ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో కోఆపరేషన్ ఇన్ ఎన్ ఫోర్స్ మెంట్ మ్యాటర్స్ (జిసిసిఇఎమ్) పై మొదటి గ్లోబల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


చట్టాన్ని అమలు చేసే సంస్థల నెట్వర్కింగ్, భాగస్వామ్య ప్రయత్నం ద్వారా జిసిసిఇఎమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది: ఆర్థిక మంత్రి

ఎర్రచందనం సహా కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు నాలుగో దశ 'ఆపరేషన్ శేష'ను ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి

కృత్రిమ మేధస్సు యుగంలో ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం , అంతర్జాతీయ సంస్థల మధ్య సహకారాన్ని పెంచడం మరింత సముచితం: సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి

అన్ని దేశాల కస్టమ్స్ ఏజెన్సీల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవాలని డబ్ల్యూ సి ఒ సెక్రటరీ జనరల్ పిలుపు
పోటీతత్వాన్ని పెంచడం, కస్టమర్ కు ఖర్చును తగ్గించడం తో పాటు వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అమలు- వాణిజ్య సౌలభ్యం మధ్య సమతుల్యత ఉండాలి: రెవెన్యూ కార్యదర్శి

ఇప్పటికే ఉన్న భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించడానికి , కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే ఒక వేదికను జిసిసిఇఎమ్ సృష్టిస్తుంది: సిబిఐసి చైర్మన్

ప్రారంభ జిసిసిఇఎమ్ కు 40కి పైగా కస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లు/ఆర్గనైజేషన్ ల నుంచి 75 మందికి పైగా ప్రతినిధులు హాజరు

Posted On: 30 OCT 2023 5:27PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలో ఎన్ ఫోర్స్ మెంట్ వ్యవహారాల్లో సహకారం )పై మొదటి అంతర్జాతీయ సదస్సు (జిసిసిఇఎమ్) మూడురోజుల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి గౌరవ అతిథిగా, ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కునియో మికురియా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సి బి ఐ సి చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, బోర్డు సభ్యులు, డిపార్ట్ మెంట్ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు, దేశం లోని వివిధ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు/ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సకాలంలో ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం కోసం అంతర్జాతీయ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల మధ్య మరింత భాగస్వామ్యం సహకారం అవసరమని, ఈ దిశగా భారతదేశ జి 20 అధ్యక్ష సంవత్సరంలో సి బి ఐ సి, డీఆర్ఐ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని 2022 లో డిఆర్ఐ వ్యవస్థాపక దినోత్సవం ప్రారంభోత్సవంలో, కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన సూచన మేరకు జిసిసిఇఎమ్ రూపు దాల్చింది

ఈ నేపథ్యంలో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సి బి ఎస్ ఐ) పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి ఆర్ ఐ) బ్రస్సెల్స్ లోని వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ సి ఒ)తో సంప్రదింపులు జరిపి 2023 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు 'నెట్వర్క్ తో పోరాడటానికి నెట్వర్క్ కావాలి' అనే ఇతివృత్తం తో  ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తోంది. అంతర్దృష్టులు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం , భారతీయ కస్టమ్స్ భాగస్వామ్య అడ్మినిస్ట్రేషన్లతో సహకారాన్ని పెంపొందించడానికి , కొత్త భాగస్వామ్యాలను నిర్మించడానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం ఈ అంతర్జాతీయ సదస్సు లక్ష్యం. డబ్ల్యుసిఒ రీజనల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీసులు (ఆర్ఐఎల్ఓలు) , డబ్ల్యుసి ఒ సెక్రటేరియట్ నుండి సీనియర్ ప్రతినిధులతో సహా సభ్య పాలనా యంత్రాంగాలు, అంతర్జాతీయ సంస్థల విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి డబ్ల్యూసి ఒభారతీయ కస్టమ్స్ తో కలిసి పనిచేసింది.

అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు సి బి ఎస్ ఐ), డి ఆర్ ఐ లను అభినందిస్తూ, ఎన్ ఫోర్స్ మెంట్ వ్యవహారాల్లో సహకారంపై అంతర్జాతీయ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట అమలు సంస్థల నెట్ వర్కింగ్ , సహకార ప్రయత్నాల్లో ఒక పెద్ద ముందడుగు అని, ఇది అంతిమంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.

