గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రైలు భద్రత దిశగా గత 9 ఏళ్లలో చేపట్టిన అవసరమైన చర్యలన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి: శ్రీ అర్జున్ ముండా
“దీనివల్ల 2000-01లో 473గా ఉన్న రైలు ప్రమాదాలు
2022-23 నాటికి గణనీయంగా తగ్గి 48కి దిగివచ్చాయి”
Posted On:
09 AUG 2023 4:39PM by PIB Hyderabad
దేశంలో రైలు భద్రత మెరుగుకు ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా తెలిపారు. దేశానికి జీవనాడివంటి రైల్వేలు ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలకు సులభ రవాణా మార్గంగా సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రైలు భద్రత కోసం గత 9 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆయన న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో వివరించారు. రైళ్లతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఈ మేరకు గత 9 సంవత్సరాలలో చేపట్టిన అన్నిరకాల అవసరమైన చర్యలూ సత్ఫలితాలిచ్చాయని ఆయన అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో, ప్రజలపరంగా పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి అనేక కీలక విస్తరణ ప్రాజెక్టులు చేపట్టిందని మంత్రి చెప్పారు. ఈశాన్య, మధ్య భారత ప్రాంతాలుసహా ఇతర ప్రాంతాల అనుసంధాన ప్రాజెక్టుల పరంగా ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుందని శ్రీ అర్జున్ ముండా అన్నారు.
రైలు ప్రమాదాల సంఖ్యను ప్రస్తావిస్తూ- 2000-01లో దేశవ్యాప్తంగా ప్రమాదాల సంఖ్య 473 కాగా, 2022-23 నాటికి బాగా తగ్గి 48కి పతనమైనట్లు వెల్లడించారు. ఆ మేరకు 2004-14 మధ్యకాలంలో వివిధ కారణాలవల్ల సంభవించిన ప్రమాదాల వార్షిక సగటు 171 కాగా, 2014-23 మధ్యకాలంలో 71కి తగ్గినట్లు ఆయన తెలిపారు. రైల్వే భద్రత పెంపు దిశగా ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్’ (ఆర్‌ఆర్‌ఎస్‌కె) పేరిట ఐదేళ్ల కాలానికి ముఖ్యమైన నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిద్వారా 2017-18లో కీలక భద్రత ఆస్తుల భర్తీ/పునరుద్ధరణ/ఉన్నతీకరణ కోసం రూ.1 లక్ష కోట్లతో మూలనిధిని ఏర్పరచినట్లు పేర్కొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఎస్‌కె’ కింద 2017-18 నుంచి 2021-22 వరకూ రూ.1.80 లక్షల కోట్లు స్థూలంగా ఖర్చుచేసినట్లు వివరించారు.
మానవ వైఫల్యం వల్ల వాటిల్లే ప్రమాదాలను తగ్గించేందుకు 31.05.2023 నాటికి 6,427 స్టేషన్లలో పాయింట్లు-సిగ్నళ్ల కేంద్రీకృత కార్యకలాపాలతో కూడిన ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
లెవల్ క్రాసింగ్ గేట్లవద్ద భద్రత పెంపు నిమిత్తం 31.05.2023నాటికి 11,093 గేట్ల వద్ద ‘ఇంటర్‌లాకింగ్ ఆఫ్ లెవల్ క్రాసింగ్ (ఎల్‌సి) గేట్ల’ను అమర్చినట్లు చెప్పారు. మరోవైపు భద్రత పెంచడంలో భాగంగా 31.05.2023 వరకూ 6,377 స్టేషన్లలో ఎలక్ట్రికల్ పద్ధతిలో పట్టాలపై రైళ్ల రద్దీ నిర్ధారణ (ట్రాక్ ఆక్యుపెన్సీ వెరిఫికేషన్) కోసం సంపూర్ణ ట్రాక్ సర్క్యూట్‌ను సమకూర్చినట్లు శ్రీ అర్జున్ ముండా తెలిపారు.
రైళ్లను నడిపే ‘లోకో పైలట్ల’ అప్రమత్తతకు ప్రాధాన్యమిస్తూ ఇంజన్లలో ‘విజిలెన్స్ కంట్రోల్ డివైజ్’ (విసిడి) అమర్చినట్లు చెప్పారు. వీటిద్వారా ముప్పు ఏర్పడే పరిస్థితి ఉన్నపుడు లోకో పైలట్లకు సకాలంలో హెచ్చరికలు అందుతాయని, తద్వారా ప్రయాణిక భద్రతకు భరోసా ఉంటుందని పేర్కొన్నారు.
పొగమంచు వంటి వాతావరణ పరిస్థితిలో దృగ్గోచరత తక్కువగా ఉన్నప్పుడు రైళ్లు నడిపే సిబ్బందికి ముందున్న సిగ్నల్ గురించి హెచ్చరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు శ్రీ అర్జున్ ముండా చెప్పారు. ఈ మేరకు విద్యుదీకరించబడిన మార్గాల్లో సిగ్నళ్లకు ముందు వెలుతురు పడితే కనిపించే హెచ్చరికలతో రెండు ‘ఒహెచ్‌ఇ’ స్తంభాలపై ‘రెట్రో-రిఫ్లెక్టివ్ సిగ్మా’ బోర్డులు అమర్చినట్లు వివరించారు. భద్రత దిశగా ఇలాంటి చర్యలన్నీ సత్ఫలితాలిచ్చాయని అన్నారు.
సామాన్య ప్రజల భద్రత, రక్షణ కోసం ప్రస్తుత ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలో ఆహార, ఇంధన భద్రతసహా ఆర్థిక వ్యవస్థకు రైల్వేల నుంచి ఇతోధిక సహకారం అందుతున్నదని మంత్రి వ్యాఖ్యానించారు.
రైల్వే భద్రత సంబంధిత చర్యలపై వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భద్రత అంశాన్ని ప్రదర్శన రూపంలో రైల్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అశోక్ నక్రా మీడియాకు వివరించారు.
వివరణాత్మక ప్రదర్శన కోసం ఇక్కడ క్లిక్ చేయండి
*****
(Release ID: 1947367)
Visitor Counter : 118