రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రత్యేక స్వచ్ఛతా ప్రచారం 3.0లో భాగంగా సౌ త్ బ్లాక్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి) సెక్రెటేరియేట్ పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేసిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
మెరుగైన ఉత్పాదకత కోసం పని ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవలసిందిగా సిబ్బందికి సూచన
Posted On:
26 OCT 2023 12:42PM by PIB Hyderabad
స్వచ్ఛతను రోజువారీ అలవాటుగా చేసేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషిలో భాగంగా, అక్టోబర్ 26, 2023న న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి) సెక్రెటేరియేట్ పారిశుద్ధ్యాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తనిఖీ చేశారు. పని ప్రదేశంలో అత్యంత పారిశుభ్రతను నిర్వహించేందుకు ప్రతివారం వ్యక్తిగతంగా కొన్ని గంటల శ్రమదానం చేయవలసిందిగా ఉద్యోగులతో ముచ్చటిస్తూ రక్షణ మంత్రి ఉద్బోధించారు. పరిశుభ్రంగా, అస్తవ్యస్తంగా లేని పని ప్రదేశం మెరుగైన ఉత్పాదకతకు దారి తీస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఎంఒడిలో స్వచ్ఛతా అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించడంలో అవిశ్రాంతంగా పని చేసి ప్రముఖ పాత్ర పోషించిన స్వచ్ఛత వీరులను ఆయన సత్కరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా అభియాన్‌కు సమాంతరంగా ప్రత్యేక ప్రచారం నాలుగవ, చివరి వారంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఉంది. అందుబాటులో ఉన్న వనరులను లాభదాయకంగా ఉపయోగించుకుంటూ, తుక్కును అమ్మడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలన్నది ఈ ప్రచారం విస్త్రత లక్ష్యం. సౌత్ బ్లాకులో ఫర్నిచర్‌కు సంబంధించిన తుక్కుతో పాటుగా, ఫోటోకాపీ మెషీన్లు సహా కాలం చెల్లిపోయిన & పని చేయని ఐటి పరికరాల నుంచి మంత్రిత్వ శాఖ రూ. 5.34 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే, పనికిరావని పక్కన పెట్టిన వాహనాల వేలం ద్వారా రూ. 55 కోట్లను ఆర్జించింది.
పారిశుద్ధ్యత స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ప్రచారం 3.0 సందర్భంగా ఉపయోగించని ఒక గదిలోని చెత్తను తీసివేసి, మహిళా సిబ్బంది తమకు తీరిక లభించినప్పుడు రిఫ్రెష్ అయ్యేందుకు దానిని లేడీస్ రూంగా పరివర్తన చేశారు. సౌత్ బ్లాక్‌లోని రెండవ అంతస్తులో గల ఈ గదిని రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ చర్యను సానుకూలమైనదానిగా, ఇతరులు అనుకరించదగినదిగా అభివర్ణిస్తూ మహిళా సిబ్బంది ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో డిపార్ట్‌మెంట్ కాంటీన్‌గా ఉండి, ప్రస్తుతం పని చేయకుండా చెత్తను నింపుతున్న గ్రౌండ్ ఫ్లోర్‌లోని చోటును శ్రీ రాజనాథ్ సింగ్ పరిశీలించారు. ఆ చోటులో వేసిన చెత్తను ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ప్రచారం 3.0 తొలగించి, పునర్నిర్మిస్తున్నారు.
(Release ID: 1971774)
Visitor Counter : 59