ప్రధాన మంత్రి కార్యాలయం

ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


“ఒలింపిక్స్కు ఆతిథ్యంపై భారత్ ఉవ్విళ్లూరుతోంది.. ఏదేమైనా
2036లో విజయవంతంగా ఒలింపిక్స్ నిర్వహణకు అవిరళ
కృషి చేస్తాం.. ఇది 140 కోట్ల మంది భారతీయుల స్వప్నం”;

“అలాగే 2029 యువ ఒలింపిక్స్ నిర్వహణపైనా భారత్ ఆసక్తితో ఉంది”;

“క్రీడలంటే భారతీయులకు ప్రాణం మాత్రమే కాదు… మాకు అదే జీవితం”;

“భారత క్రీడా వారసత్వం యావత్ ప్రపంచానికీ చెందుతుంది”;
క్రీడల్లో పరాజితులు ఉండరు; అందరూ విజేతలు.. అనుభవజ్ఞులే”;

“భారత క్రీడా రంగంలో వైవిధ్యం.. సార్వజనీనతపైనే మేం దృష్టి సారించాం”;

“ఒలింపిక్స్లో క్రికెట్కు స్థానంపై ‘ఐఒసి’ బోర్డు సిఫారసు..
త్వరలోనే శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాం”

Posted On: 14 OCT 2023 9:09PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్‌ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.

   భారతీయ సంస్కృతి-జీవనశైలిలో క్రీడలు ఓ కీలక భాగమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. దేశంలో మీరు ఏ గ్రామానికి వెళ్లినా క్రీడా సంబరం లేని పండుగలు-పబ్బాలు ఉండనే ఉండవన్నారు. ఉత్సవం ఎక్కడైనా, పండుగ ఏదైనా ఆటలపోటీలు లేకపోతే అది అసంపూర్ణమేనని స్పష్టం చేశారు. “భారతీయులమైన మేము క్రీడా ప్రియులు మాత్రమే కాదు… క్రీడలే మా జీవితం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వేల ఏళ్లనాటి భారతదేశ చరిత్ర క్రీడా సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆయన గుర్తుచేశారు. సింధు లోయ నాగరికత అయినా, వేద కాలమైనా, ఆ తదుపరి యుగాల్లోనైనా భారత క్రీడా వారసత్వం ఎంతో సుసంపన్నమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

   వేల ఏళ్లకిందటి గ్రంథాలలో గుర్రపు స్వారీ, ఈత, విలువిద్య, కుస్తీ వగైరా క్రీడలుసహా 64 కళల్లో ప్రావీణ్యంగల క్రీడాకారులు, కళాకారులు ఉండేవారని తెలిపారు. ఆయా  కళల్లలో రాణించేందుకు నాటి ప్రజలు ఎంతో ఆసక్తి కనబరిచేవారని చెప్పారు. ముఖ్యంగా విలువిద్యపై ప్రామాణిక గ్రంథం ‘ధనుర్వేద సంహిత’ ఉండేదని తెలిపారు. దీని ప్రకారం.. ధనుర్విద్యను అభ్యసించాలంటే ధనుస్సు, చక్రం, బల్లెం, కరవాలం, బాకు, గద, కుస్తీ విభాగాల్లోనూ నైపుణ్యం సాధించాల్సి ఉండేదని పేర్కొన్నారు. భారత ప్రాచీన క్రీడా వారసత్వ సంబంధిత శాస్త్రీయ ఆధారాలను ప్రధాని వివరించారు. ఈ మేరకు ధోలవీర యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గురించి ప్రస్తావించారు. ఈ 5000 ఏళ్లనాటి ప్రాచీన నగర ప్రణాళికలో భాగమైన క్రీడా మౌలిక సదుపాయాల గురించి వివరించారు. ఇక్కడ తవ్వకాలు నిర్వహించినపుడు రెండు ఆట మైదానాలు బయల్పడ్డాయని, వీటిలో ఒకటి ఆనాడు ప్రపంచంలోనే అత్యంత పురాతన, భారీ మైదానమని ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా రాఖీగఢీలో క్రీడల సంబంధితి నిర్మాణాలు కనుగొనబడ్డాయని తెలిపారు. “ఈ ప్రాచీన భారత క్రీడా వారసత్వం యావత్‌ ప్రపంచానికీ చెందినది” అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

   క్రీడల్లో పరాజితులంటూ ఎవరూ ఉండరని, విజేతలు.. అనుభవాలు పొందేవారు మాత్రమే ఉంటారని ప్రధాని మోదీ అన్నారు. క్రీడా భాష, స్ఫూర్తి విశ్వవ్యాప్తమని ఆయన స్పష్టం చేశారు. క్రీడలంటే కేవలం పోటీలు కాదని, మానవాళి విస్తృతికి అవకాశాలని చెప్పారు. “అందుకే క్రీడా రికార్డులను ప్రపంచ స్థాయిలో అంచనా వేస్తారని గుర్తుచేశారు. “వసుధైవ కుటుంబకం- అంటే… ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తిని కూడా క్రీడలు బలోపేతం చేస్తాయి” అన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధికి ఇటీవల చేపట్టిన చర్యలను కూడా ప్రధాని ఏకరవు పెట్టారు. ఈ మేరకు క్రీడా భారతం (ఖేలో ఇండియా) కింద ఆటల పోటీలు, యువజన క్రీడలు, శీతాకాల క్రీడలు, పార్లమెంటు సభ్యుల క్రీడా పోటీలుసహా త్వరలో నిర్వహించబోయే దివ్యాంగుల క్రీడల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “భారత్‌లో క్రీడలలో సార్వజనీనత, వైవిధ్యంపై మేం దృష్టి సారించాం” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

