రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి నాయకత్వంలో, స్వచ్ఛ భారత్ మిషన్ దేశంలో ఒక పరిశుభ్రత ఉద్యమంలా మారిందన్న చెప్పిన శ్రీ నితిన్ గడ్కరీ
రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు దాని ఆధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌ఐడీసీఎల్, ఐఏహెచ్‌ఈ కూడా 'స్వచ్ఛత హి సేవ' ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి
Posted On:
01 OCT 2023 9:05PM by PIB Hyderabad
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నాయకత్వంలో, స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభమైన నాటి నుంచి దేశంలో పరిశుభ్రతను పెంచే ఒక ప్రజా ఉద్యమంగా మారిందని కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు పేర్కొన్నారు.
రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు దాని అధ్వర్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌ఐడీసీఎల్, ఐఏహెచ్‌ఈ కూడా 'స్వచ్ఛత హి సేవ' ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి. స్వచ్ఛతను పాటించాలన్న మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తూ, పరిశుభ్రత & సమాజ భాగస్వామ్య ప్రాముఖ్యతను స్పష్టం చేశాయి. పరిశుభ్రత కార్యకలాపాల కోసం సమాజంతో కలిసి శ్రమదానం కోసం ఒక గంట సమయం కేటాయించాలని చెబుతూ, ఇటీవలి 'మన్ కీ బాత్'లో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్" పిలుపు ఇచ్చారు.
రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ సమీపంలోని టోల్ ప్లాజాలో పరిశుభ్రత కార్యక్రమంలో ‘శ్రమదానం’ చేశారు. కార్యాలయాలు, ఇతర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. శ్రీ అనురాగ్ జైన్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ అధికార్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కమలేష్ చతుర్వేది, ఏడీజీ శ్రీ డి సారంగి సమక్షంలో, ఒడిశాలోని కోణార్క్‌లో ఉన్న చంద్రభాగలో, ఎన్‌హెచ్ 316 వద్ద సముద్ర తీర ప్రాంత శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్.పి. సింగ్, న్యూదిల్లీ న్యూ మోతీబాగ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ అకామడేషన్స్ కాంప్లెక్స్ నివాసితులతో కలిసి 'శ్రమదానం'లో పాల్గొన్నారు. ఎన్‌బీసీసీ ఉద్యోగులు కూడా భాగస్వాములయ్యారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1,000కి పైగా శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ అధికార్లు, సిబ్బంది, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎక్కువ మందిని కలిపే ప్రదేశాలు కావడంతో టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ శుభ్రత కార్యకలాపాలు చేపట్టారు. రోడ్డు పక్కన ఉండే దాబాలు, ప్రాజెక్టు ప్రాంతాల్లోనూ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్‌హెచ్‌ఏఐ, దిల్లీలోని ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించగా; ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, లోధి రోడ్‌లోని ఖన్నా మార్కెట్‌లో స్వచ్ఛత పనుల్లో పాల్గొంది. నోయిడాలోని ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్‌లో (ఐఏహెచ్‌ఈ) ‘స్వచ్ఛత కోసం శ్రమదానం’ కార్యకలాపాలు నిర్వహించారు. కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం నుంచి వచ్చి అక్కడ శిక్షణ తీసుకుంటున్నవారు కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 1963099)
Visitor Counter : 128