ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ లో 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించిన - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్
ఎయిమ్స్ తన 68 సంవత్సరాల ఉనికిలో దేశంలోని ప్రధాన ఆరోగ్య సంరక్షణ సంస్థ గా విశేషమైన ఖ్యాతిని ఆర్జించింది : ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్
"నివారణ సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహిస్తోంది"
Posted On:
25 SEP 2023 3:24PM by PIB Hyderabad
"ఎయిమ్స్ తన 68 సంవత్సరాల ఉనికిలో, దేశంలోని ప్రధాన ఆరోగ్య సంరక్షణ సంస్థ గా ఖ్యాతి పొందింది. ఈ రోజు భారతదేశంలోని ఏ గ్రామంలోనైనా చిన్న పిల్లవానికి సైతం ఎయిమ్స్ పేరు తెలుసు." అని న్యూ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్ పేర్కొన్నారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్ కూడా పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్) ప్రకారం, వరుసగా ఆరో సంవత్సరం, న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ వైద్య సంస్థలలో ప్రధమ స్థానంలో నిలిచిందని ప్రొఫెసర్ బాఘేల్ సంతోషం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ఇప్పటికే ఒక బ్రాండ్‌గా మారిందని, దాని ఖ్యాతి దేశవ్యాప్తంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టను కొనసాగించాలని, ఎయిమ్స్ బ్రాండ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని, ఆయన ఎయిమ్స్ అధికారులను కోరారు.
అత్యంత శిక్షణ పొందిన మానవ వనరుల కారణంగా నేడు భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఏ అభివృద్ధి చెందిన దేశం తోనైనా పోల్చదగినదిగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాలు, ఫార్మా పరిశ్రమలు, మెడ్‌టెక్ రంగంలో ఆవిష్కరణలకు దేశం ఇప్పటికే ప్రసిద్ది చెందిందని, అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న భారతీయుల్లో అధిక శాతం వైద్యులు ఉన్నారని ఆయన అన్నారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశం నివారణ సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. "ఎయిమ్స్ : భారతదేశ ఆరోగ్య సంరక్షణ భద్రతలో అగ్రగామి" అనే ఇతివృత్తం తో ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘెల్ సందర్శించి, విద్యార్థులు సాధించిన విజయాలు, సహకారానికి బహుమతులు అందజేశారు. ఎయిమ్స్ లోని విద్యార్థులను కష్టపడి పని చేయాలని ఆయన ప్రోత్సహిస్తూ, వారి బాధ్యతలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా డాక్టర్ వి.కే. పాల్ వజ్రోత్సవ ప్రసంగం చేశారు. భారతదేశ కోవిడ్-9 టీకా కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఇది మన "ఆత్మ నిర్భరత", "ఆత్మవిశ్వాసం" అని అభివర్ణించారు. సాంకేతికత బదిలీ కింద స్వదేశీ టీకాలు, విదేశీ టీకాలు రెండింటినీ తయారు చేయడంలో భారతదేశం సాధించిన విజయాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ వ్యూహంతో పాటు, వాటి అమలు విధానం సహా భారతదేశ కోవిడ్-19 టీకా వ్యూహం గురించి డాక్టర్ పాల్ వివరించారు. భారతదేశంలోని 98 శాతం టీకాలు వేసే కార్యక్రమం పూర్తిగా భారత ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ఉచితంగా జరిగిందని ఆయన తెలియజేశారు.
రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఫార్మా, మెడికల్, మెడ్‌టెక్ రంగాల్లో భారతదేశ పోటీ ప్రయోజనాన్ని నిర్ధారించడానికి, ఈ రంగాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డాక్టర్ పాల్ ప్రముఖంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్; న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ డీన్ ప్రొఫెసర్ మిను బాజ్‌పాయ్; న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గిరిజా ప్రసాద్ రాత్ ప్రభృతులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1960770)
Visitor Counter : 120