రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

క్షిపణి సాంకేతికతలో స్వయంసమృద్ధిపై విశాఖపట్నంలో ప్రదర్శన సదస్సు

Posted On: 26 AUG 2023 11:31AM by PIB Hyderabad

క్షిపణి సాంకేతికతలో స్వయంసమృద్ధిపై 'ఆత్మనిర్భరత ఇన్ మిస్సైల్ రిపేర్స్ & ఇండిజనైజేషన్ టెక్నాలజీస్ (అమృత్-2023)' పేరిట విశాఖపట్నంలో సదస్సు జరిగింది. ఈ నెల 23వ తేదీన, విశాఖపట్నం నౌకాదళ స్థావరంలోని సాముద్రిక ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభ సెషన్‌లో, డిఎస్, డిజీ ఎన్ఎస్&ఎం డా. వై శ్రీనివాసరావు, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ శ్రీ జీఏ శ్రీనివాసమూర్తి ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సదస్సులో, క్షిపణి సాంకేతికతకు సంబంధించి వివిధ పరిశోధన పత్రాలను సమర్పించారు, వివిధ సంస్థల సిబ్బంది సాంకేతిక చర్చలు జరిపారు. పుణెలోని మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు (ఎన్‌ఆర్‌డీసీ) చెందిన సభ్యులు కూడా కీలక సమాచారంతో ఈ చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.
           
డీఆర్‌డీవో, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగంలోని ప్రైవేటు రంగం సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐడీఎం) నుంచి సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శన స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. డీఆర్‌డీవో ల్యాబులు, డీపీఎస్‌యూలు, రక్షణ రంగంలోని ప్రైవేటు రంగం సంస్థలు క్షిపణి మరమ్మతులు, స్వదేశీ పరిజ్ఞానంలో తమ నైపుణ్యం & సామర్థ్యాలను ఇక్కడ ప్రదర్శించాయి.
           
ఈ సదస్సు, భారత ప్రభుత్వ చొరవ అయిన ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, డీఆర్‌డీవో ల్యాబులు, మేధావులు, భారతీయ నౌకాదళం వంటి వర్గాల మధ్య సహకారం, ప్రోత్సహం అందించింది. ఈ సదస్సు భారత సాయుధ దళాలకు, ముఖ్యంగా నౌకాదళానికి ఎంతో ఉపయోగపడుతుంది. విదేశీ ఓఈఎంలపై ఆధారపడటాన్ని తగ్గించడం, మన దేశ రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతిమంగా దేశాన్ని స్వయంసమృద్ధి వైపు వైపు నడిపించడం దీని ఉద్దేశం.
 
‘ఆత్మనిర్భర్ భారత్’ వైపు ప్రయాణంలో కలిసి వచ్చినందుకు, అమృత్-23ని విజయవంతం చేసినందుకు హాజరైన అన్ని సంస్థలను ముఖ్య అతిథి అభినందించారు. ఐఎన్‌ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్. కమాండర్‌ సీఎస్ నాయర్ కృతజ్ఞత ప్రసంగం చేశారు. ప్రదర్శన స్టాళ్లను నౌకాదళ సిబ్బంది, నిపుణులు, స్థానిక సంస్థలు, సాంకేతిక సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు కూడా సందర్శించాయి.


***


(Release ID: 1952488) Visitor Counter : 130