సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోల్‌కతాలో జరుగుతున్న జీ-20 మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన యూకే భద్రతా శాఖ మంత్రి టామ్ తుగెన్‌ధాట్
చర్చల్లో టామ్ తుగెన్‌ధాట్ తో పాటు పాల్గొన్న ఉన్నత స్థాయి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి బృందం
రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడానికి అంగీకరించిన రెండు దేశాల మంత్రులు
అవినీతిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు అంతర్జాతీయ సహకారాన్ని
సమీకరించడానికి జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం పూర్తి సహకారం అందిస్తుంది .. డాక్టర్ జితేంద్ర సింగ్
అవినీతి నిర్మూలనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం కఠిన చర్యలు అమలు చేస్తోంది.. డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
13 AUG 2023 2:39PM by PIB Hyderabad
కోల్‌కతాలో జరుగుతున్న జీ-20 మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో యూకే భద్రతా శాఖ మంత్రి టామ్ తుగెన్‌ధాట్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చర్చల్లో టామ్ తుగెన్‌ధాట్ తో పాటు ఉన్నత స్థాయి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి బృందం పాల్గొంది. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
రెండు దేశాలు పారదర్శకమైన, అవినీతి రహిత సమాజాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో కఠిన చర్యలు అమలు చేస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
అవినీతి నిర్మూలన కోసం రెండు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించడానికి అమలు జరుగుతున్న చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరగాలన్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)తో వివిధ రంగాలలో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి రెండు దేశాల మధ్య విస్తృత సహకారం అవసరం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైనెస్ట్ కరప్షన్ ( యుఎన్‌సిఎసి )పై సంతకం చేసిన భారతదేశానికి , విదేశీ ప్రభుత్వ అధికారుల (విదేశీ లంచం) లంచానికి సంబంధించి యుఎన్‌సిఎసి లోని ఆర్టికల్ 16 ని అమలు చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బ్రిటన్ భద్రతా శాఖ మంత్రి టామ్ తుగెన్‌ధాట్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలలో విదేశీ ప్రభుత్వ అధికారుల లంచాన్ని ఎదుర్కోవడంపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) కన్వెన్షన్‌పై సంతకం చేయాలని ఆయన భారతదేశానికి సూచించారు.ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ లో బ్రిటన్ సభ్యత్వం కలిగి ఉంది.
యుఎన్‌సిఎసిని భారత్ ఇప్పటికే ఆమోదించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
'ప్రపంచం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం "వసుధైక కుటుంబం" స్ఫూర్తితో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అవినీతిని అరికట్టడానికి జీ-20 లో సభ్యత్వం కలిగి ఉన్న అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు రెండూ కలిసి పని చేయాలని నిర్ణయించాయి. అవినీతితో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల పరిష్కారానికి జీ-20 సభ్య దేశాలు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి ' అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా , జవాబుదారీతనంతో జరిగేలా చూసేందుకు చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనిలో భాగంగా ఇ-గవర్నెన్స్‌ను అమలు చేయడం , ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ కోసం ఆధార్ వ్యవస్థను అనుసంధానం చేయడం,వస్తు సేకరణ రంగంలో సంస్కరణలు అమలు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజల హక్కులు తెలియజేయడం లాంటి చర్యలు అమలు జరుగుతున్నాయన్నారు.
జీ-20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ (ACWG) ఫోరమ్, సంబంధిత ఉమ్మడి సమావేశాలలో భారతదేశం పాల్గొని పూర్తి సహకారం అందిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
“భారతదేశం నాయకత్వంలో జీ 20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ మూడు ఉన్నత-స్థాయి సూత్రాలకు ఆమోదం తెలిపింది. మూడు వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం లో అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేయడం , జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది రాజకీయ ప్రేరణ ఇస్తుంది. ”అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
***
(Release ID: 1948396)
Visitor Counter : 151