పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
డాల్ఫిన్ల పరిరక్షణ
Posted On:
07 AUG 2023 4:06PM by PIB Hyderabad
పవిత్ర గంగానది ప్రధాన స్రవంతిలో నివసించే డాల్ఫిన్ల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు నదీ డాల్ఫిన్లపై నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, గంగా ఉపనదులలో మాత్రం డాల్ఫిన్ల సంఖ్యలో క్షీణత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గంగానది డాల్ఫిన్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన కీలక చర్యలు ఇలా ఉన్నాయి:
- గంగా నది డాల్ఫిన్లకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పిస్తూ వాటిని వన్యప్రాణుల (రక్షణ) చట్టం-1972 షెడ్యూల్-I కిందగల జాబితాలో చేర్చారు.
- గంగా నది డాల్ఫిన్‌ను భారత జాతీయ జలజంతువుగా గుర్తించారు.
- కేంద్ర ప్రాయోజిత పథకం ‘వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి’ కింద రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం మంత్రిత్వ శాఖ గంగా నది డాల్ఫిన్‌ను వేగంగా అంతరిస్తున్న 22 జాతులలో ఒకటిగా చేర్చింది.
- బీహార్‌లోని ‘విక్రమశిల డాల్ఫిన్ అభయారణ్యం’ తరహాలో గంగా నది వెంబడిగల డాల్ఫిన్ల ముఖ్యమైన ఆవాసాలను కూడా రక్షిత ప్రాంతాలుగా ప్రకటించారు.
- నదీ డాల్ఫిన్లు, జలచర ఆవాసాల శ్రేయస్సుకు భరోసాగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (2022-2047) రూపొందించబడింది. ఇందులో వివిధ భాగస్వాములతోపాటు సంబంధిత మంత్రిత్వ శాఖల పాత్ర కూడా నిర్దేశించబడింది.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబే ఈ సమాచారం వెల్లడించారు.
*****
(Release ID: 1946553)
Visitor Counter : 169