జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘స్వచ్ఛ హై సేవ’’ : 52 దేవాలయ తటాకాలను పునరుజ్జీవింపచేసిన కర్ణాటక

Posted On: 30 SEP 2023 3:26PM by PIB Hyderabad

‘‘స్వచ్ఛత హే సేవ’’ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం స్వచ్ఛత పేరిట ‘‘ప్రజా ఉద్యమం’’ జరుగుతోంది. ‘‘స్వచ్ఛ భారత్’’ లక్ష్యంతో వివిధ రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రజలందరూ తమ ప్రత్యేక శైలిలో ఇందుకు కృషి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రత్యేకమైనది కర్ణాటక ప్రజలు చేపట్టిన దేవాలయ తటాకాల పునరుద్ధరణ. ‘‘కల్యాణి’’ పేరిట ఉన్న తటాకాలను పెద్ద ఎత్తున పునరుజ్జీవింపచేయడంలో ప్రజలు తమ కాలం, కృషి వ్యయం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘‘స్వచ్ఛత హే సేవ’’ కార్యక్రమం కింద కర్ణాటకలోని నాలుగు జిల్లాల్లో 52 పైగా ‘‘కల్యాణి’’లను ప్రజలు శుద్ధి చేసి పునరుజ్జీవింపచేశారు. వేలాది మంది ప్రజలు శ్రమదానంతో ఇది సాధించడమే కాకుండా భవిష్యత్ తరాలకు దేవాలయ తటాకాల శుభ్రత, సంరక్షణపై చైతన్యం వ్యాపింపచేశారు.

రామ్  నగర్, గడగ్, మాండ్య, కోలార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగించకుండా వదిలి వేసిన కల్యాణిలకు శుద్ధి చేసి పునరుజ్జీవింపచేశారు. ఈ కల్యాణిలన్నీ పురాతన, చారిత్రక ప్రాధాన్యం గలవి కావడంతో పాటు ఆధారనీయమైన జల వనరులుగా ఉన్నాయి.

కర్ణాటకలోని మెట్ల బావులు పురాతన కాలం నాటి అవశేషాలు మాత్రమే కాదు, కర్ణాటకకు చెందిన  బహుముఖీన చరిత్ర, సంస్కృతి, వారసత్వ చిహ్నాలు. నేటి  సమకాలీన నీటి నిర్వహణ  సవాళ్లను పరిష్కరించగల  సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ బావులన్నీ ఎంతో విలువైన జలవనరులు.  ఈ మెట్ల బావుల  ప్రాధాన్యాన్ని ఈ దిగువ కోణాల్లో చూడవచ్చు.

1.     నీటి నిల్వ, నిర్వహణ : కర్ణాటకలోని  మెట్టప్రాంతాల్లో నీటి నిల్వ, జలవనరుల నిర్వహణలో ఈ మెట్ల బావులు అత్యంత కీలకంగా ఉన్నాయి. వేసవిలో నీటిని నిల్వ చేసుకునేందుకు, తద్వారా మంచినీరు, పంటలు, రోజువారీ అవసరాలకు నీరందించే విశ్వసనీయమైన వనరులుగా ఉన్నాయి.

మాణికేశ్వర దేవాలయం సమీపంలోని లక్కుండిలోని మెట్ల బావిని ముసుకినాగా పిలుస్తారు. భూగర్భ జల వనరుల నిరన్వహణ కోసం మెట్ల బావులు నిర్మించారు. తీవ్రమైన వేసవిలో నీటికి ఆధారనీయమైన వనరు ఇవే. ఏడాది పొడవునా భూగర్భ జలవనరులు అందుబాటులో ఉండేలా చూసేందుకు బిల్డర్లు లోతైన కందకాలు తవ్వి ప్రజలు కిందికి దిగేందుకు వీలుగా మెట్లు నిర్మించారు.

2.     నిర్మాణ వారసత్వం : అనేక మెట్ల బావులు ప్రత్యేకించి గడగ్  జిల్లాలోని లక్కుండి కల్యాణిలు చాళుక్యుల నిర్మాణ శైలికి చిహ్నంగా నిలుస్తున్నాయి. ఇవి నిర్మాణ అద్భుతాలుగా పేరొందాయి. ప్రాచీన కాలం నాటి బిల్డర్ల పనితనానికి, చాతుర్యానికి దర్పణం పడుతున్నాయి. వాటిపై అద్భుతమైన చెక్కడాలు కనిపించడంతో పాటు అవి స్తంభాలతో ఉండి దేనికదే ప్రత్యేక డిజైన్  తో అలరిస్తాయి. సంస్కృతి, నిర్మాణ  వారసత్వ  సంపదలుగా విలసిల్లుతున్నాయి.

3.     సాంస్కృతిక ప్రాధాన్యత : ఈ మెట్ల బావులు కేవలం వినియోగ నిర్మాణాలే కాదు; అవి సమాజంలోని ప్రజల సమావేశ స్థలాలుగా కూడా నిలుస్తాయి. స్థానిక ప్రజల గుర్తింపును చాటుతూ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలుగా  కూడా ఉన్నాయి. ఉదాహరణకి రామనగర జిల్లాలోని గ్రామ భైరవేశ్వర దేవాలయం సమీపంలోని కల్యాణి కంపెగౌడ కాలంలో నిర్మించినది.

4.     చారిత్రక ప్రాధాన్యం : ఈ మెట్ల బావులపై సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలను చాటి చెప్పే చారిత్రక శాసనాలు, చెక్కడాలు  కూడా ఉన్నాయి. చరిత్ర డాక్యుమెంటేషన్  కు ఇవి ఎంతో విలువైన వనరులు.

5.     ఆధ్యాత్మిక ప్రాధాన్యత : కొన్ని మెట్ల బావులు మత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా కలిగి ఉన్నాయి. అలాంటివి దేవాలయ సమీపంలో ఉండడం లేదా ధ్యానం, ఆత్మ చైతన్యం పొందేదుకు అనుకూలమైన ప్రదేశాలుగా గాని ఉన్నాయి.

6.     పర్యాటకం, విద్య : మెట్ల బావులు పర్యాటకులు, పరిశోధకులను ఆకర్షిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు మంచి వనరులు అందిస్తున్నాయి. సాంప్రదాయిక జల వనరుల నిర్వహణ వ్యవస్థలపై చైతన్యం కలిగిస్తున్నాయి.

7.     పర్యావరణం, సంరక్షణ : నేటి కాలమాన పరిస్థితుల్లో జలవనరుల సంరక్షణకు, భూగర్భ జల వనరుల పరిరక్షణకు కూడా మెట్ల బావుల పునరుజ్జీవం, నిర్వహణ అత్యంత కీలకం. 


(Release ID: 1963957) Visitor Counter : 70