వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు కృత్రిమ మేథను వినియోగించాలి: కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల విభాగం కార్యదర్శి


కృత్రిమ మేథపై కార్యశాల నిర్వహించిన కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల విభాగం

Posted On: 31 AUG 2023 6:01PM by PIB Hyderabad

ఏఐ నుంచి ప్రయోజనాలు పొందుతూనే వినియోగదార్ల ప్రయోజనాలను రక్షించడంలో ఉన్న సమస్యలను గుర్తించేలా డీవోసీఏ- వాటాదార్ల మధ్య నిర్మాణాత్మక చర్చల కోసం, కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల విభాగం ఈ రోజు "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అండ్‌ కన్జ్యూమర్స్‌" పేరిట ఒక కార్యశాలను నిర్వహించింది.

డీవోసీఏ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ ఆహూతులకు స్వాగతం పలికారు. అన్ని రంగాల్లో సాంకేతికత బలంగా నాటుకుపోయిందని, రోజువారీ జీవితంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన అన్నారు. వినియోగదార్లతో సంబంధాల విషయంలో సాంకేతికతల ప్రభావాల గురించి జాగ్రత్తగా ఉండటం మరింత అవసరం అని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించడంలో, వినియోగదార్ల ఫిర్యాదులను సులభంగా పరిష్కరించడంలో ఏఐ సాంకేతికత ఉపయోగాల గురించి కూడా కార్యశాలలో చర్చించారు.

కొనుగోళ్ల ప్రాధాన్యతలను గుర్తించడం, కొనుగోలు విధానాల నమూనాలు, మెరుగైన సిఫార్సులు, వినియోగదార్లకు ముందస్తు మద్దతు వంటి అంశాల్లో ఏఐ ప్రయోజనాల గురించి వివిధ వాటాదార్లు, నిపుణులు చర్చించారు. వినియోగదార్ల సమాచార గోప్యత సమస్యలు, కొన్ని సమస్యల విషయంలో బాధ్యతను అప్పగించడంలో ఎదురయ్యే ఇబ్బందులు, లింగం, రంగు మొదలైన కారణాలతో అల్గారిథమిక్ పక్షపాతం, ఏఐ నియంత్రిత చెడ్డ బాట్‌లు సహా ఏఐ విసిరే సవాళ్ల గురించి కూడా మాట్లాడారు.

వినియోగదార్ల ప్రయోజనాలను పరిరక్షించడం, ఆర్థిక వృద్ధి కోసం ఏఐని ఉపయోగించడం మధ్య సమతూకాన్ని సృష్టించడం ప్రధానాంశం అని అందరు అంగీకరించారు. ఉత్పాదకత సమాచారం నిర్వహణ, కీలక మూల్యాంకనం, సురక్షిత సంప్రదింపులు, మదింపు, మాట్లాడే వేదికలకు సంబంధించిన భద్రత అంశాలు సహా వివిధ అంశాలపై వాటాదార్లు, నిపుణులు చర్చించారు. అల్గారిథమిక్ పక్షపాతాలు, ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా ఏఐ నిలవడం, నకిలీ వార్తలు, ఏఐకి ఒక బలమైన నిర్వచనం లేకపోవడం, ఐఏపై నియంత్రణలు లేకపోవడం వంటివి ఏఐ విధాన రూపకర్తల ఎదుట ఉన్న అతి పెద్ద సవాళ్లు.

చర్చల ద్వారా ఈ సూచనలు ప్రతిపాదించారు: సమానత్వం, గోప్యత హక్కు వంటి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఏఐ రంగంలో ప్రభుత్వం నిబంధనలను రూపొందించడం, ఏఐ రూపొందించిన సమాచారాన్ని ఎలా ఉపయోగించాన్న విషయంపై చట్టబద్ధమైన రక్షణ, కేసుల వర్గీకరణ కోసం ఏఐని ఉపయోగించడం & వాటిని సరైన విభాగానికి అందించడం, ఏఐ & ఆవిష్కరణల రంగంలో ప్రభుత్వ నిబంధనల మధ్య సమతుల్యత సాధించడం.

పరిశ్రమ వాటాదార్లు-విధాన రూపకర్తల మధ్య ప్రస్తుతమున్న సహకారాన్ని మరింత పెంచేలా ఈ చర్చల ఫలితాలను ఉపయోగించుకోవడానికి కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల విభాగం యోచిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వెల్లడైన ఆలోచనలు, అభిప్రాయాలు భవిష్యత్ విధాన రూపకల్పనకు పునాదిగా ఉపయోగపడతాయి, ఏఐ నిబంధనలు వినియోగదార్ల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూస్తాయి. 

 

****



(Release ID: 1953936) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi , Punjabi