నౌకారవాణా మంత్రిత్వ శాఖ

మొదటిసారి, తమిళనాడులోని వి.ఓ.సి. నౌకాశ్రయం ద్వారా గ్రీన్ అమ్మోనియా దిగుమతి

Posted On: 27 SEP 2023 12:40PM by PIB Hyderabad

సెప్టెంబర్ 23, 2023న, తమిళనాడులోని వి.ఓ. చిదంబరనార్ పోర్టు అథారిటీ, 3x20 ఐఎస్‌వో గ్రీన్ అమ్మోనియా కంటైనర్లను విజయవంతంగా నిర్వహించింది. నౌకాశ్రయానికి వచ్చిన గ్రీన్‌ అమ్మోనియా బరువు 37.4 టన్నులు. ఈజిప్టులోని డామిట్టా పోర్టు ఆ కంటైనర్లు వచ్చాయి. టుటికోరిన్ ఆల్కలీ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (టీఎఫ్‌ఎల్‌), గ్రీన్ అమ్మోనియాను తెప్పించింది.

సాధారణంగా, గ్రే అమ్మోనియాను సోడా యాష్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ 'గో గ్రీన్' చొరవలో భాగంగా, గ్రీన్ సోడా యాష్‌ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేయడానికి గ్రీన్ అమ్మోనియాను టీఎఫ్‌ఎల్‌ దిగుమతి చేసుకుంది. లభ్యతను బట్టి, ఈ సంవత్సరం 2000 మెట్రిక్‌ టన్నుల గ్రీన్ అమ్మోనియాను దిగుమతి చేసుకోవాలని టీఎఫ్‌ఎల్‌ యోచిస్తోంది.

24.09.2023న, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ ఒకే రోజులో 2,01,204 మెట్రిక్‌ టన్నుల సరకును నిర్వహించి 'ఒక రోజులో అత్యధిక సరకు నిర్వహణ' రికార్డును సృష్టించారు. 26.08.2023న ఉన్న 2,00,642 మెట్రిక్‌ టన్నుల రికార్డును అధిగమించారు. కంటెయినర్ (1,03,528), థర్మల్ బొగ్గు (35,018), పారిశ్రామిక బొగ్గు (27,233), సున్నపురాయి (12,868), సల్ఫ్యూరిక్ యాసిడ్ (10,930), ఇతర కార్గోలు (11,627) ఈ రికార్డుకు దోహదపడ్డాయి.

“హరిత నౌకాశ్రయం కార్యక్రమాలను చేపట్టడంలో వి.ఓ. చిదంబరనార్ పోర్టు భారతదేశంలోని ప్రధాన ఓడరేవులకు నమూనాగా నిలిచింది. కార్బన పాదముద్రను తగ్గించేలా హరిత ఉత్పత్తులను ఉపయోగించేందుకు మన పోర్టు వ్యాపార భాగస్వాములు, వాటాదార్లు వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రత్యేక సందర్భంగా, టీఎఫ్‌ఎల్‌ హరిత చొరవకు అభినందనలు తెలియజేస్తున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అని వి.ఓ. చిదంబరనార్ పోర్టు అథారిటీ అధ్యక్షుడు (తాత్కాలిక బాధ్యతలు) శ్రీ బిమల్ కుమార్ ఝా చెప్పారు.

 

***(Release ID: 1961207) Visitor Counter : 113