గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత ఉద్యమంపై ప్రచారం చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన 13 ఏళ్ల సునిధి జంగిద్
ఉపయోగించిన శానిటరీ ప్యాడ్‌ల నిర్వహణ మార్గాలపై ప్రజలకు అవగాహన
Posted On:
22 SEP 2023 5:32PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్, రాబోయే తరాల కోసం సురక్షితమైన, పరిశుభ్రమైన, వ్యర్థ రహిత భారతదేశాన్ని నిర్మించడానికి రూపొందించిన కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో, దేశ ప్రజలంతా స్వచ్ఛత ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు, ముందుకు నడిపిస్తున్నారు.

రాజస్థాన్‌లోని కేక్డీ నగర్ పరిషత్‌లో నివశించే సునిధి జంగీద్ ఒక యువ నాయకురాలు, స్వచ్ఛత ప్రచారకర్త. స్వచ్ఛత ఉద్యమం కోసం స్థానికంగా ఆమె చేసిన ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తన తోటివారితో పాటు పెద్దలను కూడా స్వచ్ఛత ప్రచారంలో పాల్గొనేలా ఆమె ప్రోత్సహించింది, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించింది. 13 ఏళ్ల సునిధి జంగిద్, కెక్డి పట్టణంలో 8వ తరగతి చదువుతోంది. పారిశుద్ధ్యం గురించి తన తోటివారిలో అవగాహన పెంచడానికి సమాచారం, విద్యను మాధ్యమాలుగా చేసుకుంది. 2023 మార్చిలో జరిగిన స్వచ్ఛోత్సవ్ నుంచి స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా తన వంతు పాత్రను పోషిస్తున్న సునిధి, ఉపయోగించిన శానిటరీ ప్యాడ్‌ల నిర్వహణ మార్గాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

ఈ నెల 17న, స్వచ్ఛత పఖ్వాడా - స్వచ్ఛత హి సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన 'ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0'లో (ఐఎస్‌ఎల్ 2.0) సునిధి తన ఆలోచనలను స్థానికులకు, విద్యార్థులకు వివరించింది. ఐఎస్‌ఎల్ 2.0 కింద జరిగిన వివిధ కార్యక్రమాల్లో 500 మందికి పైగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి కెక్డి మున్సిపాలిటీ ఉన్నతాధికారి కమలేష్ కుమార్ సాహు అధ్యక్షత వహించారు. అంత పెద్ద సమావేశాన్ని ఉద్దేశించి సునిధి ప్రసంగించింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, తడి చెత్తతో ఎరువులు తయారు చేయడం, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను బహిష్కరించడం, ఉపయోగించిన శానిటరీ ప్యాడ్‌ల నిర్వహణ, వ్యర్థాల విభజన వంటి పారిశుద్ధ్యానికి సంబంధించిన ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తూ చాలా స్పష్టంగా మాట్లాడింది. స్వచ్చత అంటే ఏంటి, అది మనందరికీ ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆమె రాసిన ‘మనే సాఫ్ సఫాయ్ ప్యారీ లగే’ (మేము శుభ్రతను ప్రేమిస్తాం) అనే పాటను పాడింది.
***
(Release ID: 1959826)