రక్షణ మంత్రిత్వ శాఖ
'భారత్ డ్రోన్ శక్తి 2023' పోటీలను 'డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'తో కలిసి నిర్వహిస్తున్న భారత వైమానిక దళం
Posted On:
06 SEP 2023 2:26PM by PIB Hyderabad
పౌర, రక్షణ రంగాల్లో సామర్థ్యాన్ని పెంచడం, సమస్యలను తగ్గించడం ద్వారా డ్రోన్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. భారతదేశంలో డ్రోన్‌ల వినియోగం అటు సాయుధ దళాల్లో, ఇటు పౌర రంగాల్లో పెరుగుతోంది. నిఘా కార్యకలాపాల కోసం, భారత వైమానిక దళం రిమోట్‌తో నడిపించే డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తోంది. మన దేశంలో అభివృద్ధి చెందుతున్న డ్రోన్ రూపకల్పన & అభివృద్ధి సామర్థ్యాలపై తనకున్న విశ్వాసాన్ని మెహర్ బాబా స్వార్మ్ డ్రోన్ పోటీల వంటి కార్యక్రమాల ద్వారా చాటుతోంది, స్వదేశీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ పోటీల తదుపరి దశ ప్రస్తుతం జరుగుతోంది.
మానవ రహిత డ్రోన్లను ఉపయోగించడంలో తనకున్న అనుభవాన్ని చాటడానికి, 'భారత్ డ్రోన్ శక్తి 2023'ను 'డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'తో కలిసి ఐఏఎఫ్ నిర్వహిస్తోంది. ఈ నెల 25 & 26 తేదీల్లో, హిందాన్‌లోని (ఘజియాబాద్) ఐఏఎఫ్ వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ, భారతీయ డ్రోన్ పరిశ్రమ వైమానిక ప్రదర్శనలు ఇస్తుంది.
'భారత్ డ్రోన్ శక్తి 2023'లో సర్వే డ్రోన్‌లు, వ్యవసాయ డ్రోన్‌లు, అగ్నిమాపక డ్రోన్‌లు, వ్యూహాత్మక నిఘా డ్రోన్‌లు, ఎక్కువ బరువును మోసే లాజిస్టిక్స్ డ్రోన్‌లు, డ్రోన్ సమూహాలు, కౌంటర్-డ్రోన్ పరిష్కారాలను ప్రదర్శిస్తారు. 75కు పైగా డ్రోన్ అంకుర సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ & ప్రైవేట్ పరిశ్రమలు, సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు, మిత్ర దేశాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు, ఔత్సాహికులు సహా దాదాపు 5,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. 2030 నాటికి ప్రపంచ డ్రోన్ కేంద్రంగా మారాలన్న భారతదేశ నిబద్ధతకు 'భారత్ డ్రోన్ శక్తి 2023' నిదర్శనంగా నిలుస్తుంది.
***
(Release ID: 1955134)
Visitor Counter : 153