కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఈ-కామర్స్ ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేయడానికి తపాలా విభాగం, షిప్‌రాకెట్ భాగస్వామ్యం
Posted On:
05 SEP 2023 7:31PM by PIB Hyderabad
దేశంలో ఈ-కామర్స్ ఎగుమతుల వ్యవస్థను మెరుగుపరచడానికి కొనసాగుతున్న కార్యక్రమాల్లో భాగంగా, ప్రముఖ ఈ-కామర్స్ ఆధారిత వేదికల్లో ఒకటైన 'బిగ్‌ఫుట్ రిటైల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్'తో (షిప్‌రాకెట్) భారత తపాలా విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తపాలా విభాగం విస్తృత వ్యాప్తిని, విశ్వసనీయ రవాణా పరిష్కారాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ-కామర్స్ ఎగుమతుల వ్యవస్థను మెరుగుపరచడం ఈ ఒప్పందం లక్ష్యం.
భారతదేశం వెలుపల ఈ-కామర్స్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచే ఈ ఒప్పందంపై, ఈరోజు, న్యూదిల్లీలో సంతకాలు జరిగాయి. డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ శ్రీ అలోక్ శర్మ, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ దిల్లీ శ్రీ మంజు కుమార్, షిప్‌రాకెట్ సీఈవో శ్రీ సాహిల్ గోయెల్ సమక్షంలో సంతకాలు జరిగాయి.
“ఇండియా పోస్ట్ ఈ మధ్యకాలంలో విదేశీ తపాలా కార్యాలయాల విస్తరణ, తపాలా కార్యాలయాల ద్వారా వాణిజ్య ఎగుమతులను ప్రారంభించడానికి పోస్టల్ బిల్లును ప్రవేశపెట్టడం, 'ఇంటర్నేషనల్ ట్రాక్డ్ పాకెట్ సర్వీస్' ప్రారంభించడం, దేశవ్యాప్తంగా 'డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాస్' (డీఎన్‌కే) ఏర్పాటు చేయడం వంటి చాలా కార్యక్రమాలు చేపట్టిందని డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ శ్రీ అలోక్ శర్మ చెప్పారు.
“ఆన్‌లైన్ ఆర్డర్లు ప్రాసెస్ చేయడం, ఎగుమతులకు సంబంధించి పత్రాలు సమర్పణ, కస్టమ్స్ అనుమతులు వంటివి 'ఎలక్ట్రానిక్ పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్' (పీబీఈ) ద్వారా సులభంగా మారాయి, వాటిని డీఎన్‌కే పోర్టల్‌లో ఫైల్ చేయవచ్చు. వివిధ సంస్థలు, ఈ-మార్కెట్‌తో డీఎన్‌కే పోర్టల్‌ను ఏకీకృతం చేయడం వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల చేతివృత్తి కళాకారులు, ఎస్‌ఎంఈ అమ్మకందార్లకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం 600 పైగా డీఎన్‌కేలు పని చేస్తున్నాయి” అని శ్రీ శర్మ వెల్లడించారు.
ఈ ఒప్పందం డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రం, షిప్‌రాకెట్ సాంకేతిక ఏకీకరణకు దారి తీస్తుంది. భారతదేశంలోని అమ్మకందార్లు నేరుగా షిప్‌రాకెట్ వేదిక నుంచి ఈ-పీబీఈ, షిప్పింగ్ లేబుళ్లను రూపొందించడానికి వీలు ఇది కల్పిస్తుంది. ఎగుమతిదార్లు ప్యాకేజింగ్, లేబుల్ ముద్రణ, పికప్ వంటి సౌకర్యాలను దీని ద్వారా పొందవచ్చు, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సమీపంలోని డీఎన్‌కేకి తమ సరకులను చేర్చవచ్చు.
ఈ సందర్భంగా మాడ్లాడిన సీపీఎంజీ దిల్లీ శ్రీ మంజు కుమార్, "ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణల శక్తివంతమైన చోదకంగా ఈ-కామర్స్ ఉద్భవించింది. విస్తృతంగా ఉన్న తపాలా కార్యాలయాల మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా, షిప్‌రాకెట్ వేదికలో మరిన్ని చిన్న వ్యాపారాలు కూడా పాల్గొనేలా వీలు కల్పించడం ద్వారా, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలను సాధించాలని ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది" అని వెల్లడించారు.
తపాలా విభాగంతో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం పట్ల సంతోషంగా ఉందని షిప్‌రాకెట్ సీఈవో శ్రీ సాహిల్ గోయెల్ చెప్పారు. ఇది, ఎంఎస్‌ఎంఈల కోసం ఈ-కామర్స్, ప్రపంచ వాణిజ్య వ్యవస్థను పునర్నిర్మిస్తుందన్నారు. తపాలా విభాగంతో కలిసి, ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా ప్రాంతాలకు వేగంగా, సురక్షితంగా, సమర్థవంతంగా పార్శిల్ సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ-కామర్స్ ఎగుమతులను ప్రోత్సహించడానికి లాజిస్టిక్స్ ప్రదాతలు, ఈ-మార్కెట్‌ప్లేస్ సంస్థలతో కలిసి పని చేస్తున్న నేపథ్యంలో, ఈ భాగస్వామ్యం చాలా విలువైనది. గత వారం అమెజాన్‌తోనూ భారత తపాలా విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
***
(Release ID: 1955095)
Visitor Counter : 153