జల శక్తి మంత్రిత్వ శాఖ

బీహార్-జార్ఖండ్ పరిధిలోని నార్త్ కోయెల్ రిజర్వాయర్ ప్రాజెక్టులో మిగిలిన పనులపై అంచనా వ్యయం సవరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 04 OCT 2023 4:03PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) ఇవాళ నార్త్ కోయెల్ జలాశయ ప్రాజెక్టులో మిగిలిన పనుల పూర్తిపై అంచనా వ్యయం సవరణకు ఆమోదించింది. ఈ మేరకు 2017 ఆగస్టులో పనుల అంచనా వ్యయం రూ.1,622.27 కోట్లు (కేంద్ర వాటా: రూ.1,378.60 కోట్లు)కాగా, కేంద్ర జలవనరులు-నదుల అభివృద్ధి-గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖలు దీన్ని రూ.2,430.76 కోట్ల (కేంద్ర వాటా: రూ.1,836.41 కోట్లు)కు పెంచి సవరణ ప్రతిపాదనలు పంపగా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తయితే బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 కరవు పీడిత జిల్లాల్లో ఏటా అదనంగా 42,301 హెక్టార్లకు సాగునీరు అందుతుంది.

   రెండు రాష్ట్రాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించే నార్త్ కోయెల్ జలాశయం ఒక ప్రధాన అంతర్రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు. దీనికి సంబంధించి కుత్కు గ్రామం (జార్ఖండ్‌లోని లాతేహరి జిల్లా) సమీపాన కోయెల్ నదిపై ఉత్తరాన ఒక ఆనకట్ట ఉంది. ఈ ఆనకట్టకు 96 కిలోమీటర్ల దిగువన (పాలము జిల్లా మొహమ్మద్‌గంజ్ వద్ద) ఒక బ్యారేజీ నిర్మించబడింది. ఈ బ్యారేజీ నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలు ఆయకట్టుకు సాగునీరు అందిస్తాయి. కాగా, ఆనాటి బీహార్‌ ప్రభుత్వం 1972లో తమ సొంత వనరులతో ప్రధాన ఆనకట్ట నిర్మాణం, దాని అనుబంధ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే, అప్పటి నుంచి నత్తనడకన సాగిన పనులు 1993లో రాష్ట్ర అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయాయి. జలాశయం నిండినపుడు బెత్లా జాతీయ పార్కు, పాలములోని పులుల అభయారణ్యం ముంపు బారినపడే ముప్పు ఉందన్న ఆందోళనే ఇందుకు కారణం.

   ప్రాజెక్టు పనులు అక్కడితో స్తంభించిపోయాక  20 ుంఏటా 71,720 హెక్టార్లకు మాత్రమే సాగునీరు అందుతూండేది. అటుపైన 2000 సంవత్సరంలో బీహార్‌ విభజన ద్వారా జార్ఖండ్‌ ఏర్పడినప్పుడు జలాశయం ప్రధాన పనులు కొత్త రాష్ట్రం పరిధిలోకి వెళ్లిపోయాయి. అంతేకాకుండా 11.89 కిలోమీటర్ల పొడవైన ఎడమ ప్రధాన కాలువ, 110.44 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువలో 31.40 కిలోమీటర్ల మేర జార్ఖండ్‌లోనే ఉండిపోయింది. అనంతరం నార్త్‌ కోయెల్‌ జలాశయం నిర్మాణ లబ్ధిని ప్రజలకు అందించాలని 2016లో కేంద్ర ప్రభుత్వం  సంకల్పించింది. తదనుగుణంగా పాలము పులుల అభయారణ్యానికి ముంపు ముప్పు లేకుండా ఆనకట్ట ఎత్తు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా మిగిలిన పనుల పూర్తికి అధికారులు రూ.1,622.27 కోట్లతో అంచనాలు రూపొందించగా 2017 ఆగస్టులో కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

   నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు మరికొన్ని అదనపు పనుల అవసరాన్ని గుర్తించి, వాటిని కూడా అందులో చేర్చింది. ఈ మేరకు కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో నిర్దేశిత నీటిపారుదల సామర్థ్యం దిశగా సాంకేతికపరమైన లైనింగ్‌ అవసరాన్ని కూడా అధికారులు గుర్తించారు. అలాగే గయ పంపిణీ వ్యవస్థ, రెండు కాలువల లైనింగ్ సహా  మార్గమధ్యంలో పునర్నిర్మాణం, కొన్ని కొత్త నిర్మాణాలు, ప్రభావిత కుటుంబాల కోసం సహాయ-పునరావాస ప్రత్యేక ప్యాకేజీ తదితరాలతో వ్యయ అంచనాలను నవీకరించారు. దీని ప్రకారం.. మిగిలిన పనుల పూర్తికి రూ.2430.76 కోట్లు అవసరమని, ఇందులో కేంద్రం తన వాటాగా రూ.1836.41 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుందని అంచనాలు రూపొందించగా మంత్రిమండలి ఇవాళ ఆమోదముద్ర వేసింది.

 

******



(Release ID: 1964211) Visitor Counter : 95