శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎస్‌ఎంవీడీ నారాయణ హెల్త్‌కేర్ టీబీ ముక్త్ ఎక్స్‌ప్రెస్‌ను (చలో చలే టీబీ కో హరానే) జెండా ఊపి ప్రారంభించిన డా.జితేంద్ర సింగ్


2025 నాటికి టీబీని నిర్మూలించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఒక నమూనాగా నిలుస్తాయి, జన్ భాగీదారి స్ఫూర్తితో టీబీ నిర్మూలనకు పౌరులు సమష్టిగా కృషి చేయాలి: డా.జితేంద్ర సింగ్

2025 నాటికి ‘టీబీ ముక్త్ భారత్’ సాధించడానికి సమగ్ర వ్యూహంతో కూడిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) అవసరం: డా.జితేంద్ర సింగ్

Posted On: 17 SEP 2023 2:11PM by PIB Hyderabad

‘టీబీ ముక్త్ భారత్’ సాధించడానికి సమగ్ర వ్యూహంతో కూడిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) అవసరం అని కేంద్ర శాస్త్ర & సాంకేతికత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్ చెప్పారు. 2025 నాటికి టీబీ రహిత భారతదేశం ఆవిష్కృతం కావాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో టీబీ ముక్త్ భారత్‌ ప్రచారాన్ని ఆవిష్కరించారు.

‘ఛలో చలే టీబీ కో హరానే’ నినాదంతో, ఉధంపూర్‌లో ఎస్‌ఎంవీడీ నారాయణ హెల్త్‌కేర్ టీబీ ముక్త్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి డా.జితేంద్ర సింగ్ ప్రారంభించారు.

2025 నాటికి టీబీని నిర్మూలించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి నమూనాగా నిలుస్తాయని డా.జితేంద్ర సింగ్ చెప్పారు. ఇందుకోసం, జన్ భాగీదారి స్ఫూర్తితో టీబీ నిర్మూలనకు పౌరులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

క్షయవ్యాధి వల్ల ఏర్పడే సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, 2025 నాటికి 'టీబీ ముక్త్ భారత్'కు భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, క్షయవ్యాధి నిర్మూలన రూపంలో సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానంలో జీవసాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు.

ప్రైవేట్ రంగంతో ఒప్పందాలు, క్రియాశీల కేసులను కనిపెట్టడం, ఆరోగ్య కేంద్రాల ద్వారా సేవల వికేంద్రీకరణ, పౌర సమాజాన్ని కలుపుకుపోవడం, ని-క్షయ్ పోషణ్ యోజన వంటి వ్యూహాలు భారతదేశ టీబీ నిర్వహణ ప్రయత్నాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని, రోగి-కేంద్రీకృతంగా మార్చాయని డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు.

తాను దత్తత తీసుకున్న టీబీ రోగుల రోజువారీ అవసరాలను తీర్చే కిట్‌లను ఈ కార్యక్రమంలో డా.జితేంద్ర సింగ్ పంపిణీ చేశారు.

ఉధంపూర్ ఉప కమిషనర్ శ్రీ సలోని రాయ్, ఉధంపూర్ డీడీసీ చైర్మన్ శ్రీ లాల్ చంద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1958359) Visitor Counter : 99