బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయంగా బొగ్గును సమర్ధవంతంగా తరలించేందుకు 'రైలు-సముద్రం-రైలు' రవాణా విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు


ఆర్‌ఎస్‌ఆర్‌ అనేది బొగ్గు తరలింపులో ప్రత్యామ్నాయ మార్గం, ఎలాంటి ఇబ్బందులు లేని నిరంతర విద్యుత్ సరఫరా దీని లక్ష్యం

ఆర్‌ఎస్‌ఆర్‌ తుది వినియోగదార్ల వ్యయాల్ని తగ్గిస్తుంది, పర్యావరణహితంగా ఉంటుంది

Posted On: 23 AUG 2023 2:37PM by PIB Hyderabad

దేశీయంగా బొగ్గును సమర్థవంతంగా తరలించేందుకు 'రైలు-సముద్రం-రైలు' (ఆర్‌ఎస్‌ఆర్‌) రవాణా పద్ధతిని ఏకీకృతం చేసే లక్ష్యంతో, ఆర్‌ఎస్‌ఆర్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. గనుల నుంచి ఓడరేవులకు, ఆ తర్వాత తుది వినియోగదార్లకు బొగ్గును ఎలాంటి అవాంతరాలు రవాణా చేయడం ఈ బహుళ విధాన రవాణా వ్యవస్థ ఉద్దేశం. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి, లాజిస్టిక్స్‌ సామర్థ్యం మెరుగుపడుతుంది.

FY23లో, బొగ్గు ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, మొత్తం దేశీయ ముడి బొగ్గు పంపిణీలో దాదాపు 75% వాటా ఉంది. దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, FY30 నాటికి భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి 7.7% సీఏజీఆర్‌ వద్ద దాదాపు రెట్టింపు అవుతుందని బొగ్గు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

పెరుగుతున్న బొగ్గు డిమాండ్‌ను తీర్చడానికి ప్రణాళికబద్ధమైన & సమర్థవంతమైన బొగ్గు రవాణా వ్యవస్థ అవసరం. దేశంలో బొగ్గు తరలింపు కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించే లక్ష్యంతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక అంతర్‌ మంత్రిత్వ శాఖల (ఐఎంసీ) కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, జల రవాణా & జల మార్గాల మంత్రిత్వ శాఖ ఇందులో సభ్యులు. ప్రస్తుతం, దేశంలోని మొత్తం బొగ్గు రవాణాలో రైల్వేలది 55% వాటా. FY30 నాటికి ఈ వాటాను 75%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బొగ్గు తరలింపు సామర్థ్యాన్ని పెంచాలని, రవాణాలో రద్దీని నివారించడానికి FY30 నాటికి ఆర్‌ఎస్‌/ఆర్‌ఎస్‌ఆర్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాల్సిన అవసరం ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ చెబుతోంది. బొగ్గు తరలింపులో ప్రస్తుత 40 ఎంటీల నుంచి 2030 నాటికి 112 ఎంటీలకు చేరుకునేలా ఆర్‌ఎస్‌ఆర్‌ను ప్రోత్సహించడానికి వివిధ చర్యలను మంత్రిత్వ శాఖల కమిటీ సిఫార్సు చేసింది. ఈ వ్యూహం వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది, బొగ్గు తరలింపు కోసం అదనపు ప్రత్యామ్నాయ విధానాన్ని అందించడం ద్వారా అన్ని రైలు మార్గాల్లో రద్దీని తగ్గించే అవకాశం ఉంది. రెండోది, భవిష్యత్తులో ఎగుమతుల కోసం ఉపయోగించగల మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఎగుమతి అవకాశాలను సృష్టిస్తుంది. చివరిది, ఏఆర్‌ఆర్‌తో పోలిస్తే ఆర్‌ఎస్‌ఆర్‌ చాలా తక్కువ కర్బన ఉద్గారాలను వెదజల్లుతుంది.

భారతదేశ లాజిస్టిక్స్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు తీర ప్రాంత రవాణా విధానానికి అవకాశం ఉంది. దక్షిణ & పశ్చిమ తీరాల్లోని ఓడరేవుల పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకునేలా చూడడానికి ఆర్‌ఎస్‌/ఆర్‌ఎస్‌ఆర్‌ వంటివి కృషి చేస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గును మరింత సమర్థవంతంగా రవాణా చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్‌ఎస్‌ఆర్ ద్వారా బొగ్గు తరలింపు వ్యయాలు తగ్గే అవకాశం ఉంది, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌ఆర్ పద్ధతిని ఎంచుకుంటే, దక్షిణ భారతదేశంలో ఉన్న తుది వినియోగదార్లకు లాజిస్టిక్స్ ఖర్చుల్లో టన్నుకు దాదాపు రూ.760-1300 వరకు ఆదా అవుతుంది. ప్రస్తుతం, ఎంసీఎల్‌ (పారాదీప్‌) నుంచి పశ్చిమ/ఉత్తర టీపీపీలకు బొగ్గు సరఫరా చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఏఆర్‌ఆర్‌ కంటే టన్నుకు సుమారు రూ.2500 పెరుగుతుంది. అయితే, దిగుమతి చేసుకునే బొగ్గు సరఫరా ధర కంటే ఇది చౌకగా ఉంటుంది.

రైలు-సముద్రం-రైలు రవాణా విధానాన్ని ప్రోత్సహించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ప్రత్యామ్నాయ మార్గం గత 4 సంవత్సరాల్లో దాదాపు 125% వృద్ధిని సాధించింది. రాబోయే ఏడేళ్లలో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేసిన నేపథ్యంలో, దేశంలోని వినియోగ కేంద్రాలకు సమర్థవంతంగా బొగ్గును తరలించడంలో, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడడంలో రైలు-సముద్రం-రైలు రవాణా విధానం కీలక పాత్ర పోషిస్తుంది.

దేశంలో బొగ్గును సమర్ధంగా తరలించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు ఐఎంసీ చేసే సిఫార్సులు "హోల్ ఆఫ్ గవర్నమెంట్" విధానంలో భాగం అవుతాయి.

రైలు-సముద్రం-రైలు బొగ్గు తరలింపు వ్యూహాన్ని మరింత మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలను బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకుంటోంది. దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేలా, స్థిరమైన & సమర్థవంతమైన ఇంధన సరఫరా వ్యవస్థ ఉండేలా బొగ్గు మంత్రిత్వ శాఖ భరోసా కల్పిస్తోంది.

***


(Release ID: 1951981) Visitor Counter : 168