పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ముడి చమురు మార్కెట్లలో వ్యవహారికత, సమతుల్యత పెరగాలని, కొనగలిగే స్థాయిలో ధరలు ఉండాలని ఒపెక్‌కు సూచించిన భారత పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పురి
Posted On:
03 OCT 2023 9:33PM by PIB Hyderabad
భారత పెట్రోలియం & సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పురి, ఒపెక్ సెక్రటరీ జనరల్‌తో సమావేశమయ్యారు. ఒపెక్ ముడి ఉత్పత్తి కోతలు, ప్రపంచ ఇంధన రంగంపై వాటి ప్రభావం గురించి ప్రస్తావించారు.
ఒపెక్ & ఒపెక్+ కలిసి, 2022 నుంచి మార్కెట్‌లో చమురు లభ్యతను రోజుకు 4.96 మిలియన్ బ్యారెళ్లు (ప్రపంచ చమురు డిమాండ్‌లో దాదాపు 5%) తగ్గించాయి. బ్రెంట్ ముడి చమురు ధరలను ఈ ఏడాది జూన్‌లోని బ్యారెల్‌కు దాదాపు $72 నుంచి సెప్టెంబర్ నాటికి $97కు పెంచాయి.
అబుదాబి ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎగ్జిబిషన్ & కాన్ఫరెన్స్ 2023 సందర్భంగా, 3 అక్టోబర్ 2023న, ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతం అల్-గైస్‌తో మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఒపెక్, ఒపెక్+ దేశాలు ఆగస్టు 2022 నుంచి చేపట్టిన ఉత్పత్తి కోతల కారణంగా మొత్తం ప్రపంచ చమురు లభ్యతలో దాదాపు 5% మార్కెట్ నుంచి తగ్గింది, గత 3 నెలల్లో ముడి చమురు ధర 34% పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తిలో కోతలు విధించారని మంత్రి అన్నారు. పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధరలు చమురు-దిగుమతి దేశాల ఆర్థిక సామర్థ్యాలపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వం జోక్యం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన ధరల పెరుగుదల భారం పడలేదన్నారు. గత 18 నెలల కాలంలో సుమారు 10 కోట్ల మంది ప్రజలు స్వచ్ఛమైన ఇంధనాలకు దూరమయ్యారు, బొగ్గు & కట్టెలను వినియోగిస్తున్నారన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 నాటి ఆర్థిక సంక్షోభాన్ని మళ్లీ చూడాల్సివస్తుందని మంత్రి అన్నారు. బ్రెంట్ ధరలు జనవరి 2008లో బ్యారెల్‌కు దాదాపు $93.60 నుంచి జులై 2008లో దాదాపు $134.3కు పెరిగాయి. ఇది ప్రపంచ ఆర్థిక మాంద్యంలో వేగాన్ని పెంచింది. చివరికి డిమాండ్ భారీగా తగ్గి, చమురు ధరలు పతనమయ్యాయని గుర్తు చేశారు.
ముడి చమురు దిగుమతి దేశాల చెల్లింపు సామర్థ్యాన్ని మించి చమురు ధరలు పెరగకుండా చూడడానికి ప్రపంచ ఇంధన మార్కెట్లను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని ఒపెక్‌ను శ్రీ హర్దీప్ ఎస్ పురి కోరారు. ముడి చమురు మార్కెట్లలో వ్యవహారికత, సమతుల్యత పెరగాలని, కొనగలిగే స్థాయిలో ధరలను ఉంచేలా చూడాలని సెక్రటరీ జనరల్‌ను భారత మంత్రి కోరారు.
***
(Release ID: 1963929)
Visitor Counter : 93