రక్షణ మంత్రిత్వ శాఖ
సన్నాహకం
'నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్' 2023/2 (04-06 సెప్టెంబర్ 23)
Posted On:
03 SEP 2023 12:34PM by PIB Hyderabad
'నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023' రెండో దఫా సదస్సు న్యూదిల్లీలో ఈ నెల 04-06 తేదీల్లో జరుగుతుంది. ఇది, నౌకాదళ కమాండర్ల మధ్య జరిగే చర్చల వేదిక. ముఖ్యమైన విధాన నిర్ణయాల రూపకల్పన కోసం ముఖాముఖి చర్చలకు అవకాశం కల్పించే అత్యున్నత స్థాయి ద్వివార్షిక కార్యక్రమం ఇది. 'హైబ్రిడ్' పద్ధతిలో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అధ్యక్షత వహిస్తారు, నౌకాదళ సీనియర్ అధికారులు పాల్గొంటారు. ప్రధాన కార్యాచరణ, సామగ్రి, లాజిస్టిక్స్, మానవ వనరులు, శిక్షణ, గత ఆరు నెలల్లో చేపట్టిన పరిపాలనాపరమైన కార్యకలాపాలను ఈ సమావేశంలో సమీక్షిస్తారు. తదుపరి నెలల్లో చేపట్టాల్సిన అంశాలపైనా చర్చలు జరుగుతాయి.
గౌరవనీయ భారత రక్షణ శాఖ మంత్రి ఈ సమావేశంలో నౌకాదళ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా హాజరవుతారు. భారతదేశ సంపూర్ణ ఆర్థిక వృద్ధికి అవసరమైన సురక్షిత సముద్ర వాతావరణాన్ని అభివృద్ధి చేసేలా, వివిధ మంత్రిత్వ శాఖల కార్యక్రమాలు సజావుగా అమలయ్యేలా సీనియర్ ప్రభుత్వ అధికారులతో నౌకాదళ కమాండర్లు మాట్లాడేందుకు కూడా ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది.
భారత సైన్యం, వాయుసేన అధిపతులు కూడా కార్యాచరణలను విశ్లేషించడానికి, త్రివిధ దళాల మధ్య సమన్వయం, సముద్ర దళాల సంసిద్ధతను అంచనా వేయడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.
గత ఆరు నెలలుగా అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వరకు భారత నౌకాదళం కార్యకలాపాలు విస్తరించాయి, తీవ్రమైన వేగం కనిపించింది. 'ఆపరేషన్ కావేరీ'లో భాగంగా సుడాన్ నుంచి భారతీయ పౌరుల తరలింపు కోసం భారత నౌకాదళ నౌకలు మొదట స్పందించాయి. 'ఆపరేషన్ కరుణ'లో భాగంగా, మయన్మార్‌లో మోచా తుపాను తర్వాత సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. సముద్ర ప్రాంతంలో ప్రాధాన్యత భద్రత భాగస్వామిగా, ఏదైనా సంక్షోభ సమయంలో మొదట స్పందించే దళంగా భారత నౌకాదళం ఉండాలన్న అంచనాలకు అనుగుణంగా, నౌకాదళానికి చెందిన ఆయుధాలు/సెన్సార్ల పని తీరుపై ప్రత్యేక దృష్టితో వివరణాత్మక సమీక్ష జరుగుతుంది.
2047 నాటికి సంపూర్ణ 'ఆత్మనిర్భరత' సాధించాలన్న దృక్పథానికి అనుగుణంగా, 'మేక్ ఇన్ ఇండియా' ద్వారా స్వదేశీకరణను పెంచడంపై దృష్టి పెట్టే నౌకాదళ ప్రాజెక్టులను కమాండర్లు సమీక్షిస్తారు. స్వదేశీకరణ, ఆవిష్కరణలు, సాంకేతిక కార్యక్రమాలను కూడా నౌకాదళం ప్రదర్శిస్తుంది. సిబ్బంది జీవన నాణ్యతను పెంచే వివిధ హెచ్‌ఆర్ కార్యక్రమాలను ఈ సదస్సులో సమీక్షిస్తారు. అలాగే, నౌకాదళంలో ఇప్పటికీ అమలవుతున్న ప్రాచీన పద్ధతులను గుర్తించడం, తొలగించడంపై కూడా కమాండర్లు చర్చిస్తారు.
****
(Release ID: 1954525)