మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కర్ణాటకలో ఎన్‌ఈపీ రద్దు నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ హేతుబద్ధతను ప్రశ్నించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం అమలు చేస్తే యువతరంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన

Posted On: 22 AUG 2023 8:00PM by PIB Hyderabad

కర్ణాటకలో ఎన్‌ఈపీని రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విద్య & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి నిర్ణయం వల్ల యువతరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా అని ప్రశ్నించారు. ఈ రోజు మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

బాల్య సంరక్షణ, విద్యను కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తోందా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. గ్రేడ్ 2 పూర్తి చేసే సమయానికి చిన్న పిల్లలు పునాది స్థాయి విద్య, అంకెలు నేర్చుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవడం లేదా అని అడిగారు. భారతీయ బొమ్మలు, ఆటలు, ఆటల ఆధారిత అభ్యాసం, 'చెన్నెమనే'ని కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తోందా అని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.

కన్నడలో నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు కన్నడ, ఇతర భారతీయ భాషల్లో విద్యను బోధించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందా అని అడిగారు.

పాఠశాల విద్యలో కీలకమైన బహుళాంశిక విద్య, వృత్తి విద్య, శారీరక విద్య, కళలు, క్రీడలను కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తోందా అని ప్రశ్నించారు. 'నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన సౌకర్యాలను కర్ణాటక యువత వినియోగించుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదా అని అన్నారు.

21వ శతాబ్దపు విద్యకు సంబంధించిన కొత్త పాఠ్య పుస్తకాలను వినియోగిస్తూనే, 21వ శతాబ్దంలో నూతన & అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, జీవన నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఎందుకు కోరుకోవడం లేదని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ నిలదీశారు. కర్ణాటక విద్యార్థులు 'నేర్చుకునే సమయంలోనే సంపాదించే' అవకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. డైట్‌లు, ఎస్‌సీఈఆర్‌టీలను 'సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్'గా మార్చడం ద్వారా, ద్వారా ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదా అని శ్రీ ప్రధాన్ అడిగారు. ఎన్‌ఈపీ రద్దు నిర్ణయాన్ని, ఐటీ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్ర భవిష్యత్తును భవిష్యత్తులో ప్రభావితం చేసే విషయంగా కేంద్ర మంత్రి అభివర్ణించారు.

ఎన్‌ఈపీపై ఆ తరహా ప్రకటనలు విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి కాబట్టి, విద్యను రాజకీయం చేయవద్దని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.

 

****



(Release ID: 1951585) Visitor Counter : 131


Read this release in: Kannada , English , Urdu , Hindi