   ప్ర‌పంచం క్రీడా రంగంలో భార‌త క్రీడాకారులు ప్రతిభా ప్రదర్శన వెనుక ప్రభుత్వ అవిరళ కృషి కూడా ఉందని ప్ర‌ధానమంత్రి అన్నారు. గత సంవత్సరం ఒలింపిక్స్‌లోనూ చాలామంది భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనను ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే ఇటీవల ముగిసిన ఆసియా క్రీడలలో భారత క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించారని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలలో భారత యువ క్రీడాకారులు సృష్టించిన కొత్త రికార్డులను ప్రముఖంగా ప్రస్తావించారు. భారత క్రీడారంగం వేగంగా పరివర్తన చెందుతుండటానికి ఈ సానుకూల మార్పులన్నీ సంకేతాలని ఆయన నొక్కి చెప్పారు.

   అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో భారత్‌ తన సామర్థ్యాన్ని విజయవంతంగా నిరూపించుకుందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు 186 దేశాలు పాల్గొన్న చెస్ ఒలింపియాడ్, అండర్-17 ఫుట్‌బాల్, మహిళల ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్, షూటింగ్ ప్రపంచకప్‌ పోటీలుసహా ప్రస్తుతం నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచకప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్‌లను ఆయన ప్రస్తావించారు. ఇక భారత్‌ ఏటా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌ (ఐపీఎల్‌)ను నిర్వహిస్తుండటాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ‘ఐఒసి’ కార్యానిర్వాహక బోర్డు సిఫారసు చేసిందని, దీనికి త్వరలోనే ఆమోదం లభించగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.

   ప్రపంచాన్ని స్వాగతించడంలో అంతర్జాతీయ క్రీడల నిర్వహణ భారతదేశానికి ఒక అవకాశమని ప్రధాని పేర్కొన్నారు. శరవేగంగా పురోగమిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ, విస్తృతంగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని చాటుతున్నాయని పునరుద్ఘాటించారు. దేశంలోని 60కిపైగా నగరాల్లో జి-20 సదస్సు సంబంధిత సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ప్రతి రంగంలో భారత నిర్వహణ సామర్థ్యానికి ఇవన్నీ నిదర్శనాలని పేర్కొన్నారు. ఇది 140 కోట్ల మంది భారత పౌరుల విశ్వాసానికి ప్రతీక అని ప్రధాని సగర్వంగా ప్రకటించారు.

   “ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు 2036నాటి ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించే అవకాశం దక్కించుకునే దిశగా అవిరళ కృషి చేస్తుంది. ఇది 140 కోట్ల మంది భారతీయుల స్వప్నం” అని ప్రధానమంత్రి అన్నారు. క్రీడారంగ భాగస్వాములందరి మద్దతుతో దేశం ఈ కలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే  “యువజన ఒలింపిక్స్‌-2029కి ఆతిథ్యం ఇవ్వడంపైనా భారత్‌ ఆసక్తి చూపుతోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానిస్తూ, ఈ విషయంలో ‘ఐఒసి’ మద్దతివ్వగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమేగాక హృదయాలను గెలుచుకునే మాధ్యమం అని ప్రధానమంత్రి అన్నారు. క్రీడలు అందరి సొంతం… ఈ రంగం విజేతలను రూపుదిద్దడమే కాకుండా శాంతి, ప్రగతి, ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేగల సమర్థ మాధ్యమం క్రీడలు. ఈ నేపథ్యంలో ప్రతినిధులను మరోసారి స్వాగతిస్తూ సమావేశం ప్రారంభమైనట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాష్‌, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు శ్రీమతి నీతా అంబానీ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ఈ ‘ఐఒసి’ సమావేశం కమిటీ సభ్యులందరికీ ఎంతో కీలకమైనది. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాగా, దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్ రెండోసారి ‘ఐఒసి’ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇంతకుముందు న్యూఢిల్లీలో కమిటీ 86వ సమావేశం 1983లో నిర్వహించబడింది. క్రీడా రంగంలో ప్రపంచ సహకార విస్తృతి, క్రీడా నైపుణ్యానికి గుర్తింపుతోపాటు స్నేహం, గౌరవం, శ్రేష్ఠత సంబంధిత ఒలింపిక్ ఆదర్శాల వ్యాప్తిలో మనకుగల అంకితభావాన్ని ఈ 141వ ‘ఐఒసి’

సమావేశం ప్రతిబింబిస్తుది. ఇది వివిధ క్రీడారంగ భాగస్వాముల మధ్య పరస్పర సహకారం, అనుభవాల ఆదానప్రదానానికి అవకాశమిస్తుంది.

   అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మిస్టర్ థామస్ బాష్‌, ఇతర సభ్యులు, భారత్‌లోని క్రీడా ప్రముఖులు, భారత ఒలింపిక్ అసోసియేషన్‌ (ఐఒఎ)సహా వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.



(Release ID: 1967824) Visitor Counter : 90