రాష్ట్రపతి సచివాలయం
స్వర్గీయ శ్రీ ఎన్‌టి రామరావు గౌరవార్థం స్మారక నాణేన్ని విడుదల చేసిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
28 AUG 2023 12:32PM by PIB Hyderabad
స్వర్గీయ శ్రీ ఎన్‌టి రామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేన్ని గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (ఆగస్టు 28, 2023) రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు తెలుగు సినిమాల ద్వారా భారతీయ సినిమా, సంస్కృతిని సుసంపన్నం చేశారన్నారు. ఆయన తన నటన ద్వారా రామాయణం మరియు మహాభారతాలలోని ప్రముఖ పాత్రలకు జీవం పోశారు. ఆయన నటించిన రాముడు, కృష్ణుడు పాత్రలు ఎంత సజీవంగా మారాయంటే జనాలు ఎన్టీఆర్ లో ఆయా దేవుళ్ళుగానే భావించి ఆరాధించడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ సామాన్యుల బాధను తన నటన ద్వారా వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. ‘మనుషులంతా ఒక్కటే’ అనే సినిమా ద్వారా మనుషులంతా సమానమే అనే సామాజిక న్యాయం, సమానత్వ సందేశాన్ని ఇచ్చారు.
ప్రజాసేవకుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్‌కు ఉన్న ఆదరణ అదే ఉన్నత స్థాయిలో ఉందని రాష్ట్రపతి అన్నారు. ఆయన తన అసాధారణ వ్యక్తిత్వం మరియు కృషి పట్టుదల తో భారత రాజకీయాల్లో తనదైన అద్వితీయమైన అధ్యాయాన్ని రచించారు. ఆయన ప్రారంభించిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాలలోగుర్తుండిపోతాయి.
ఎన్టీఆర్ స్మారక నాణెం తీసుకొచ్చినందుకు భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖను రాష్ట్రపతి అభినందించారు. ఆయన అద్వితీయమైన వ్యక్తిత్వం ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ ముద్రితమై ఉంటుందని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి -
(रिलीज़ आईडी: 1952967)
आगंतुक पटल : 256