కస్టమ్స్ కు రెండు ముఖ్యమైన కోణాలు ఉన్నాయని, అవి సౌలభ్యం , అమలు అని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇవి కస్టమ్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల విధులలో ప్రధానమైనవిగా ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు అంకితభావంతో ఉండాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అక్రమ వాణిజ్యం, అంతర్జాతీయ సిండికేట్లకు అడ్డుకట్ట వేసేందుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో సమాచారం, కార్యాచరణ వివరాలను పంచుకోవాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దురాచారాలను అరికట్టడానికి ఏజెన్సీల అనుభవం దిశను, మార్గాన్ని చూపుతుంది.  

ఎర్రచందనం సహా కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి ఆర్ఐఎల్ఓ ఆసియా-పసిఫిక్, ఆర్ఐఎల్ఓ మిడిల్ ఈస్ట్ సహకారంతో భారతీయ కస్టమ్స్ చేపట్టిన 'ఆపరేషన్ శేష' నాలుగో దశను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించారు. ఇతర విలువైన వృక్ష, జంతుజాల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఎర్రచందనం అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థలు కూడా పురాతన వస్తువులను తమ దేశాలకు తీసుకురావడానికి సహకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవడంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ పాత్రను శ్రీమతి సీతారామన్ ప్రస్తావించారు. అక్రమ వాణిజ్యం ముప్పును ఎదుర్కోవటానికి వివిధ దేశాలలో మరింత శాసన , విధానపరమైన మెరుగుదలల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి తన ప్రసంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంతో సహా సాంకేతిక పరిజ్ఞానంలో వేగవంతమైన, కొత్త అభివృద్ధి సవాళ్లను ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఏజెన్సీల మధ్య సహకారాన్ని పెంచడం మరింత సముచితమని శ్రీ చౌదరి చెప్పారు.

డబ్ల్యూ సి ఒ సెక్రటరీ జనరల్ కునియో మికురియా ప్రసంగిస్తూ, అన్ని దేశాల కస్టమ్స్ ఏజెన్సీల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవలసిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, అంతేకాకుండా మార్గదర్శకత్వం ద్వారా విజ్ఞానాన్ని తదుపరి తరాలకు బదిలీ చేయ వలసిన అవసరాన్ని కూడా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా భారత ప్రభుత్వ రెవెన్యూ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా తన ప్రసంగంలో,  స్మగ్లింగ్ వల్ల ఆర్థిక ప్రభావాలను , దాని సామాజిక , జాతీయ భద్రతా ప్రభావాలను వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక డిజిటల్ ప్రపంచం జాతీయ రాష్ట్రాల సరిహద్దులను మసకబార్చిందని, ప్రపంచవ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు కఠినమైన సవాలును సృష్టించిందని శ్రీ మల్హోత్రా పేర్కొన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి , కస్టమర్ కు ఖర్చును తగ్గించడానికి ముఖ్యమైన ఎన్ ఫోర్స్ మెంట్ , ట్రేడ్ ఫెసిలిటేషన్ మధ్య సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరాన్ని శ్రీ మల్హోత్రా నొక్కి చెప్పారు.

అంతర్జాతీయ సదస్సులో సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ తన ప్రసంగంలో, నిరంతరం మారుతున్న విలక్షణ  అంతర్జాతీయ భూభాగంలో స్మగ్లింగ్ , అంతర్జాతీయ నేరాల బెడద మధ్య పరస్పర సంబంధాలను వివరించారు. ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా, ఇప్పటికే ఉన్న భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించడానికి , కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే ఒక వేదికను సృష్టించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు శ్రీ అగర్వాల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసిన అతిథులు, ప్రతినిధులతో పాటు సి బి ఐ సి  అధికారులు, సిబ్బందికి డీఆర్ఐ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

      

సెక్రటరీ జనరల్-డబ్ల్యుసిఒ, సెక్రటరీ జనరల్-సిఐటిఇఎస్ , ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలతో సహా 40 కి పైగా కస్టమ్ అడ్మినిస్ట్రేషన్లు / సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 75 మందికి పైగా ప్రతినిధులు ప్రారంభ జిసిసిఇఎమ్ లో పాల్గొన్నారు. వీటితో పాటు స్మగ్లింగ్, వాణిజ్య మోసాలపై మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్ లోని వివిధ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.

 ****


(Release ID: 1973246) Visitor Counter : 94