రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన & అభివృద్ధి, ఆవిష్కరణలపై జాతీయ విధానాన్ని; ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన & ఆవిష్కరణలు (పీఆర్‌ఐపీ) ప్రోత్సహించే పథకాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ

Posted On: 25 SEP 2023 3:23PM by PIB Hyderabad

భారతదేశంలో, ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన & అభివృద్ధి, ఆవిష్కరణలపై జాతీయ విధానాన్ని కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించనున్నారు. ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన & ఆవిష్కరణలు (పీఆర్‌ఐపీ) ప్రోత్సహించే పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర ఔషధ విభాగం ఈ కార్యక్రమాన్ని రేపు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహిస్తుంది.

ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన & అభివృద్ధిపై జాతీయ విధానం, రాబోయే దశాబ్ద కాలంలో ఈ రంగాన్ని 120-130 బిలియన్‌ డాలర్లకు పెంచడంలో సాయపడుతుంది. దీని ద్వారా జీడీపీలో ఈ రంగం సహకారం సుమారు 100 బేసిస్ పాయింట్లు పెరగవచ్చు. సాంప్రదాయ ఔషధాలు & ఫైటోఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు సహా ఔషధ రంగంలో ఆర్‌&డీని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతికతల ద్వారా మూడు ముఖ్యమైన అంశాల్లో ఆర్‌&డీ ప్రోత్సహిస్తారు. ఆ అంశాలు: నియంత్రణ విధానాలను బలోపేతం చేయడం, ఆవిష్కరణల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆవిష్కరణల కోసం సులభతర వ్యవస్థను సృష్టించడం.

ఈ కార్యక్రమంలో విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ రంగ నిపుణులు, విద్యావేత్తలు, మేధావులు, పరిశ్రమలు, మీడియా ప్రతినిధులతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. భారతదేశం నుంచి ఔషధాల ఎగుమతులు, విభాగాల వారీగా భారతదేశ ఎగుమతుల వాటా, ఈ విధానం అవసరం, లక్ష్యాలు, ముఖ్యమైన అంశాలు, పర్యవేక్షణ యంత్రాంగం గురించి వివరించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

 

****



(Release ID: 1960575) Visitor Counter : 132