆ సందర్భంగా దేశం నలుమూలల నుండి వచ్చిన సర్పంచులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మన ఉమ్మడి వారసత్వంలో గంగా నది పోషిస్తున్న కీలక పాత్రను వివరించారని ఆయన చెప్పారు.

2022 డిసెంబర్ 14న కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ (సిబిడి) 15వ సదస్సులో సహజ ప్రపంచ పునరుజ్జీవనానికి అంకితమైన టాప్ 10 ప్రపంచ పునరుద్ధరణ ఫ్లాగ్ షిప్ లలో ఒకటిగా నమామి గంగే ను ఐక్యరాజ్యసమితి గుర్తించడాన్ని శ్రీ కుమార్ ప్రస్తావించారు. ఈ ప్రశంస మన దేశానికి, గంగానది ప్రక్షాళన జాతీయ మిషన్ కు ఎంతో గర్వకారణమని శ్రీ కుమార్ పేర్కొన్నారు. గంగా ఉత్సవ్ 2023ను గంగా పరీవాహక ప్రాంతంలోని వివిధ జిల్లా గంగా కమిటీలు కూడా జరుపుకున్నాయని ఆయన తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో, నమామి గంగే గంగా సంబంధిత కార్యకలాపాలను వికేంద్రీకరించాలని ప్రతిపాదించిందని, జిల్లా గంగా కమిటీలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం గణనీయమైన విజయానికి సంకేతమని అన్నారు. గంగా ప్రహరీలు, జిల్లా ప్రాజెక్టు అధికారులు, గంగా దూత్ లు మొదలైన వాటి ద్వారా ప్రజలతో లోతైన అనుబంధాన్ని పెంపొందించడానికి, ప్రజల భాగస్వామ్యంలో సానుకూల చర్యలకు మార్గం సుగమం చేయడానికి ఈ సమావేశాలు ఎంతగానో దోహద పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కనీసం 5 లక్షల మంది పాల్గొన్నారని, నమామి గంగే మిషన్ కు అద్భుతమైన మద్దతును ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. "మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి సారించిన ఇంజనీరింగ్-ఆధారిత మిషన్ నుండి అర్థ్ గంగా మోడల్ వరకు మన ప్రయత్నాలు అభివృద్ధి చెందాయి, కమ్యూనిటీ భాగస్వామ్యం, విద్యా కార్యకలాపాలు , స్థానిక ప్రజలకు జీవనోపాధి కల్పనకు ప్రాధాన్యతనిచ్చాయి", అని ఆయన అన్నారు. ఈ నమూనా మార్పు అధిక ఇంజనీరింగ్-ఆధారిత కార్యక్రమం నుండి ఉపాధి కల్పన అవకాశాలతో ప్రజలతో నది అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమానికి మారడాన్ని సూచిస్తుంది.
గంగానది, దాని ఉపనదుల్లో గంగానది డాల్ఫిన్ ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గంగా నది కోసం ఎన్ఎంసిజిని శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థగా మార్చడానికి ఎన్ఎంసిజి అంతర్జాతీయ సంస్థలతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది. నదీతీరాల వెంబడి అంకితభావం కలిగిన మహిళా వాలంటీర్ల బృందం పోషించిన కీలక పాత్రను ప్రస్తావించిన ఆయన, స్వచ్ఛమైన గంగా సందేశాన్ని వ్యాప్తి చేయడంలో వారు ఎలా కీలక పాత్ర పోషించారో పేర్కొన్నారు. గంగా పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ఈ మహిళలు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించి, ఆర్థిక సుస్థిరతకు దోహద పడిన ఢిల్లీ హాత్-జలజ్ ప్రాజెక్టు గురించి శ్రీ కుమార్ వివరించారు. హిందాన్, కాళీ నది, యమునా నదులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రధానంగా గంగానది ఉపనదులపై దృష్టి పెట్టడానికి ఎన్ఎంసిజి కట్టుబడి ఉందని శ్రీ కుమార్ చెప్పారు. రివర్-సిటీస్ అలయన్స్ అనే వినూత్న కార్యక్రమంలో ఇటీవల సభ్య నగరాల విస్తరణను ఆయన ప్రస్తావించారు.

జ్యోతి ప్రజ్వలన, నమామి గంగే గీతంతో గంగా ఉత్సవ్ 2023 ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు పండిట్ అజయ్ ప్రసన్న వేణువు వాయిద్యం సభికులను ఆకట్టుకుంది. భరతాండే గ్రూప్ అందించిన మంత్రముగ్ధులను చేసే "యమునా పాట", రాగ్ నృత్య కళా మంచ్ డ్యాన్స్ ప్రదర్శించిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన సాంప్రదాయ జానపద నృత్యం, శ్రీ జీత్ పరమానిక్ పాడిన "నమామి గంగే" పాట సహా వరుస ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రజలు, నదుల మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంతో పాటు నదుల పునరుజ్జీవనంపై అవగాహన పెంచేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. గంగా ఉత్సవ్ 2023 సంగీతం, నృత్యం, జ్ఞానం, సంస్కృతి , సంభాషణల శక్తివంతమైన సమ్మేళనం. పండిట్ సిద్ధార్థ బెనర్జీ ఫ్యూజన్ సంగీతంతో గంగా ఉత్సవ్ 2023 ముగిసింది.

***
(Release ID: 1974920)