రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ వైమానిక దళానికి రెండు సీట్ల ఎల్‌సిఎ తేజస్‌ను అందించిన రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్
రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా దేశ ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్న ఎల్‌సిఎ తేజస్ః రక్షణశాఖ సహాయ మంత్రి
Posted On:
04 OCT 2023 4:31PM by PIB Hyderabad
రక్షణ ఉత్పత్తిలో స్వాలంబన దిశగా భారత్ పయనానికి ప్రతీకగా ఎల్‌సిఎ తేజస్ నిలుస్తుందని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ పేర్కొన్నారు. దేశం విదేశీ విమానాలపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న నిబద్ధతకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా ఉండటమే కాక స్వావలంబిత భారతదేశానికి కరదీపికగా ఈ కార్యక్రమం నిలుస్తోందన్నారు. బెంగళూరులో 04 అక్టోబర్ 2023న భారత వైమానిక దళానికి రెండు సీట్లు కలిగిన ఎల్‌సిఎ తేజస్‌ను అందచేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఎల్‌సిఎ తేజస్ కార్యక్రమం తిరుగులేని నిబద్ధత, ఆవిష్కరణల స్ఫూర్తినిచ్చే విజయగాథ అని రక్షణ శాఖ సహాయమంత్రి పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో ప్రపంచస్థాయి దేశీయ యుద్ధవిమానాన్ని సమకూర్చాలన్న స్వప్నంలో ఎల్‌సిఎ తేజస్ విమానం పాదుకుని ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచీ తాహతుకు మించిన ప్రయత్నమని చాలామంది భావించారని, కానీ ఈ కార్యక్రమానికి దోహదం చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ) డిఆర్‌డిఒ ల్యాబ్స్, సిఇఎంఐఎల్ఎసి, డిజిఎక్యూఎ, పిఎస్‌యులు, ఐఎఎఫ్ సహా లెక్కలేనన్ని ఇతర సంస్థలు, వ్యక్తులు దేశ ప్రయోజనాలు మొదట వస్తే ఏదీ అసాధ్యం కాదని రుజువు చేస్తూ, ఈ ముఖ్యమైన కారణాన్ని పూర్తి చేసేందుకు ఈ సంస్థలు కలిసి వచ్చాయని అన్నారు.
ఎల్‌సిఎ తేజస్ కార్యక్రమ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, దేశం అత్యాధునిక యుద్ధ విమానాలను నిర్మించడంలో అవసరమైన పరిజ్ఞానాన్ని పొందిందని, ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి, పెంపొందించిందని రక్షణ శాఖ సహాయమంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో ఏరోస్పేస్ పరిశ్రమ, బలమైన రక్షణ పరిశ్రమ వృద్ధిని ఎల్‌సిఎ తేజస్ అభివృద్ధి పెంపొందించిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వివిధ అంశాలకు సహకరించిన లెక్కలేనన్ని చిన్న, మధ్య తరహా సంస్థలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇది అవకాశాలను సృష్టించిందని పేర్కొన్నారు.
హెచ్ ఎఎల్ ఉత్పత్తి చేసిన రెండు సీట్ల ఎల్‌సిఎ తేజస్ తొలి శ్రేణి అత్యాధునిక సాంకేతికత, చురుకుదనం, బహుముఖ ప్రజ్ఞతో కూడినది. ఇది ఐఎఎఫ్ పైలట్లకు తగిన శిక్షణను అందిస్తుందన్నారు. ఇప్పటికే ఐఎఎఫ్ 83 ఎల్‌సిఎల కోసం హెచ్ఎఎల్‌కు ఆర్డర్ ఇచ్చింది.
ఎయిర్‌స్టాఫ్ అధిపతి ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి, హెచ్ఎఎల్ సిఎండి శ్రీ అనంతకృష్ణన్‌జీ, ఎడిఎ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరీష్ ఎస్ దేవ్‌ధరే, సిఇఎంఐఎల్ఎసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ఎపివిఎస్ ప్రసాద్, ఎయిర్ స్టాఫ్ (డిసిఎఎస్) డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
****
(Release ID: 1964386)
Visitor Counter : 110