బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

300 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం రాజస్థాన్‌తో దీర్ఘకాలిక విద్యుత్ వినియోగ ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్


రాజస్థాన్‌కు వచ్చే 25 ఏళ్ల పాటు సౌర విద్యుత్తు సరఫరా

ప్రతి సంవత్సరం 0.726 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించనున్న సౌర విద్యుత్‌ ప్రాజెక్టు

Posted On: 18 AUG 2023 11:46AM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు మంత్రిత్వ ఆధ్వర్యంలో పని చేసే నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NLC ఇండియా లిమిటెడ్, 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను సరఫరా కోసం సీపీఎస్‌యూ పథకం కింద రాజస్థాన్‌ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో దీర్ఘకాలిక విద్యుత్ వినియోగ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఎన్‌ఎల్‌సీఐఎల్‌కు ప్రస్తుతం 1,421 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది. కంపెనీ కార్పొరేట్ ప్రణాళిక ప్రకారం, 2030 నాటికి 6,031 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకోవాలని ఆలోచిస్తోంది.

పోటీ బిడ్డింగ్‌ ద్వారా, 'ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ' (ఐఆర్‌ఈడీఏ) సీపీఎస్‌యూ పథకం దశ-II ట్రంచ్-IIIలో ఈ కంపెనీ 510 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని దక్కించుకుంది. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా బార్సింగ్‌సర్‌లో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ సామర్థ్యం ప్రస్తుతం పని చేస్తోంది. ప్రాజెక్టు ఈపీసీ కాంట్రాక్టును పోటీ బిడ్డింగ్ ద్వారా టాటా పవర్ సోలార్ సిస్టమ్స్‌ దక్కించుకుంది.

రాజస్థాన్ రాష్ట్రానికి వచ్చే 25 సంవత్సరాలకు సౌర విద్యుత్ సరఫరా కోసం, 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు విద్యుత్ వినియోగ ఒప్పందంపై ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, రాజస్థాన్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌యూవీఎన్‌ఎల్‌) ఈ నెల 17న జైపుర్‌లో సంతకాలు చేశాయి. ఆర్‌యూవీఎన్‌ఎల్‌ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ డి.కె.జైన్, శ్రీ డి.పి.సింగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండు సంస్థల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

      

 

ఈ ప్రాజెక్టు నుంచి ఏటా 750 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ మొత్తం రాజస్థాన్ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. పునరుత్పాదక కొనుగోలు బాధ్యత లక్ష్యాలను చేరుకోవడంలో రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు సాయపడుతుంది.

ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్తు ప్రతి సంవత్సరం 0.726 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో, తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 1.40 గిగావాట్ల సామర్థ్యం కాకుండా, ఎన్‌ఎల్‌సీఐఎల్‌ ఇతర రాష్ట్రాలకు విస్తరించడం ఇదే తొలిసారి.

 

*****



(Release ID: 1950371) Visitor Counter : 122